Begin typing your search above and press return to search.

ప్రజలు ఏడుస్తుంటే బీజేపీ నవ్వుతోందా?

By:  Tupaki Desk   |   21 April 2021 9:30 AM GMT
ప్రజలు ఏడుస్తుంటే బీజేపీ నవ్వుతోందా?
X
ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడు ఏడుస్తూనే ఉన్నారు. కరోనాతో దేశం అల్లకల్లోలం అవుతోంది. ప్రజలంతా కరోనాతో ఆస్పత్రుల పాలవుతున్నారు. ఆ మహామ్మారి ధాటికి మరోసారి లాక్ డౌన్, కర్ఫ్యూలతో ఉద్యోగ ఉపాధికి దూరమవుతున్నారు. ప్రజలు ఏడుస్తుంటే కేంద్రంలోని బీజేపీ మాత్రం చోద్యం చూస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

దేశంలో కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. కేసులు జెట్ స్పీడుగా పెరుగుతున్నాయి. ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ తీవ్రంగా ఉంది. గత సంవత్సరం జనాలు పడ్డ ఇబ్బందుల దృష్ట్యా ఈసారి కేంద్రంలోని మోడీ సర్కార్ చర్యలు చేపడితే ఈ ఉపద్రవాలు వచ్చేవి కావన్న విమర్శ ఉంది.. కానీ ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు పెను శాపం అవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే మోడీ వైఫల్యాన్ని ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎత్తిచూపారు. రెండే వేవ్ పాపం ఖచ్చితంగా మోడీదేనని.. దేశంలో చర్యలు తీసుకోకుండా.. వ్యాక్సిన్లు పంపిణీ చేయకుండా తన పరపతి కోసం విదేశాలకు పంచాడని విమర్శించారు.

తాజాగా మోడీపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. దేశంలో కరోనా కట్టడిలో కేంద్రం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ఆరోపించారు. దేశంలో టీకాల కొరతకు కేంద్రమే కారణం అని మండిపడ్డారు.

దేశంలో ప్రణాళిక లేమి వల్లే రెమిడెసివిర్, ఆక్సిజన్ కొరత ఏర్పడిందని ప్రియాంక ఆరోపించారు. కరోనాతో ప్రజలు ఏడుస్తుంటే.. బీజేపీ నేతలు ఎన్నికల ర్యాలీల్లో నవ్వుతూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. నవ్వులు ఆపి ప్రజల బాధలను మోడీ పట్టించుకోవాలని విమర్శించారు.