మద్యనిషేధం: అమెరికాలో కానిది.. ఏపీలో అవుతుందా?

Mon Jun 01 2020 22:31:18 GMT+0530 (IST)

Alcohol ban: Not possible in American .. Is it in AP?

ఇటీవల లాక్ డౌన్ లో వైరస్ వ్యాపిస్తుందని మద్యం దుకాణాలు బార్లు అన్నింటిని మూసివేశారు. మద్యం దొరక్క పేదలు సామాన్యులు పిచ్చివాళ్లై ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేరారు. కానీ ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ధనవంతులు కాస్త డబ్బున్న వారికి మద్యం దొరికింది.. ఇంట్లో ఉండే ఫుల్లుగా తాగేశారు.. మద్యనిషేధం అమల్లో ఉన్నా అక్రమ మార్గాల్లో మద్యం అంతటా దొరికింది కానీ అది భారీ రేటుకు.. ఆ ధర పెట్టలేని సామాన్యులకు దొరక్క విలవిలలాడగా.. బడాబాబులు మాత్రం లాక్ డౌన్ లో మందు విందులతో ఎంజాయ్ చేశారు.గాంధీ పుట్టిన గుజరాత్ లో ఎప్పటి నుంచో మద్య నిషేధం అమల్లో ఉంది. కానీ ఆ రాష్ట్రంలో మద్యానికి ఇప్పటికీ కొదవలేదు. పక్కనున్న మహారాష్ట్ర రాజస్థాన్ మధ్యప్రదేశ్ డామన్ డయ్యూ నుంచి విచ్చలవిడిగా అక్రమ మద్యం ఏరులై పారుతూనే ఉంటుంది. ఇక సారాయి గుండుంబా వంటి చీప్ మద్యంను పేదలు తాగుతూనే ఉంటారు. చస్తూనే ఉంటారు.

ఇక బీహార్ లో సీఎంగా నితీష్ గద్దెనెక్కగానే పాక్షిక మద్యనిషేధం అమలు చేశారు. కానీ రాజకీయం రౌడీయిజంగా బాగా ఉండే బీహార్ లో మద్యం ఏరులై పారుతూనే ఉంటుంది. చరిత్రలో ఏ సంఘటన చూసినా కూడా మద్యనిషేధం అనేది అమలైన దాఖలాలు కనిపించడం లేదు.

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం విధించబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ చరిత్రలో మద్య నిషేధ అనుభవాలు.. భారతదేశంలో తొలి నుంచి మద్యనిషేధం  హిట్టాయ్యాయా? ఫ్లాపయ్యాయా? అన్న దానిపై స్పెషల్ ఫోకస్..

*అమెరికా చరిత్రలోనే ఘోర వైఫల్యం.. మద్యనిషేధం..
అమెరికా చరిత్ర చూస్తే రెండే ఘోర వైఫల్యాలు.. అవి 1920-1933 వరకు విధించిన మద్యనిషేధం.. 1955-1975వరకు సాగించిన వియత్నం యుద్ధం. ఈ రెండే అమెరికాలో అతిపెద్ద ఫ్లాపులుగా ఇప్పటికీ చరిత్రలో నిలిచాయి.

అమెరికాలో 1920లో మద్యనిషేధం అమలు చేశారు. శ్వేతజాతి అమెరికన్లు మద్యనిషేధానికి మద్దతు పలుకగా.. పేదలు నల్లజాతీయులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పనిచేసుకొని బతికే వారంతా మద్యం కావాలని.. దాంతోనే తమకు కాసింత సంతృప్తి అని పోరాడారు. యుద్ధాలు చేశారు.కానీ అప్పటి శ్వేతజాతి ప్రభుత్వం వారి వాదనను పట్టించుకోలేదు. దీంతో పేదలు నల్లజాతీయులు ఓవైపు పోరాటం మొదలుపెట్టారు. వారికి వ్యతిరేకంగా శ్వేత జాతి అమెరికన్లు మద్యనిషేధం కావాలంటూ మరో వైపు పోరాడారు. అధికారం శ్వేతజాతి వారిదే కావడంతో పేదలు నల్లజాతీయుల వేదన అరణ్య రోదనే అయ్యింది.

దాదాపు 13 సంవత్సరాల పాటు ఈ మద్యనిషేధంపై అమెరికాలోని పేదలు నల్లజాతీయుల పోరాటం సాగింది. కానీ ఉన్నత శ్వేతజాతీయులు ధనవంతులకు మాత్రం అక్రమ మార్గాల ద్వారా మద్యం అందుతూనే ఉండడం... వారు తాగుతూ ఎంజాయ్ చేస్తుండడంతో పేదలు నల్లజాతీయులు రోడ్లమీదకొచ్చి ఆందోళనకు దిగారు. పేదల కడుపుకొట్టడానికే ఈ నిషేధ చట్టం అని.. ఉగ్రవాద చర్యలకు దిగారు.

దొంగ వ్యాపారం ద్వారా అమెరికాలో ధనవంతులకు మద్యం ఏరులై పారింది. పేరుకే నిషేధం కానీ.. రాజకీయ నాయకులు పోలీసులు ధనవంతులు దర్జాగా మద్యం సేవిస్తూనే ఉండేవారు. కానీ పేదలు నల్లజాతీయులకు మద్యం దొరికేది కాదు.. దీంతో వారు నిషేధంతో ఎన్ని ఆందోళనలు చేసినా హింసకు పాల్పడినా శ్వేతజాతి ప్రభుత్వాలు మద్యనిషేధం ఎత్తివేయలేదు.

