Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : జాబ్ లో మార్పు కోరుకుంటున్న ఇండియన్స్

By:  Tupaki Desk   |   14 Sep 2021 9:04 AM GMT
కరోనా ఎఫెక్ట్ :  జాబ్ లో మార్పు కోరుకుంటున్న ఇండియన్స్
X
కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత , ఒకప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని మాట్లాడుకునే వాళ్లు. కానీ కరోనా ఎంట్రీతో ఆ రోజులు పోయినట్లే కన్పిస్తున్నాయి. ఇప్పుడంతా కరోనా ముందు, కరోనా తర్వాత అని మాట్లాడుకుంటున్నారు. కరోనా ఇప్పట్లో మనల్నీ వదిలిపోయేలా లేదు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటూ మనల్ని భయపడుతూనే ఉంది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ తనకు దూరంగా ఉంటే మిమల్ని, మన కుటుంబాలను ఏం చేయనంటూ కరోనా అభయమిస్తుంది.

ఇదొక్కటే మానవళిని కరోనా నుంచి రక్షించుకోవడానికి సులువైన మార్గంగా కన్పిస్తుంది. అయితే కరోనా నిబంధనలను మానవళి ఏమేరకు పాటిస్తున్నారనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మారింది. కరోనా ఎంట్రీ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవగా ఈ ప్రభావం ఉద్యోగులపై అధికంగా పడింది. కరోనా కారణంగా కోట్లాది మంది ఉద్యోగులు రోడ్డున పడాల్సి వచ్చింది. దీంతో వీరి జీవితం అగమ్యగోచారంగా మారింది. ఆరోజులను తలుచుకుంటేనే భయమేస్తూ ఉంటుంది. ప్రస్తుతం కరోనా కొంచెం తగ్గుముఖం పట్టడంతో ఈ రంగం తిరిగి పుంజుకుంటోంది. ఇదే సమయంలో కరోనా ప్రభావం కంపెనీలు, ఉద్యోగులపై స్పష్టంగా కన్పిస్తుంది.

కరోనా జాగ్రత్తల మధ్యే భయంభయంగా ఉద్యోగులు పనులు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో వారంతా ఉద్యోగాల్లో మార్పు కోరుకుంటుండటం ఆసక్తిని రేపుతోంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజమైన అమెజాన్ మార్నింగ్ కన్సల్ట్ అనే గ్లోబల్ డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ద్వారా కోవిడ్ ప్రభావం, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి ఓ సర్వే నిర్వహించింది. గత నెలలో నిర్వహించిన ఈ సర్వేలో వెయ్యి మంది భారతీయ ఉద్యోగులు పాల్గొన్నారు. దాదాపు 90శాతం మంది ఉద్యోగులు తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తేలింది. 59మంది మంది ప్రస్తుత ఉద్యోగం నుంచి మారాలని కోరుకుంటున్నారట.

ప్రస్తుతం ఉన్న రంగం నుంచి ఇతర రంగాన్ని మారాలని వారంతా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. కరోనా కారణంగా వేతనాల్లో యాజమాన్యాలు కోత విధించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కరోనా తర్వాత కొత్తగా ఉద్యోగంలో చేరేవాళ్లలో 56శాతం మంది ఉద్యోగ భద్రతను కోరుకుంటున్నారు. 55శాతం మంది జీతాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని సర్వేలో వెల్లడైంది. ఇక 47మంది సురక్షితమైన పని వాతావరణం కావాలని కోరుకుంటున్నారు. 49శాతం మంది ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశాలు ఉండాలని భావిస్తున్నారు. ఇందుకోసం సాంకేతిక, డిజిటల్ నైపుణ్యాలు తప్పనిసరి అని 45శాతం మంది భావిస్తున్నారట. 38శాతం మంది మార్కెటింగ్ నైపుణ్యాలు ఉండాలని కోరుకుంటున్నారు.

ఇదిలా ఉంటే 76 శాతం మంది యువ ఉద్యోగులకు కంపెనీలు ఇప్పటికే అదనపు శిక్షణను ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో 96శాతం మంది సమర్థంగా శిక్షణను పూర్తి చేసినట్లు వెల్లడైంది. మొత్తానికి కరోనా ప్రభావం ఉద్యోగుల్లో మార్పుకు శ్రీకారం చుట్టడం ఆనందించాలా, లేదంటే విచారించాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఉద్యోగులంతా తాము చేస్తున్న ఉద్యోగాన్ని మారాలని, పెద్ద ఉద్యోగాలు, పెద్ద జీతాలు పొందాలని తపన పడుతున్నట్టు సర్వేలో తేలింది.