Begin typing your search above and press return to search.

బీజేపీని కాపీ కొట్టిన జగన్... ?

By:  Tupaki Desk   |   26 Jan 2022 8:39 AM GMT
బీజేపీని కాపీ కొట్టిన జగన్... ?
X
మంచి ఎక్కడ ఉన్నా తీసుకోవడంలో తప్పు లేదు. అదే సమయంలో తాను ఫలానా నుంచి మంచిని స్పూర్తిగా పొందాను అని చెప్పగలగాలి. అయితే వర్తమాన సమాజంలో ఎవరి నుంచి అయినా దాన్ని ఆశించడం కష్టం. ఇక పోటీతత్వంతో పాటు అధికారమే పరమావధిగా సాగే రాజకీయ క్రీడలో దాన్ని ఆశించడం బహు కష్టం. ఇవన్నీ ఎందుకు అంటే కొంతమంది పధకాలు ఆర్భాటంగా ప్రారంభిస్తారు. వాటి మీద తమ ముద్ర గట్టిగా వేసుకుంటారు. మేమే తెచ్చామని చెబుతారు.

అయితే ఫలానా చోట అవి అమలై జనాల్లోకి వెళ్తేనే రాజకీయ జీవులు వాటిని తమ వైపు ఒడుపుగా తిప్పుకుంటారు. అప్పట్లో అంటే చంద్రబాబు సీఎం గా ఉండగా తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉండేవారు. అక్కడ అమ్మ క్యాంటీన్లు అని జయలలిత పెట్టారు. తరువాత కాలంలో ఏపీలో అన్నా క్యాంటీన్లను చంద్రబాబు ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రారంభించారు. అయితే ఇది మంచి పధకం కాబట్టి అనుసరిస్తే తప్పు లేదు, కానీ తమ పధకమే ఇదని టీడీపీ చెప్పుకునేది.

ఇక రీసెంట్ గా తెలంగాణాలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు భారీ ఎత్తున కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇది ఆంధ్రాలో జగన్ అమలు చేస్తున్న నాడు నేడు నుంచే స్పూర్తి పొందిందని వైసీపీ నేతలు అంటారు. ఇక సర్కార్ బడులలో ఇంగ్లీష్ మీడియం ఏపీలో ముందు ప్రవేశపెడితే తెలంగాణాలో తాజాగా అమలు చేస్తామని ప్రకటించారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే మా మ్యానిఫేస్టోలో పెట్టిన దాన్ని జగన్ పాటించారు అంటున్నారు బీజేపీ నేతలు. అసలు ఇంతకీ ఏంటా హామీ, జగన్ ఎందుకు దాన్ని కాపీ కొట్టారు అంటే ఏపీలో ప్రతీ లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తామన్నది బీజేపీ ఆలోచనగా సోము వీర్రాజు చెబుతున్నారు. అవును ఇది నిజమే అని కూడా బీజేపీ నేతలు అంటున్నారు. 2014లో ఏపీ రెండు ముక్క‌లు అయింది. విభజన ఏపీలో జిల్లాలు తక్కువ ఉన్నాయి. పైగా భౌగోళిక రిత్యా పెద్ద రాష్ట్రం.

దాంతో నాటి బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ కంభంపాటి హరిబాబు ఏపీలో 25 ఎంపీ సీట్లను 25 జిల్లాలుగా మరుస్తామని ప్రకటించారు. దాన్ని 2014 ఎన్నికల ప్రణాళికలో కూడా బీజేపీ పెట్టింది. అప్పట్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చింది. ఇక బీజేపీ అప్పట్లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయమని టీడీపీని కూడా కోరుతూ వచ్చింది.

ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ మ్యానిఫేస్టోలో కొత్త జిల్లాల ఊసు లేదు. ఇక జగన్ 2017లో పాదయాత్ర వేళ కూడా మొదటి సభల్లో ఆ ప్రస్థావన లేదు. కానీ తరువాత కాలంలో మాత్రం కొత్త జిల్లాల హామీ వచ్చింది. ఆయన తిరుగుతున్న చోట్లలో ఈ డిమాండ్ ఉండడంతో అధ్యయనం చేసిన మీదట వైసీపీ ఈ హామీని ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే పాతిక జిల్లాలు చేస్తామని జగన్ తరువాత చెప్పుకుంటూ వెళ్లారు.

మొత్తానికి మూడేళ్ల పాలనకు దగ్గరపడుతున్న వేళ జగన్ దాన్ని అమలు చేస్తున్నారు. అయితే దీని మీద తాజాగా స్పందించిన సోము వీర్రాజు మాత్రం కొత్త జిల్లాల ఏర్పాటు బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలోని అంశమని స్పష్టంగా చెప్పుకొచ్చారు. మరి జగన్ దీన్ని అమలు చేయడాన్ని ఆయన స్వాగతిస్తున్నారా అంటే చెప్పలేదు కానీ తమ హామీ జగన్ కాపీ కొట్టాడు అన్న సౌండ్ మాత్రం ఇచ్చారు. చూడాలి మరి దీని మీద బీజేపీ ఇంకెలా రియాక్ట్ అవుతుందో. ఒక వేళ కొత్త జిల్లాల అంశం క్లిక్ అయితే మాత్రం పొలిటికల్ క్రెడిట్ కోసం బీజేపీ పోటీ పడడం ఖాయమని అంటున్నారు.