Begin typing your search above and press return to search.

విజయ సాయి రెడ్డి వాదనను ఎంతగా వక్రీకరించారంటే?

By:  Tupaki Desk   |   18 Nov 2019 9:40 AM GMT
విజయ సాయి రెడ్డి వాదనను ఎంతగా వక్రీకరించారంటే?
X
రూల్ అంటే రూలే. చేసిన తప్పులకు చెంపలేసుకోవటం లేదంటే దానికి మూల్యం చెల్లించాల్సి రావటం మామూలే. తాజాగా మాజీ హోంమంత్రి చిదంబరం ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. యూపీఏ హయాంలో ఆయన చేపట్టిన ప్రతీకార చర్యల్ని ఎవరు మాత్రం మర్చిపోగలరు. తన తండ్రి మరణించిన వేళ.. ఓదార్పు యాత్రను చేపట్టాలన్న జగన్ నిర్ణయం కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు కోపం రావటమే కాదు.. యువనేతను కట్టడి చేసేందుకు ఎన్నెన్ని ప్రయత్నాలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న వేళ వేధింపులకు గురి చేసి.. కొత్త పార్టీ పెట్టుకునే వరకూ తీసుకెళ్లిన సోనియా.. ఆ తర్వాత కూడా జగన్ మోహన్ రెడ్డి విషయంలో ఎలా వ్యవహరించారో అందరికి తెలిసిందే. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతి చేసినట్లుగా ఆరోపణలు చేపట్టి.. తమ అధీనంలో ఉన్న సీబీఐని ఉసిగొల్పి పెట్టించిన కేసుల వెనుక అసలు విషయం బహిరంగ రహస్యం.

పార్లమెంటు సమావేశాల ప్రారంభమవుతున్న వేళ.. అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వినిపించిన వాదనపై అమిత్ షా క్లాస్ పీకినట్లుగా.. కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయే కానీ.. విజయసాయి రెడ్డి వాదనను మాత్రం పరిగణలోకి తీసుకోలేదన్నది మర్చిపోకూడదు.

వైఎస్ జగన్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన్ను కేసుల మీద జైలుకు పంపిన యూపీఏ సర్కారు.. ఆయన బెయిల్ మీద విడుదలైన తర్వాత పార్లమెంటుకు హాజరయ్యేందుకు అనుమతించలేదు. ఇప్పుడు మాజీ కేంద్రమంత్రి చిదంబరం మీద కూడా కేసులు ఉన్నాయి. వాటి కారణంగా తీహార్ జైలుకు వెళ్లారు. అలాంటప్పుడు ఆయన్ను పార్లమెంటు సమావేశాలకు హజరయ్యేందుకు అనుమతి ఎలా ఇస్తారు? అన్న ప్రశ్న అడిగితే.. అమిత్ షాకు ఎందుకంత కోపం? అన్నది ప్రశ్న.

ఇప్పటికే చిదంబరం జైలుకు పంపిన విషయంలో బీజేపీకి జరిగిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్న షా.. విజయసాయి రెడ్డి గతాన్ని గుర్తు చేయటం.. అందులో న్యాయం ఉండటంతో దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి. ఒకవేళ జగన్ విషయంలో అన్యాయం జరిగిందన్న మాటను ఒప్పుకుంటే చిదంబరాన్ని అనుమతించలేని పరిస్థితి. చిదంబరాన్ని అనుమతించని పక్షంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అబ్లిగేషన్ ను నో చెప్పలేని దుస్థితి.

అందుకే..అవసరం లేకున్నా.. ప్రాంతీయ పార్టీల మీద షాలాంటోళ్లకు ఉన్న చిన్నచూపుతో నోరు పారేసుకున్నారని చెప్పాలి. రాజకీయ కారణాలతో పెట్టిన కేసుల్లో జైలుకు వెళ్లిన ఒక పార్టీ అధ్యక్షుడ్నిపార్లమెంటుకు అనుమతించే విషయంలో యూపీఏ ఒకలా వ్యవహరించటమే కాదు.. తన వరకూ వచ్చినంతనే మాట మార్చేస్తున్న వైనాన్ని తప్పు పట్టటం సబబే. కానీ.. ఆ విషయం ఒప్పుకుంటే తమ పెద్దరికానికి తిప్పలు వచ్చే అవకాశం ఉండటంతో.. దాన్ని అధిగమించే ప్రయత్నంలోనే విజయసాయి రెడ్డి మీద నోరు పారేసుకున్నారని చెప్పాలి. దొరికిందే సందు అన్న రీతిలో విజయసాయి రెడ్డి మీద అహంకారంతో షా అన్న మాటల్ని.. తమకు తగ్గట్లు వాదనను వినిపించాయి జగన్ ను వ్యతిరేకించే వర్గం. విషయం ఏదైనా సూటిగా.. అందరికి ఒకేలాంటి న్యాయం ఉండాలే కానీ.. వివక్ష ఉండకూడదన్న ప్రశ్న.. అన్యాయమైనది ఎందుకవుతుంది? ఎలా అవుతుందని అడిగితే మాత్రం సమాధానం రాని పరిస్థితి.