Begin typing your search above and press return to search.

నాడు బాబు.. నేడు జ‌గ‌న్‌.. సేమ్ టు సేమేనా...?

By:  Tupaki Desk   |   22 Oct 2021 3:30 AM GMT
నాడు బాబు.. నేడు జ‌గ‌న్‌.. సేమ్ టు సేమేనా...?
X
రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీల మ‌ధ్య జ‌రుగుతున్న వివాదం..యుద్ధానికి దారితీసిన ప‌రిస్తితులు క‌నిపిస్తున్నా యి. ఈ క్రమంలో టీడీపీ సీనియ‌ర్లు.. గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు వంటివారు.. ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. క‌నీసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అంటే.. జ‌గ‌న్‌కు విలువ లేదు. క‌నీసం మాజీ ముఖ్య‌మంత్రి, మూడు సార్లు సీఎం అయిన‌.. చంద్ర‌బాబు అంటే క‌నీసం విజ్ఞ‌త లేకుండా.. వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. అని కామెంట్లు చేశారు. ఇక‌, ఇటు చూస్తే.. వైసీపీ సీనియ‌ర్లు.. జూనియ‌ర్లు కూడా ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రిపైనే బూతులు ప్ర‌యోగిస్తారా? ముఖ్య‌మంత్రి అంటే క‌నీసం విలువ లేదా? అని ప్ర‌శ్నించారు. నిప్పులు చెరిగారు.

మొత్తంగా ఇరు ప‌క్షాలుకూడా.. మాకు విలువ ఇవ్వ‌డం లేదు.. మేమంటే ఖాత‌రు చేయ‌డం లేదు. మాపై బూతులు మాట్లాడు తున్నారు. అంటూ.. ఒక‌రిపై ఒక‌రు నింద‌లు వేసుకుంటున్నారు. వ్యాఖ్య‌లు చేసుకుంటున్నారు. నిజ‌మే! ఈ వ్యాఖ్య‌లు విన్న‌ప్పుడు ఒక విష‌యం గుర్తుకు వ‌స్తుంది. గ‌తానికి భిన్నంగాఏపీలో ఏమీ జ‌ర‌గ‌డం లేదు.. అనే కామెంట్లు మేధావుల నుంచి వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. వైసీపీకి 67 మంది ఎమ్మెల్యేలు వ‌చ్చాయి. అంటే.. రాష్ట్రంలోని 175 స్థానాల‌తో పోల్చుంటే.. మెరుగైన ప్ర‌తిప‌క్షంగానే వైసీపీ అవ‌త‌రించింది. ఇక‌, అధికారంలోకి చంద్ర‌బాబు వ‌చ్చారు. సీఎం అయ్యారు. సీనియ‌ర్ మోస్ట్ సీఎం అని చాటుకున్నారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఒక సీనియ‌ర్ సీఎంగా ఆనాడు... వైసీపీని ఆయ‌న ప్ర‌తిప‌క్షంగా చూశారా? ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌ను ఏమైనా విలువ ఇచ్చారా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఏనాడూ.. చంద్ర‌బాబు విలువ ఇవ్వ‌లేదు. పైగా.. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష‌మే లేదు.. అని వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. అసెంబ్లీలోనూ తామే ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తున్నామంటూ.. వ్యాఖ్యానించారు. అంతేకాదు ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందు.. ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలోకి చేర్చుకున్నారు. అదేమంటే.. అభివృద్ధికి ఫిదా అయి వ‌స్తున్న‌వారిని ఎలా అడ్డు చెబుతాం.. అని వ్యాఖ్యానించారు. వీరిలో కొంద‌రికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. అంటే.. ఆనాడు అధికారంలో ఉన్న చంద్ర‌బాబు... 67 మంది ఎమ్మెల్యేల‌తో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీని ఖాతరు చేయ‌లేదు.

