Begin typing your search above and press return to search.

అమెరికాలో మనోళ్ల పరిస్థితి అంత దారుణంగా ఉందా?

By:  Tupaki Desk   |   8 April 2020 4:15 AM GMT
అమెరికాలో మనోళ్ల పరిస్థితి అంత దారుణంగా ఉందా?
X
ప్రపంచానికే పెద్దన్న అమెరికాలో కరోనా ఎంతటి ఉత్పాతాన్ని సృష్టించిందో గణాంకాలు చెప్పేస్తాయి. మరే దేశంలో లేని రీతిలో అమెరికాలో భారీ ఎత్తున పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆంక్షల్ని ప్రజలు పట్టించుకోకపోవటం.. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించకపోవటం లాంటి నిర్ణయాలు దారుణ పరిస్థితులకు కారణంగా చెప్పక తప్పదు. అమెరికా లో తెలుగోళ్ల పరిస్థితి ఎలా ఉందన్న విషయానికి సంబంధించి ప్రముఖ మీడియా సంస్థ.. తన ప్రతినిధుల చేత రిపోర్టు చేయించింది. ఈ సందర్భంగా కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కొన్ని ఉదంతాల్ని విన్నంతనే విషాదంలో మునిగిపోయే పరిస్థితి.

అధికారిక లెక్కలు లేకున్నా.. దాదాపు భారత జాతీయులు అమెరికా లో వంద మంది వరకూ కరోనా కారణంగా మరణించి ఉంటారని అంచనా. ఇలా మరణించిన వారిలో న్యూయార్క్.. న్యూజెర్సీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. అమెరికాలో సీనియర్ జర్నలిస్టుగా పేరున్న తెలుగు వ్యక్తి బ్రహ్మ కూచిబొట్ల రెండు రోజుల క్రితం న్యూయార్క్ ఆసుపత్రి లో కన్నుమూశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయటానికి బజారుకు వెళ్లిన ప్రతి ఇద్దరు తెలుగు వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా తేలుతుండటంతో.. ఇంట్లో నుంచి అడుగు తీసి బయటకు వెళ్లటానికి భయపడి పోతున్నారు. న్యూజెర్సీ లో కర్ణాటక కు చెందిన ఒక కుటుంబం లో తండ్రి..కొడుకు కరోనా కారణంగా మరణించగా.. అత్తా కోడలు ఇద్దరూ ఒంటరిగా మిగిలారు. వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని చెబుతున్నారు. కరోనా భయంతో వారిని పరామర్శించేందుకు సైతం వారింటికి ఎవరూ రాని దుస్థితి. ఇదొక్కటి చాలు.. ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారో అర్థమైపోతుంది.

ఒక అంచనా ప్రకారం న్యూయార్క్.. న్యూజెర్సీలలో ప్రతి రోజుకు తక్కువ లో తక్కువగా వేసుకున్నా.. నలుగురు తెలుగువారు కరోనా పాజిటివ్ గా తేలుతున్నట్లుగా చెబుతున్నారు. కష్టంలో ఉన్న వారికి సాయం చేసే పరిస్థితి లేకపోవటంతో.. ఇప్పుడు కొత్త తరహా మానసిక సమస్యలు తలెత్తుతున్నట్లుగా చెబుతున్నారు. అమెరికాలో ఉన్న తెలుగువారిలో ఎక్కువమంది ఇవాల్టి రోజున.. తామెందుకు దేశం విడిచి వచ్చామన్న వేదనకు గురికావటం గమనార్హం. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఒకవైపు.. ఏ మాత్రం తేడా కొట్టినా తమ కుటుంబం పరిస్థితి ఏమిటన్న భయాందోళనలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేయటం గమనార్హం.