దీంతో 1933లో పేదలు నల్లజాతీయులు డెమోక్రాట్ పార్టీ పంచన చేరారు. ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్ మధ్య నిషేధాన్ని రద్దు చేస్తే ఓటు వేసి గెలిపిస్తామని కోరారు. దీంతో గాలివాటంగా రూజ్ వెల్ట్ అద్భుతమైన విజయం సాధించారు. మద్యనిషేధం రద్దు చేస్తానన్న ఆయన ప్రకటనే అమెరికా అధ్యక్షుడిగా ఆయనను గెలిపించింది.

దీంతో అమెరికా రాజ్యాంగ చరిత్రలో తొలిసారి  రాజ్యాంగ సవరణ చేసి మరీ మద్య నిషేధాన్ని ఉపసంహరింపచేశారు అధ్యక్షుడు రూల్ వెల్ట్. అలా ప్రపంచంలోనే మద్యనిషేధం ఘోరంగా విఫలమైన సంఘటనగా అమెరికాలో చరిత్రలో నిలిచిపోయింది.

*ఎన్టీఆర్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో మద్యనిషేధం ఏమైంది?
అది 1995-1997.. ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగు దేశం ప్రభుత్వం 1995 జనవరిలో మద్యపాన నిషేధం తీసుకొచ్చింది. దీంతో ఎన్టీఆర్ ప్రభుత్వం ఏకంగా రూ.960 కోట్ల లోటు బడ్జెట్ లోకి వెళ్లిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో నిషేధం ఘోరంగా విఫలమైంది. బహిరంగంగా మద్యం దుకాణాలు లేకున్నా.. తాగాలనుకున్న వారందరికీ మద్యం దొరికింది. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అక్రమ మద్యం రవాణా అయ్యింది. రాజకీయ నాయకులకు ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న వారికి నిషేధమే లేదు. పేదవాళ్లు మాత్రం మద్యం కోసం కల్తీ నాటుసారా కల్లు ఇతర పానీయాలు తాగి పెద్దఎత్తున ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడ చూసినా సారా ఏరులై పారేది. 1997లో ఎన్టీఆర్ ను గద్దెదించి చంద్రబాబు  సీఎం అయ్యాక ఈ మద్యనిషేధం సాధ్యంకాదని ఎత్తివేశాడు.

*జగన్ తో సాధ్యం అవుతుందా?
చరిత్రలో ఎక్కడ చూసినా మద్యనిషేధం అనేది సాధ్యమైన దాఖలాలు లేవు. 1977లో మొరార్జీ దేశాయ్ విధించిన మద్య నిషేధం కూడా దేశవ్యాప్తంగా ఘోరంగా విఫలమైంది. రాష్ట్రాలన్నీ ఉపసంహరించి మద్యానికి బార్లా తెరిచాయి. మరి మన కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఏపీలో మద్య నిషేధం సాధ్యమవుతుందా అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం 2018-19లో ఏపీ ఎక్సైజ్ ఆదాయం ఏకంగా 17340 కోట్లు. నిషేధం అమలు చేస్తే ఇన్ని వేల కోట్ల రాబడి తగ్గుతుంది. సంక్షేమ పథకాల అమలు కష్టమవుతుంది.

ఇప్పుడు మద్యం అనేది నిత్యావసరం అయిపోయింది. ఆడవాళ్లు కూడా బీర్లు తాగుతున్న పరిస్థితి. ఎన్టీఆర్ హయాంకు ఇప్పటికీ ఆధునిక పోకడలు విందులు వినోదాలు పెరిగాయి. దుకాణాలు బార్లు రెస్టారెంట్లు పెరిగాయి. కుటుంబాల ఆదాయాలు అధికమయ్యాయి. మద్యపానానికి మొత్తం సమాజం ఆమోదం ఉంది. గతంలోలాగా మద్యం కారణంగా కుటుంబాల్లో పెద్ద గొడవలు చోటుచేసుకోవడం లేదు. తాగుతున్నారు.. పనిచేస్తున్నారు.మద్యం లేకపోతేనే గొడవలు చేస్తున్నారు. ఉంటే తాగి పడుకుంటున్నారు. మద్యం ఇప్పుడు అన్ని అల్ప అధిక ఆదాయ వర్గాలకు నిత్యావసరమైంది. మితంగా మద్యం సేవించేవారున్నారు. దీంతో నిషేధం వల్ల విపరీత ధోరణులు పెరగడం ఖాయం.

 జనాలు అందరూ కోరుకునే మద్యం లేకపోతే ఏమవుతుందో లాక్ డౌన్ వేళ పర్యవసనాలు చూశాం. మద్యం దుకాణాలు లాక్ డౌన్ తర్వాత తెరిస్తే ఆడవాళ్లు కూడా క్యూకట్టడం.. భారీ క్యూలు చూశాం. సో ఇంతమంది..  సమాజమంతా మద్యాన్ని కోరుకుంటున్నారు. చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలు నిషేధించలేకపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇది అమలు అవుతుందా? జగన్ కు సాధ్యమేనా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.