సంజయ్ గాంధీ గురించి ఇందిరా గాంధీ ఆందోళన

Tue Oct 13 2020 05:00:04 GMT+0530 (IST)

Indira Gandhi's concern about Sanjay Gandhi

1975లో భారత దేశంలో విధించిన ఎమర్జెన్సీ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో గుర్తుండిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆనాడు ఎమర్జెన్సీకి దారి తీసిన పరిస్థితులు కారణాలపై కొందరు ప్రముఖ రచయితలు తమ అనుభవాలను పుస్తకాల రూపంలో తెచ్చారు. వాటిలో పిఎన్ ధర్ రాసి ‘ఇందిరా గాంధీ ది ఎమర్జెన్సీ అండ్ ఇండియన్ డెమోక్రసీ’ అనే పుస్తకంలో ఎన్నో ఆసక్తికర విషయాలున్నాయి. 1974 నాటికి భారతదేశంలో రాజకీయ వాతావరణం ఇందిరా గాంధీ జయప్రకాశ్ నారాయణ్(జేపీ) ల మధ్య ఉన్న సైద్ధాంతిక విభేదాలు వంటి విషయాలను ఆ పుస్తకంలో ప్రస్తావించారు. కొన్ని పరిస్థితుల వల్ల ఇందిరాకు వ్యతిరేకంగా జేపీ ఇచ్చిన సంపూర్ణ విప్లవం నినాదం ప్రజలను ఆకర్షించింది. ఈ క్రమంలోనే జేపీతో సమావేశమైన ఇందిరా గాంధీ ఓ విషయంలో ఆయనతో విభేదించారు. బిహార్ శాసన సభను సస్పెండ్ చేసేన ఇందిరా...దానిని రద్దు చేసే విషయం ఒప్పంద పత్రంలో రాయకపోవడం జేపీకి నచ్చలేదట. దానిపై ఇందిరా సమాధానం చెప్పకపోవడాన్ని అవమానంగా భావించిన జేపీ అక్కడ నుంచి వెళ్లిపోయారు.వీరిద్దరి మధ్య సైద్ధాంతిక విభేధాలు పట్టుదలలు చివరకు 1975లో అత్యవసర పరిస్థితి విధించేందుకు దారి తీశాయి. ఆ తర్వాత 1975లో జేపీని అరెస్టు చేశారు. 1976లో పెెరోల్ పై విడుదలైన జేపీ....వినాశకాలే విపరీత బుద్ధి అని మీడియాతో అన్నారు. ఆ తర్వాత 1977లో జనతా పార్టీ విజయం సాధించింది. దీంతో సంజయ్ గాంధీ బలవంతంగా సాగించిన కుటుంబ నియంత్రణను వ్యతిరేకించిన వారు ఆయనపై దాడి చేస్తారేమోనని ఇందిర చాలా భయపడ్డారు. సంజయ్ గాంధీకి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తారేమోనని ఆమె ఆందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న జేపీ కలత చెంది. ఇందిరాగాంధీని స్వయంగా కలవడానికి ఆమె నివాసానికి వెళ్లారు. ఆ సమావేశం తర్వాత “ ఇందిర జీవితం ముగియలేదు’’ అని చెప్పిన జేపీ....ఆమెను టార్గెట్ చేయవద్దని తన పార్టీ వర్గాలకు పరోక్షంగా సందేశం ఇచ్చారు. ఇందిరాపై తాను ద్వేషం పగతో వ్యవహరించబోనని ఆమెకు మాటిచ్చారు జేపీ. ఆ తర్వాత అనారోగ్యంతో చివరి రోజుల్లో జేపీ పాట్నాలో గడిపిన సమయంలో జనతా పార్టీ నాయకులు ఆయన్ను పట్టించుకోలేదు. ఆ సమయంలో పాట్నాకు వెళ్లి జేపీని స్వయంగా కలిశారు ఇందిరా గాంధీ. జీవితపు చివరి రోజుల్లో ఇందిరాగాంధీకి జేపీ మళ్లీ దగ్గరయ్యారు. ఇందిర కూడా జేపీతో విభేదాలు రాజకీయాలలో మాత్రమేనని భావించేవారు.