Begin typing your search above and press return to search.

గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకు జగన్ తెచ్చుకుంటున్నారా?

By:  Tupaki Desk   |   12 Aug 2022 4:30 PM GMT
గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకు జగన్ తెచ్చుకుంటున్నారా?
X
మొండితనం ఉండటం రాజకీయ అధినేతకు ముఖ్యమే. తనను నమ్ముకొని ఉన్న వారికి అండగా నిలుస్తూ వారికి కాలపరీక్షలు ఎదురైనప్పుడు తాను ఉన్నానంటూ వారికి అండగా ఉండటం తప్పేం కాదు. కానీ.. దానికో లెక్క ఉంటుంది కదా? అవేమీ పట్టించుకోకుండా.. విపరిణామాల గురించి ఆలోచించకుండా మొండిగా ముందుకెళ్లే రాష్ట్ర పాలకుల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోమన్ రెడ్డి ముందుంటారన్న మాట ఈ మధ్యన ఎక్కువ వినిపిస్తోంది. తన పార్టీ నేతల తీరుపై వస్తున్న విమర్శల విషయంలో అన్నింటిని పట్టించుకోవాలని చెప్పటం లేదు కానీ.. ఇమేజ్ డ్యామేజ్ చేసే అంశాల విషయంలో కాస్తంత కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు.

అయితే.. అవేమీ పట్టించుకోకుండా తన మానాన తాను ఉండిపోతున్న తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇటీవల హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిందని చెబుతున్న వీడియో ఒకటి వైరల్ కావటం.. అందులో ఉన్నది తానే అయినా.. అందులో ఉన్నట్లుగా చేస్తున్నది తాను కాదని.. అదంతా కూడా ఒక పెద్ద కుట్రగా అభివర్ణించటం.. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చేయటం తెలిసిందే. సోషల్ మీడియాలో అంతలా వైరల్ అయ్యాక రాజకీయం కాకుండా పోతుందా?

గోరంట్ల వీడియో (?) విషయంలోనూ అలానే జరిగింది. సదరు వీడియో మార్ఫింగ్ జరిగిందన్నట్లుగా వాదనలు వినిపిస్తున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా ఈ మధ్యనే జిల్లా ఎస్పీ .. సదరు వీడియోలో ఉన్న అంశాల్ని పట్టించుకోవాలని తేల్చేశారు. ఇదే అదునుగా ఎంపీ గోరంట్ల సైతం ప్రెస్ మీట్ పెట్టి.. తన నోటికి ఉన్న పవర్ ఏమిటో చూపించేశారు. తాను అనుమానిస్తున్న వారిని నోటి మాటలతో చెప్పలేని విధంగా.. అక్షరాలతో రాయలేని రీతిలో తిట్టేశారు. ఈ వ్యవహారం పెనుదుమారంగా మారిది.

ఇప్పటికైనా ఈ లొల్లిని ముగించాలంటూ తనకు తానే చెప్పేకున్న ఆయనకు అనుకోని ఎదురుదెబ్బ తగిలే వీలుందంటున్నారు. ఆయనతో ఆగకుండా.. ఆయన మీద చర్యల విషయంలో పెద్దగా ఆసక్తి చూపని వైసీపీ అధినేతకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవన్న మాట వినిపిస్తోంది. ఈ వీడియో అంశం ఇప్పుడు దేశ రాజధానికి చేరింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ లేఖ రాశారు. అంతేకాదు.. స్పీకర్ కు.. జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు లేఖ రాశారు. మాధవ్ వీడియో వ్యవహారం పార్లమెంటు వ్యవస్థను దెబ్బ తీసేలా ఉందన్న వాదనను వినిపించారు.

ఈ వీడియో గురించి ఒక్కొక్కొరు ఒక్కోలా మాట్లాడుతున్నారని లేఖలో పేర్కొన్న ఆయన మాటలు ఈ ఇష్యూను మరో మలుపులోకి వెళ్లేలా చేసిందంటున్నారు. ఇదిలా ఉంటే ఈ వీడియో అంశంపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. దీనికి కారణం ఏపీ తెలుగు మహిళ విభాగం అధ్యక్షురాలు అనిత లేఖ రాయటమే. తక్షణమే తమ ఫిర్యాదును పరిశీలించి.. వీడియో అంశాన్ని స్వతంత్య్రంగా దర్యాప్తు చేయించి.. కమిషన్ కు నివేదిక ఇవ్వాలంటూ రాసిన లేఖతో ఇష్యూ మరింత ముదిరి పాకాన పడినట్లుగా చెబుతున్నారు.

రాష్ట్రం పరిధి దాటి ఢిల్లీకి వెళ్లిన ఈ వీడియోతో ఏపీ సీఎం జగన్ కు ఇబ్బందులు తప్పేట్లు లేవన్న మాట వినిపిస్తోంది. గోరంట్ల వీడియో ఎపిసోడ్ ను గోటితో తీసి పారేసే దానిని.. పేర పెట్టి ఇప్పుడు పెద్దది చేయటమే కాదు.. ఢిల్లీ వరకు వెళ్లేలా చేశారంటున్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ అధినేతకు తిప్పలు తప్పేలా లేవన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.