Begin typing your search above and press return to search.

తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఉత్తమాటేనా?

By:  Tupaki Desk   |   30 Jan 2023 11:10 AM GMT
తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఉత్తమాటేనా?
X
తెలంగాణలో 24 గంటల పాటు ఉచిత విద్యుత్ కొనసాగుతుందా..? కరెంట్ కోతల్లేని గ్రామాలు ఉన్నాయా..? అంటే లేవనే అంటున్నారు రైతులు. గత కొన్ని రోజులగా ఉత్తర తెలంగాణలోని సబ్ స్టేషన్ల వద్ద రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటపొలాలకు 6 నుంచి 12 గంటల విద్యుత్ ను మాత్రమే సరఫరా చేస్తున్నారని వాపోతున్నారు. సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో కరెంట్ కట్స్ ఉండడంతో క్రాప్ నష్టాలపాలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ విషయంపై స్థానిక డిప్యూటీ, ఎగ్గిక్యూటివ్ ఇంజనీర్లను అడిగితే తమకు పై నుంచే ఆర్డర్స్ ఉన్నాయని అందుకే టైం టూ టైం కరెంట్ సరఫరా చేస్తున్నామని అంటున్నారు. దీంతో రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్ ఉత్తమాటేనా..? అంటూ రైతులు నిరాశ చెందుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, కుంటాల, ఇచ్చోడతో పాటు తదితర మండలాల్లో రైతులు సబ్ స్టేషన్ల వద్ద ధర్నాలు చేశారు. గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలో సబ్ స్టేషన్ ను ముట్టడించారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల సబ్ స్టేషన్ వద్ద రైతులు దాదాపు గంటపాటు ఆందోళన చేశారు. మెదక్ జిల్లాలోని మనోహరబాద్ లో ఏకంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులను నిలదీశారు. సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెబుతుంటే మీరెందుకు కట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు వేసిన వారికి ఇప్పుడు విద్యుత్ అవసరం ఉంటుంది. పంటలకు కావాల్సిన నీరు అందించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో కరెంట్ కోతలు విధిస్తే తాము నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

త్రీఫేజ్ కరెంట్ ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా చేయాలి. కానీ అర్ధంతరంగా కోతలు విధిస్తున్నారని, మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని అంటున్నారు. అప్రకటిత కోతలతో పంటలకు నీరు తడి లేకపోవడంతో అవి దెబ్బతింటున్నాయంటున్నారు. ఇక వాణిజ్య పంటలు వేసుకున్న వారికి ఈ నష్టం తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు.

ప్రభుత్వం ఉచిత విద్యుత్ అని ప్రకటించినా రైతుల నుంచి రూ.30 వసూలు చేస్తోంది. దీనిని రైతుల ఇంటి విద్యుత్ బిల్లులో జమచేస్తున్నారు. అయితే ఇప్పుడు 24 గంటల పాటు కాదు కదా.. కొన్ని గ్రామాల్లో కనీసం 12 గంటలు కూడా ఉండడం లేదని అంటున్నారు. అయితే విద్యుత్ సంస్థపై పడిన నష్టాన్ని పూడ్చుకోవడానికే కోతలు విధిస్తున్నారని అంటున్నారు. ఉచిత విద్యుత్ ప్రకటించిన తరువాత రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లు పెరిగాయి.

2022 డిసెంబర్ నాటికి వ్యవసాయ పంపుసెట్లు 26.96 లక్షలు ఉన్నాయి. వీటికి విద్యుత్ అందించడానికి ప్రభుత్వం డిస్కంలకు ఎనిమిదేళ్ల కాలంలో రూ.30.155 కోట్లు చెల్లించింది. కానీ 2020 -21 సంవత్సరంలోనే వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ అందించడానికి రూ.7,565 కోట్ల మేర ఖర్చు అయినట్లు ఇటీవల విద్యుత్ నియంత్రణ మండలికి అందిన నివేదికలో ఉన్నాయి. దీంతో ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యత్ ను పట్టించుకోవడం లేదా..? అన్న విమర్శలు వస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.