జీహెచ్ ఎంసీలో బీజేపీ టార్గెట్ 38 సీట్ల మీదనేనా? అవి ఇవేనా?

Wed Nov 18 2020 16:40:22 GMT+0530 (IST)

Is BJP target on 38 seats in GHMC? Are they?

కేంద్రంలో అధికారంలో ఉంది.. దుబ్బాకలో మొన్ననే దున్నేసింది.. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరవేస్తామని అంది.. మరి ఇన్ని సవాళ్లు చేసిన బీజేపీ పట్టుమని 38 సీట్లలో మాత్రమే ఫోకస్ చేయడం ఏంటి? టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విసిరిన జీహెచ్ఎంసీ సవాల్ లో 150 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే దమ్ము బీజేపీకి లేదా? కేవలం గెలుపు అవకాశాలుండే హిందుత్వ 38 డివిజన్లపైనే కన్నేసిందా? అంతమందితోనే లిస్ట్ రెడీ చేసిందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఈ మేరకు బీజేపీ గెలుపు అవకాశాలున్న 38 డివిజన్లు అభ్యర్థుల లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో బీజేపీ బలం అక్కడికే పరిమితమా అన్న చర్చ రాజకీయ వర్గాలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.దుబ్బాకలో గెలిచి జోరుమీదున్న బీజేపీ ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టి సారించింది. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా ప్రకటించారు. కానీ సీన్ కట్ చేస్తే...   చరిత్ర చూస్తే మాత్రం బీజేపీకి అంత ఈజీ కాదని పరిశీలకులు అంటున్నారు. జీహెచ్ఎంసీలో పోయిన సారి  ఓకే ఒక్క కార్పొరేటర్ నే గెలిచి బీజేపీ సరిపెట్టుకుంది. అయితే రాను రాను తెలంగాణలో బలం పెంచుకొని కాంగ్రెస్ ను పక్కకు తప్పించి టీఆర్ఎస్ కు ప్రత్యామ్మాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోంది. బీజేపీ నేతలు బలంగా ముందుకు వెళుతున్నారు. టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటున్నారు. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టాక ఆ పార్టీ దూకుడు ఎక్కువైంది.

దుబ్బాకలో విజయం బీజేపీకి టానిక్ మాదిరి పనిచేస్తోందట.. అందుకే అన్ని సీట్లలో కాకుండా ఈసారికి హిందువుల ఓట్లు బలంగా ఉన్న డివిజన్లలో గట్టిగా పోరాడాలని బీజేపీ డిసైడ్ అయినట్టు భోగట్టా. దీనిపై శూలశోధన చేసిన బీజేపీ 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 38 డివిజన్లను టార్గెట్ చేసిందట.. కనీసం 30 కార్పొరేటర్ సీట్లు గెలవాలని హైకమాండ్ నుంచి రిపోర్ట్ వచ్చిందని ప్రచారం సాగుతోంది.
 
జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ సెంట్రల్  టీం కూడా ఈసారి సీరియస్ గా తీసుకొని ఎప్పటికప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతోందట.. డివిజన్లలో సర్వేలు చేయించుకొని హైకమాండ్ కు రిపోర్ట్ లను పంపిస్తున్నారట..
 
ఇక సోషల్ మీడియాను పెద్ద ఎత్తున వాడుకొని వరదల వీడియోలు తీసి అవి సోషల్ మీడియాలో బాగా వాడుకోవాలని కూడా ఆదేశించారంట.. ఏది ఏమైనా బీజేపీ ఊపులో ఉందని.. ఈ క్రమంలోనే గ్రేటర్ లోనూ సత్తా చాటాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి జీహెచ్ఎంసీలో బీజేపీ 38 సీట్లకే పరిమితమై ఆ డివిజన్లలో గన్ షాట్ గా గెలవాలని యోచిస్తోందని తెలుస్తోంది. దీన్ని బట్టి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న ఆసక్తి బీజేపీకి లేదని తెలుస్తోంది. మరి బీజేపీ ఆశించినట్టు  ఓటర్లు  పట్టం కడుతారా లేదా అనేది వేచిచూడాలి..