ఇస్లామిక్ దేశాలపై భారత్ మండిపాటు!

Sat May 28 2022 20:00:01 GMT+0530 (India Standard Time)

India angry over Islamic countries!

ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) (ఇస్లామిక్ దేశాలు)పై భారత్ మండిపడింది. కొద్ది రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు విధించడంపై కొన్ని ఇస్లామిక్ దేశాలు భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా ఆ దేశాలు కోర్టు తీర్పును తప్పుబడుతూ వ్యాఖ్యలు చేయడంపై భారత్ వాటిపై ధ్వజమెత్తింది. ఓవైపు ఉగ్రవాదానికి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా యావత్ ప్రపంచం పోరాడుతుంటే దాన్ని సమర్థిస్తూ ఇస్లామిక్ దేశాలు వ్యాఖ్యలు చేయడం సరికాదని తన అభ్యంతరాన్ని గట్టిగా ఆ దేశాలకు తెలిపింది. ఉగ్రవాదులకు మద్దతు నిస్తూ వ్యాఖ్యలు చేయడాన్ని ఇకనైనా మానుకోవాలని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ)కు హితవు పలికింది.జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ కు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ ఎన్ఐఏ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై ఇస్లామిక్ దేశాల మానవ హక్కుల విభాగం (ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు ఇచ్చిన తీర్పును ఖండించింది. యాసిన్ మాలిక్ శిక్ష విషయంలో భారత్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని అనవసరపు వ్యాఖ్యలు చేసింది.

కాగా ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంతో పాటు భారతదేశంపై దాడికి కుట్ర పన్నడంతోపాటు తదితర నేరాల్లో యాసిన్ మాలిక్ దోషిగా తేలాడు. దీంతో అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఇటీవల ఎన్‌ఐఏ కోర్టు తీర్పు వెలువరించింది.

ఈ నేపథ్యంలో ఇస్లామిక్ దేశాల వ్యాఖ్యలపై కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ స్పందించారు. యాసిన్ మాలిక్ కేసులో ఇచ్చిన తీర్పుపై భారత్‌ను విమర్శిస్తూ ముస్లిం దేశాల కూటమి చేసిన సరికాదన్నారు. ఈ వ్యాఖ్యలతో యాసిన్ మాలిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఆ దేశాలు మద్దతిస్తున్నట్లు అర్థమవుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ఏ విధంగానూ ఎవరూ మద్దతు ఇవ్వకూడదని యావత్ ప్రపంచం కోరుకుంటోందని గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో ఇస్లామిక్ దేశాల కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయకూడదన్నారు. ప్రపంచ దేశాల అభిమతానికి అనుగుణంగా ఇస్లామిక్ దేశాలు నడుచుకోవాలని కోరారు.

కాగా యాసిన్ మాలిక్ చేసిన నేరాలకు అతడికి మరణశిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ కోర్టును కోరింది. అయితే కోర్టు అతడికి యావజ్జీవ శిక్షతో సరిపెట్టింది. అంతేకాకుండా రూ.11 లక్షల రూపాయల జరిమానా విధించారు. 2017లో జమ్మూకాశ్మీరులో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించడానికి ఫ్రీడమ్ స్ట్రగుల్ పేరుతో యాసిన్ మాలిక్ నిధులు సమకూర్చాడని యాసిన్ మాలిక్ పై తొలి కేసు నమోదైంది. జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చైర్మనుగా హురియత్ కాన్ఫరెన్సు నాయకుడిగానూ యాసిన్ మాలిక్ ఉన్నాడు. 1990లో శ్రీనగర్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బందిపై యాసిన్ మాలిక్ జరిపిన దాడిలో నలుగురు సిబ్బంది మరణించారు.