సరిహద్దుల్లో రెడీ అవుతున్న భారత్

Mon Sep 13 2021 12:14:40 GMT+0530 (IST)

India getting ready on the borders

తాలిబన్ల దాడులను ఎదుర్కొనేందుకు భారత బలగాలు రెడీ అవుతున్నాయి. ఆప్ఘనిస్ధాన్ను ఆక్రమించుకున్న తాలిబన్లతో మనకు ఎప్పటికైనా ముప్పు తప్పదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ధారణకు వచ్చింది. దీనికి కారణం ఏమిటంటే గతంలో జమ్మూ-కాశ్మీర్ లో తాలిబన్ ఫైటర్లు చొరబడటమే. సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవాదులతో కలిసి తాలిబన్లు కూడా అనేక ఘటనల్లో పాల్గొన్నారు.అందుకనే ఇపుడు తాలిబన్ల దాడులను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై తాజాగా కేంద్ర ప్రభుత్వం సైనిక ఉన్నతాధికారులతో భేటీ జరిపింది. ఇందులో భాగంగానే తాలిబన్ల శిక్షణా విధానాలను వాళ్ళు ఉపయోగించే ఆయుధాలను ఇపుడు వాళ్ళు స్వాధీనం చేసుకున్న అమెరికా ఆయుధాలను అనుమానితుల ఫొటోలను వివిధ దాడుల్లో వాళ్ళు పాల్గొనే విధానాలకు సంబంధించిన వీడియోలను కూడా సరిహద్దుల్లోని సైనికాధికారులకు పంపారు. సైన్యానికే కాకుండా జమ్మూ-కాశ్మీర్లోని పోలీసులకు కూడా ఈ వీడియో క్లిప్పుంగులను కేంద్రం అంద చేసింది.

తాలిబన్లను ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను దాడులు చేయటంలో అనుసరించాల్సిన విషయంలో కూడా నిపుణులతో సైన్యానికి శిక్షణ మొదలుపెట్టేసింది. తాలిబన్ల ప్రభావం అనేక దేశాలకు ఉన్నట్లే మన దేశం పైన కూడా ఉంటుందని మొదటి నుంచి కేంద్రం అనుమానిస్తునే ఉంది. ఇతర దేశాల అంతర్గత విషయాల్లో తాము జోక్యం చేసుకోబోమని తాలిబన్లు ప్రకటించినా దాన్ని ఏ దేశం కూడా నమ్మలేదు.

అందుకనే ఆప్ఘన్ తో సరిహద్దులు కలిగిన తజకిస్ధాన్ ఖజకిస్థాన్ ఇరాన్ రష్యా దేని జాగ్రత్తలు అవి తీసుకుంటున్నాయి. అన్నింటికన్నా పాకిస్తాన్ చైనా తోనే ఆఫ్ఘన్ కు ఎక్కువ సరిహద్దులు కలిగుంది. అయితే ఆ దేశాలతో తాలిబన్లకు ఎలాంటి ముప్పులేదని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆప్ఘన్లో ప్రస్తుత కంపుకు పై రెండు దేశాలే కారణమని ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. తాలిబన్లు హక్కాని నెట్ వర్క్ వెనుక పాకిస్ధానే ఉందని ప్రపంచ దేశాలు చాలా బలంగా నమ్ముతున్నాయి.

మొత్తం మీద ఇపుడున్న తలనొప్పి చాలవన్నట్లు తాలిబన్లతో కొత్త తలనొప్పులు తప్పేట్లు లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఒంటరిగా మనల్ని ఏమీ చేయలేకపోతోంది. ఎంతసేపు సరిహద్దుల్లో అలజడులు రేపటం లేదా చైనా సైన్యాన్ని రెచ్చగొట్టి గొడవలు చూపించడం తప్ప ఇంకేమీ చేయలేకపోతోంది. ఇలాంటి దాయాది దేశానికి తాలిబన్లు కూడా తోడైతే మనకు చాలా ఇబ్బందులే. అందుకనే సరిహద్దుల్లో కాపలా కాసే వేలాదిమంది సైన్యాన్ని అప్రమత్తం చేస్తోంది. సైన్యం మొత్తానికి తాలిబన్ల దాడుల విషయమై సమాచారం ఉండాలని ప్రత్యేకంగా వీడియోలు వేసి చూపిస్తుంది.