Begin typing your search above and press return to search.

లేటు వయసులో ఘాటు ప్రేమ...వర్కౌట్ అయ్యేనా...?

By:  Tupaki Desk   |   26 Jan 2022 4:30 PM GMT
లేటు వయసులో ఘాటు ప్రేమ...వర్కౌట్ అయ్యేనా...?
X
తెలుగుదేశం పార్టీ అనే కాదు, ఏ పార్టీ అయినా కూడా కొత్త వారు వస్తే కాస్తా ఇబ్బంది పడతారు. ఉన్న పరిస్థితులనే అలా ఉంచాలనుకుంటారు. టీడీపీలో ఎన్టీయార్ పెద్దగా ఉన్నపుడు పార్టీలో రెండు వర్గాలు ఉండేవి. ఒకటి చంద్రబాబుది అయితే రెండవది డాక్టర్ దగ్గుబాటిది. ఆయన వర్గంలో ఉన్న వారు తరువాత కాలంలో చంద్రబాబు వర్గంలోకి రావడానికి చాలా ఇబ్బంది పడ్డారు. వచ్చిన వారు కూడా పూర్తిగా కొనసాగలేకపోయారు.

ఇక దగ్గుబాటి వర్గంలో ఉంటూ చివరి వరకూ ఎన్టీయార్ తో గడిపిన మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆయన చనిపోయిన తరువాత లక్ష్మీ పార్వతి వర్గంలో ఉంటూ 1996 లోక్ సభ ఎన్నికలో రాజమండ్రీ నుంచి ఎంపీగా ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.ఆ తరువాత మెల్లగా ఆయన చంద్రబాబు వైపు వచ్చారు.

చిత్రమేంటి అంటే గోరంట్ల చంద్రబాబు నాయకత్వాన టీడీపీలో చేరినా కూడా ఆయన మంత్రి కాలేకపోయారు. ఎమ్మెల్యే టికెట్ వరకూ ఆయనకు ఇచ్చినా బాబు మాత్రం మంత్రిని చేయలేదు. ఇక గోరంట్ల తన లైఫ్ లో మంత్రిగా పనిచేసింది ఎన్టీయార్ హయాంలో మాత్రమే. దాంతో ఆ అసంతృప్తి ఆయనకు అలాగే ఉంది. 2014లో టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చాక కచ్చితంగా మంత్రిని తానే అనుకున్నారు. కానీ మొదటి సారి కాదు తరువాత విస్తరణ జరిగినా గోరంట్ల ఆశలు నెరవేరలేదు.

ఇక 2019లో టీడీపీ విపక్షంలోకి వచ్చింది. దాంతో మరికొందరితో కలిపీ అయన్ని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా బాబు చేశారు. మరో వైపు 2019 ఎన్నికల వేళ తన సీటుని రాజమండ్రీ రూరల్ కి మార్చేశారని మరో బాధ ఆయనలో ఉండేది. దాంతో పాటు వైసీపీ నుంచి టీడీపీలో వచ్చి చేరిన ఆదిరెడ్డి అప్పారావు ఫ్యామిలీకి పెద్ద పీట వేయడంతో పాటు రాజమండ్రీ సిటీని వారికే ఇవ్వడంతో తట్టుకోలేపోయారు. వీటి నుంచే ఆయనలో మెల్లగా ఉన్న అసంతృప్తి బయటపడి ఆ మధ్యన కొన్ని కామెంట్స్ చేశారు.

అయితే తరువాత చంద్రబాబు చెప్పడంతో మెత్తబడిన గోరంట్ల పార్టీలో కొనసాగుతున్నారు కానీ రాజమండ్రీ సిటీ సీటు విషయంలో మాత్రం హామీ పొందలేకపోయారు అంటున్నారు. ఆదిరెడ్డి ఫ్యామిలీకి చినబాబు లోకేష్ మద్దతు పుష్కలంగా ఉంది. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆదిరెడ్డి అప్పారావు తనయుడు, ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అంటున్నారు.

దీంతో ఇక లాభం లేదని గోరంట్ల లోకేష్ నే ప్రసన్నం చేసుకుంటున్నారు అంటున్నారు. ఈ మధ్య జరిగిన లోకేష్ బర్త్ డే వేళ ఆయన మీద ఒక పాటను కూడా తయారు చేసి గోరంట్ల రిలీజ్ చేశారు. అంతటితో ఆగని ఆయన ఫ్యూచర్ లీడర్ లోకేషే అని తన నోటితోనే చెప్పేశారు. ఆ మధ్య దాకా జూనియర్ ఎన్టీయార్ వస్తే కానీ టీడీపీ బాగుపడదు అన్న గోరంట్లలో ఇంత మార్పు ఎలా వచ్చింది అన్నదే టీడీపీలో చర్చగా ఉంది.

మొత్తానికి తాను రాజమండ్రీ సిటీ నుంచి పోటీ చేయడానికి గోరంట్ల రెడీ అయ్యారు. అందుకే చినబాబుని పొగుడుతున్నారు అంటున్నారు. అయితే ఈసారి గోరంట్ల వంటి సీనియర్లకు టికెట్ వస్తుందా రాదా అన్నది కూడా చర్చగా ఉందిట. ఆయన వయసు డెబ్బై అయిదేళ్ళు పై దాటాయి. టీడీపీ ఈసారి యువతకు ప్రాముఖ్యత ఇవ్వాలనుకుంటోందిట. అదే టైమ్ లో ఆదిరెడ్డి వాసు సిటీలో మొత్తం గ్రిప్ సంపాదించారు.

ఆయన గోరంట్ల వర్గాన్ని కూడా కలిపేసుకుని మరీ బలమైన నేతగా మారారు. పైగా బీసీ సామాజికవర్గం కార్డు, కింజరాపు ఎర్రన్నాయుడు అల్లుడు అన్న ట్యాగ్ ఉంది. సో గోరంట్ల ఈ లేటు వయసులో లోకేష్ ని పొగిడినా వర్కౌట్ అవుతుందా అన్నదే చర్చగా ఉందిట. చూడాలి మరి ఏం జరుగుతుందో.