క‌నీసం.. అసెంబ్లీలోనూ మాట్లాడే స‌మ‌యం ఇవ్వ‌లేద‌ని, దామాషా ప్ర‌కారం కూడా త‌మ‌కు ఇవ్వ‌కుండా అడ్డుకున్నార‌ని.. అప్ప‌ట్లోనే వైసీపీ ఆరోప‌ణ‌లు గుప్పించింది. ఇక‌, ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయింది. ఎంత ఘోరంగా అంటే.. ఇప్పుడు ఇదే టీడీపీ 23 మంది ఎమ్మెల్యేల‌ను మాత్ర‌మే గెలిపించుకుంది. ఇక‌, ఎన్నిక‌లు ముగిసిన ఏడాదిలోనే న‌లుగురు ఎమ్మెల్యేలు జంప్ చేశారు. ఇక‌, ఇప్పుడు వైసీపీ త‌మ‌కు ఎక్క‌డా విలువ ఇవ్వ‌డం లేద‌ని.. మాజీ సీఎంగా చంద్ర‌బాబును అస‌లు గౌర‌వించ‌డం లేద‌ని.. టీడీపీ సీనియ‌ర్లు చెబుతున్నారు.కానీ, గ‌తాన్ని గుర్తు చేసుకుంటే.. టీడీపీ చేసిందే.. ఇప్పుడు వైసీపీ చేస్తోంద‌నేది విశ్లేష‌కుల వాద‌న‌.

ఇక‌, అధికార పార్టీ విష‌యానికి వ‌ద్దాం. నాడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో ముఖ్య‌మంత్రి అయిన చంద్ర‌బాబు ను ఎక్క‌డా లెక్క చేయ‌లేదు. వాడు .. వీడు.. అంటూ.. అప్ప‌ట్లోనే కొంద‌రు ఎమ్మెల్యేలు నోరు పారేసుకున్నారు. ఇక‌, జ‌గ‌న్ న‌డిరోడ్డుపై కాల్చి చంపినా త‌ప్పులేద‌ని పిస్తోందంటూ.. వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడు సీఎంగా జ‌గ‌న్‌ను టీడీపీ గుర్తించాల‌ని కోరుకోవ‌డ‌మే ఇప్పుడు చిత్రంగా ఉంది. అదేస‌మ‌యంలో నాడు నిత్యం ముఖ్య‌మంత్రిని విమ‌ర్శించారు. ఇప్పుడు టీడీపీ నేత‌లు కూడా అదే ప‌నిచేస్తున్నారు. నాడు కేంద్రానికి లేఖ లు రాసి పోల‌వ‌రం ప‌నుల‌కు అడ్డంకులు తెచ్చారు. ఇప్పుడు టీడీపీ అదే ప‌నిచేస్తోంది. నాడు.. ప్ర‌తి విష‌యంపైనా.. కోర్టుల్లో కేసులు వేశారు వైసీపీ నాయ‌కులు.. ముఖ్యంగా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, విజ‌యసాయిరెడ్డి కేసులు ముందుండి న‌డిపించారు.

ఇప్పుడు టీడీపీ నేత‌లు కూడా తెర‌చాటుగా ఇదే ప‌నిచేస్తున్నారు. ప్ర‌బుత్వం తీసుకుంటున్న ప్ర‌తి నిర్ణ‌యాన్నీ వీరు కోర్టులో స‌వాల్ చేయిస్తున్నారు. అంటే.. నాడు టీడీపీ హ‌యాంలో వైసీపీ ఎలా చేసిందో.. ఇప్పుడు సేమ్ టు సేమ్ .. వైసీపీ హ‌యాంలో టీడీపీ కూడా అలానే చేస్తోంది. అంతేత‌ప్ప‌.. ఈ రెండు పార్టీల్లోనూ పె ద్ద‌గా తేడా ఏమీ క‌నిపించ‌డం లేదు. కాక‌పోతే.. నాడు చంద్ర‌బాబు సుతిమెత్త‌గా చెబితే.. నేడు వైసీపీ నాయ‌కులు సుత్తితో బ‌దులిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఏతా వాతా ఎలా చూసినా.. ఈ రెండు పార్టీల వ‌ల్ల ప్ర‌జ‌లు మాత్ర‌మే స‌మిధ‌లుగా మారుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అస‌లు ఈ రెండు పార్టీలూ త‌మ‌కు అవ‌స‌ర‌మా? అనే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తే.. ఈ రెండు పార్టీల నేత‌లు ప్ర‌జ‌లు ఏం చెబుతార‌ని అంటున్నారు.