Begin typing your search above and press return to search.

జీవీకే అవినీతి పై రంగంలోకి ఈడీ: విచారణ షురూ!

By:  Tupaki Desk   |   4 July 2020 2:00 PM GMT
జీవీకే అవినీతి పై రంగంలోకి ఈడీ: విచారణ షురూ!
X
ప్రముఖ కంపెనీ జీవీకే గ్రూపులో అవినీతి వెలుగులోకి రాగా దానిపై విచారణ మొదలైంది. ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ కేసులో ప్రమోటర్లు, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కొందరిపై ఈడీ విచారణ ప్రారంభించింది. ఇప్పటికే సీబీఐ ఈ కేసు వ్యవహారంలో రూ.705 కోట్ల స్కామ్ జరిగినట్టు గుర్తించింది.

జీవీకే గ్రూపు చైర్మన్ జీవీకే రెడ్డి, ఆయన కుమారుడు జీవీ సంజయ్ రెడ్డి, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, ఎయిర్ పోర్ట్స్ అథారిటీకి చెందినవారితో సహా మొత్తం 14 మందిపై గత జూన్ 27వ తేదీన క్రిమినల్ కేసును దాఖలు చేసింది. చీటింగ్, ఫ్రాడ్, క్రిమినల్ కుట్ర వంటి పలు అభియోగాలు వచ్చాయి. వీరి వలన ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్లకు పైగానే నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. హైదరాబాద్ లో జీవీకే రెడ్డితో కార్యాలయంతో బాటు ముంబైలో ముంబై ఇంటర్నేషల్ ఎయిర్ పోర్టుకు చెందిన అధికారుల ఆఫీసులపై ఈ సందర్భంగా సీబీఐ దాడులు చేసి సోదాలు నిర్వహించింది.

2012 నుంచే ప్రమోటర్ల అవకతవకల వ్యవహారం ప్రారంభమైందని దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ, మేనేజ్ మెంట్, డెవలప్ మెంట్ వంటి ఉన్నత ఆదర్శాలతో’ జీవీకే ఎయిర్ పోర్ట్ హోల్డింగ్స్ జాయింట్ వెంచర్ 2006లోనే ఏర్పడినప్పటికీ.. ఆ తరువాత అక్రమాలు మొదలయ్యాయని తెలుస్తోంది. 2012లో రూ.395 కోట్ల దుర్వినియోగం జరిగిందని, ఎయిర్ పోర్ట్ ప్రీమియం రిటైల్ ఏరియాని ఈ గ్రూపు తమ కుటుంబసభ్యులు, బంధువులకు చాలా తక్కువ రెంటల్స్ తో అప్పగించారని సీబీఐ అధికారులు తెలిపారు. బోగస్ కాంట్రాక్టులు, తొమ్మిది బినామీ ఎంటీటీలు సాగించిన అవకతవకలపై దర్యాప్తు జరుగుతోంది.

ముంబై విమానాశ్రయ కంపెనీ ఈ ప్రమోటర్లు నిధులను ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో హైదరాబాద్ లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో మదుపు చేశారని తెలిసింది. దర్యాప్తులో తేలిన విషయాలన్నీ ఈడీకి సీబీఐ నివేదికగా తెలపనుంది.