గులాబీ కారు జోరుకు ఓనర్..కిరాయిదార్ల రచ్చ బ్రేకులు

Wed Sep 11 2019 10:49:01 GMT+0530 (IST)

Internal Fights Between TRS Leaders In TRS Party

ఆ మధ్యన బీటీ బ్యాచ్ (బంగారు తెలంగాణ బ్యాచ్) ఎంట్రీతో టీఆర్ ఎస్ లో  చోటు చేసుకున్న కలకలం తెలిసిందే. ప్రజల్లో పలుకుబడి మస్తుగా ఉన్న కేసీఆర్ తో పెట్టుకోవటంతో మొదటికే మోసం వస్తుందన్న ఉద్దేశంతో మనసులో ఆవేదన ఉన్నా కామ్ గా ఉండిపోయారు టీఆర్ ఎస్ నేతలు పలువురు. నాటి బంగారు తెలంగాణ బ్యాచ్ కాస్తా ఇప్పుడు కిరాయిదారులుగా పేర్కొనటం.. ఉద్యమం నాటి నుంచిపార్టీలో ఉన్న వారంతా ఓనర్లుగా ఫీల్ కావటం తెలిసిందే. ఎప్పుడైతే మంత్రి ఈటల నోటి నుంచి గులాబీ జెండాకు ఓనర్లం మేమేనని.. అప్పటి నుంచి టీఆర్ ఎస్ లో అంతర్గతంగా ఓనర్లు వర్సెస్ కిరాయిదార్లు అన్న ఫీలింగ్ పెరగటమే కాదు.. అంతకంతకూ ఎక్కువైపోతోంది.పార్టీలో మొదట్నించి ఉన్న తమకు పదవులు రాక.. మధ్యలో పార్టీలో చేరిన వారికి పదవులు.. బాధ్యతల్ని అప్పగిస్తూ ఉండటాన్ని టీఆర్ ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఉండకూడదన్న చందంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కొత్త వారిని పార్టీలో చేర్చుకోవటంతో గులాబీ కారు ఇప్పుడు ఓవర్ లోడ్ అయ్యింది. దీనికి తోడు ఓనర్ వర్సెస్ కిరాయిదారు రచ్చ కారు జోరును దెబ్బ తీస్తోంది.

గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా అంతర్గత పోరు పార్టీలో అంతకంతకూ పెరుగుతోందన్న మాట ఎక్కువ అవుతోంది. గత ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో చేరిన 13 మంది ఎమ్మెల్యేలతో పోరు తీవ్రత మరింత పెరుగుతోంది. పాత వారు తమ ఉనికి కోసం పోరాడుతుంటే.. కొత్త వారు తమ స్థానాన్ని పదిలం చేసుకోవటానికి ఎత్తులు వేస్తున్నారు. దీంతో.. రెండు వర్గాల మధ్య అంతరం అంతకంతకూ పెరగటమే కాదు.. మనస్పర్థలు ఎక్కువైపోతున్నట్లుగా చెబుతున్నారు.

తాజాగా జరిపిన మంత్రివర్గ విస్తరణ కానీ.. నామినేటెడ్ పోస్టులు కానీ.. తమ తర్వాత పార్టీలో చేరిన వారికే దక్కటాన్ని మొదట్నించి పార్టీలో ఉన్న నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్సీ కోటాలో తమకు మంత్రి పదవులు దక్కుతాయని ఆశగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి.. మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి.. మాజీ మంత్రులుగా పని చేసిన పట్నం మహేందర్ రెడ్డి.. తుమ్మల నాగేశ్వర్ రావులకు తాజాగా పదవులు దక్కకపోవటంతో వారు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు.

పార్టీ సీనియర్ నేతల మధ్యే కాదు.. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పోరు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.  ముషీరాబాద్ - నర్సాపూర్ - హుస్నాబాద్ - నల్లగొండ - భువనగిరి - నకిరేకల్ - ఆలేరు - స్టేషన్ ఘన్ పూర్ - భూపాలపల్లి - వరంగల్ తూర్పు - ఇబ్రహీంపట్నం - రాజేంద్రనగర్ - శేరిలింగంపల్లి - ఆదిలాబాద్ - ఖానాపూర్ నియోజకవర్గాలకు చెందిన పాత.. కొత్త నేతల మధ్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. మరీ.. లెక్క తేడాను కేసీఆర్ ఎలా సెట్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పకతప్పదు.