Begin typing your search above and press return to search.

బీజేపీ ప్లస్ టీడీపీ : జనసేనాని బస్సు ఎటు ...?

By:  Tupaki Desk   |   11 Aug 2022 9:24 AM GMT
బీజేపీ ప్లస్ టీడీపీ : జనసేనాని బస్సు  ఎటు ...?
X
ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర బీజేపీ నాయకత్వం తెలుగుదేశానికి బాహాటంగానే చేయి అందించింది. చంద్రబాబు అవసరం ఇపుడు ఉందని మోడీ సహా కేంద్ర పెద్దలు గుర్తించారు. రోజు రోజుకీ ఎన్డీయే నుంచి బయటకు బలమైన మిత్రులు వెళ్ళిపోతున్న నేపధ్యంలో చంద్రబాబు లాంటి సీనియర్ మోస్ట్ నేత, చాణక్యుడు అయిన నేత తమ వెంట ఉన్నారు అని చెప్పుకోవడమే ఇపుడు బీజేపీకి ఈ రోజునకు కావాల్సింది.

అదే సమయంలో ఏపీలో రాజకీయంగా తన గేమ్ ప్లాన్ స్టార్ట్ చేయడానికి బాబుకు కూడా బీజేపీ అండ అవసరం. ఇలా పరస్పర అవగాహంతోనే ఢిల్లీలో మోడీ బాబు షేక్ హ్యాండ్ మీటింగ్ జరిగింది అని అంటున్నారు. సరే ఇది బాగానే ఉంది. 2014లో పోటీ చేసినట్లుగా 2024లో కూడా బీజేపీ టీడీపీ జట్టు కడతారు. పోటీ చేస్తారు. కానీ జనసేన సంగతేంటి. జనసేన కూడా ఈ కూటమిలో చేరుతుందా చేరితే వచ్చే అతి పెద్ద రాజకీయ లాభమేంటి అన్నది కూడా ఇపుడు చర్చగా ఉంది.

నిజానికి పవన్ కోరుకున్నది కూడా వైసీపీ వ్యతిరేక కూటమికే. అందుకే ఆయన జనసేన ఆవిర్భావ సభలో పిలుపు కూడా ఇచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలిపోనీయను అని కూడా చెప్పుకొచ్చారు. అయితే పవన్ చెప్పినది ఎలా ఉంది అంటే తానే కూటమికి పెద్దన్నగా ఉంటూ అటూ టీడీపీ ఇటు బీజేపీని నడిపించాలని, అలాగే జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ తగ్గాలని, ఏపీలో బలమైన టీడీపీ కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తగ్గాలని పవన్ కోరారు.

అయితే పవన్ పార్టీ నుంచి పవర్ షేరింగ్ డిమాండ్ ఇండైరెక్ట్ గా వచ్చిన మీదట తెలుగుదేశం ఆలోచనలు మారాయి. దాంతో నేరుగానే బీజేపీతో పొత్తులకు ఆ పార్టీ ప్రయత్నాలు చేసింది. కేంద్రంలోని బీజేపీ కూడా తన రాజకీయ పరిస్థితులు కొంచెం ప్రతికూలం అవుతున్న వేళ బాబుని దగ్గరకు చేర్చుకుంటోంది. అంతా బాగానే ఉంది. కానీ ఈ రెండు పార్టీలు కలిస్తే ఏపీలో జనసేన కూడా వారితో జట్టు కడుతుందా. అలా జరగాలని ఏమైనా రూల్ ఉందా అన్నదే ఇపుడు చర్చంతా.

జనసేన ఆలోచన ఒక్కటే. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా తమతో ఎవరు జట్టు కట్టినా పవన్ సీఎం కావాల్సిందే. ఈసారి కాకపోతే మరోసారికి సీఎం పదవి అని వాయిదా వేసుకోవడానికి లేనే లేదు అన్నది కూడా జనసేన గట్టి పట్టుదల. అయితే బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకున్నాక పవర్ షేరింగ్ విషయంలో ఆ పార్టీలను ప్రశ్నించే విషయమే ఉండదని కూడా జనసేనకు తెలుసు.

నిజానికి జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయి. బీజేపీ టీడీపీతో పొత్తు అంటే తమ నాయకుడు మిత్రుడు పవన్ కూడా సీఎం కావాలని, ఆ దిశగా పవర్ షేరింగ్ ఉండాలని డిమాండ్ పెట్టాల్సి ఉంది. కానీ ఇపుడున్న పరిస్థితులలో బీజేపీ అలా ఎందుకు చేస్తుంది. అయినా ఏపీలో బీజేపీ జనసేనల మధ్యన‌ అంత సాన్నిహిత్యం ఉందా అన్నది కూడా ప్రశ్నగా ఉంది.

అలా కానపుడు పవన్ తనతో టీడీపీ పొత్తు పెట్టుకోవాలంటే పవర్ షేరింగ్ ఉండాల్సిందే అని షరతు పెడితే ఒప్పుకుంటారా. ఇది కూడా కీలకమైన ప్రశ్నగానే చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో పవర్ షేరింగ్ నకు అవకాశం లేదని చెప్పేందుకే బీజేపీని దువ్వి మరీ టీడీపీ తన దారికి తెచ్చుకుంది. ఆ విధంగా తమతో పొత్తు కట్టాల్సిన అనివార్యతను జనసేనకు టీడీపీ ఇపుడు కల్పిస్తోంది అని అంటున్నారు.

మొత్తానికి అనూహ్యంగా టీడీపీ బీజేపీ పొత్తు దారిన నడవడం అన్నది జనసేనకు ఇబ్బందిగానే ఉంది అంటున్నారు. ఈ రెండు పార్టీలతో కలిస్తే కొన్ని సీట్లు పొత్తులో భాగంగా వస్తాయి తప్ప సీఎం సీటు పవర్ షేరింగ్ అన్నది మాత్రం అసలు జరిగే వ్యవహారం కాదని తేలిపోతోంది. మరి ఇలాంటి వేళ జనసేన ఏం చేస్తుంది. తన రాజకీయ వ్యూహం ఏంటి అన్నదే ఆసక్తిగా ఉంది. అక్టోబర్ 5 నుంచి పవన్ చేయబోయే బస్సు యాత్రతోనే చాలా విషయాల మీద స్పష్టత వస్తుందని అంటున్నారు.