Begin typing your search above and press return to search.

రైల్వే శాఖ రెడీ: కరోనా బాధితులకు బోగీల్లో చికిత్స

By:  Tupaki Desk   |   28 March 2020 1:00 PM GMT
రైల్వే శాఖ రెడీ: కరోనా బాధితులకు బోగీల్లో చికిత్స
X
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడం.. ఆస్పత్రుల్లో పాజిటివ్‌ కేసులతో పాటు అనుమానితులు అధికమవుతున్న సమయంలో దేశంలో ఆస్పత్రులు, వైద్య సేవల కొరత ఏర్పడుతోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో ఐసొలేషన్ వార్డులు - క్వారెంటైన్ కేంద్రాలు - ఐసీయూ బెడ్స్ సిద్ధం చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ క్రమంలో కరోనా నివారణ కోసం భారతీయ రైల్వే కూడా ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా రైల్వే శాఖ అద్భుతమైన ఆలోచన చేసింది. లాక్‌ డౌన్ సందర్భంగా దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో రైళ్లు స్టేషన్‌ లలో ఖాళీగా ఉన్నాయి. వాటిని వినియోగించుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే శాఖకు ఆదేశాలు జారీ చేసింది. నిరుపయోగంగా ఉన్న రైల్వే బోగీలను కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ వార్డులుగా వినియోగించాలని నిర్ణయించారు.

రైళ్లల్లోని బోగిలను కరోనా బాధితుల కోసం ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చి వినియోగించుకోనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కేసులు దాదాపు వెయ్యికి చేరువలో ఉన్నాయి. ప్రస్తుత ఈ కేసులు మరిన్ని పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే కరోనా అనుమానితులతో పాటు కరోనా సోకిన వారిని బోగిల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉంచి వైద్య సేవలు అందించనున్నారు.

ఈ మేరకు కరోనా బాధితుల చికిత్స కోసం బోగీలను ఐసోలేషన్ వార్డులుగా రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ప్రతీ క్యాబిన్‌లో ఉండే అదనపు బెర్తులను తొలగించి, ఒకే బెర్తు ఉండేలా చేయడమే కాకుండా నిచ్చెనలు - తదితర అదనపు ఫిట్టింగ్‌ లను తొలగిస్తున్నారు. ప్రత్యేక టాయిలెట్లను కూడా ఏర్పాటుచేస్తున్నారు. దీంతో ఒక్కో బోగీలో దాదాపు 20 మంది దాకా రోగులను పెట్టి - చికిత్స చేసే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. రైలు కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మారుస్తున్న రైల్వే శాఖ… వాటిని పూర్తిగా శానిటైజ్ చేసి - వార్డుకు తగినట్టుగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో వేల సంఖ్యలో ఐసొలేషన్ వార్డులను రెడీ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులతో పాటు ప్రైవేటు రిసార్టులను - హోటళ్లల్లో కూడా ఐసోలేషన్ కేంద్రాలుగా - క్వారెంటైన్ కేంద్రాగా మార్చనున్నారు. అదే సమయంలో రైల్వే బోగీలను కూడా ఐసొలేషన్ సెంటర్లుగా మార్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. వీటి ద్వారా ఐసొలేషన్ సెంటర్ల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ వుందని రైల్వే అధికారులు అంటున్నారు.