Begin typing your search above and press return to search.

అమెరికాలోని మనోళ్లు.. మద్దతు ఎవరికో తేల్చి చెప్పేశారు

By:  Tupaki Desk   |   25 Oct 2020 6:10 AM GMT
అమెరికాలోని మనోళ్లు.. మద్దతు ఎవరికో తేల్చి చెప్పేశారు
X
కుండబద్ధలు కొట్టేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో తొమ్మిది రోజుల్లోకి వచ్చేసిన వేళ.. అమెరికాలోని భారతీయ అమెరికన్లు తాజాగా తమ మద్దతు ఎవరికి ఇవ్వనున్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేశారు. ఆ మాటకు వచ్చే.. దేశాధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో తమ మనసులు ఎంత గాయపడ్డాయన్న విషయాన్ని చెప్పేశారు. ప్రపంచ వేదికపై భారత్ ను నిరంతరం విమర్శిస్తున్న ట్రంప్ తమ శత్రువుగా తేల్చేశారు. అదే సమయంలో జో బైడెన్.. ఉపాధ్యక్ష పదవి బరిలో ఉన్న భారతీయ సంతతి మహిళ కమలా హ్యారీస్ కే తమ మద్దతు అని తేల్చేశారు.

ఇటీవల జరిగిన మలిదశ డిబేట్ తో.. తమ మిత్రుడు ఎవరో? శత్రువు ఎవరు? అన్న విషయాలపై స్పష్టత వచ్చిందన్నారు. నవంబరు మూడున జరిగే ఎన్నికల్లో తమ ఓటు డెమొక్రాట్లకే అని తేల్చేశారు. ట్రంప్ నాలుగేళ్ల పాలన అనంతరం.. తమ పిల్లలు.. వారి పిల్లలకు.. తమకు ఎలాంటి అవకాశాలు లభించవన్న విషయంపై క్లారిటీ వచ్చిందని.. తమను గుర్తించి.. తమకు సమాన అవకాశాల్ని కల్పించే నేత పాలకుడిగా రావాలన్న అభిలాషను వ్యక్తం చేశారు.

బైడెన్.. హ్యారీస్ తో భారతీయ అమెరికన్లకు గాఢమైన అనుబంధం ఉందన్నారు. ఎన్నికలు దగ్గరపడిన వేళ.. భారతీయ మూలాలున్న అమెరికన్లు.. తమ మద్దతు డెమొక్రాట్లకు చెప్పేయటం.. ఆ దిశగా ప్రచారాన్ని ముమ్మురం చేయటం గమనార్హం. ఇదిలా ఉంటే.. తాజా పరిణామాలు ట్రంప్ కు ఇబ్బందే అంటున్నారు. భారతీయ అమెరికన్లు ఎవరి పక్షాన ఉన్నారన్న విషయంపై జరిపిన తాజా సర్వేలో 80 శాతం మంది డెమొక్రాట్ల అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తామని వెల్లడించినట్లుగా తేలింది.