Begin typing your search above and press return to search.

భారత్-అమెరికా ఒప్పందాలు: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు

By:  Tupaki Desk   |   26 Feb 2020 9:30 AM GMT
భారత్-అమెరికా ఒప్పందాలు: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు
X
భారతదేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటనను ప్రపంచమంతా ఆసక్తిగా గమనించింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్ లో అగ్రరాజ్య అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ పర్యటించడంతో ప్రపంచ దేశాలన్నీ విశేష ప్రాధాన్యమిచ్చాయి. సోమ, మంగళవారాల్లో ట్రంప్ తన సతీమణి మెలనియాతో కలిసి అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీలో పర్యటించి సందడి చేశారు. ఈ పర్యటనలో భారత్ తో అమెరికా కీలక ఒప్పందాలు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షడు ట్రంప్ సమావేశమై పలు ఒప్పందాలపై చర్చించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన విందును పూర్తి చేసుకుని మంగళవారం రాత్రి అమెరికా వెళ్లారు. ఈ సందర్భంగా ట్రంప్ తో తీసుకున్న నిర్ణయాలు పాకిస్తాన్, చైనాకు చెక్ పెట్టినట్లు ఉన్నాయి. దీంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు మాదిరిగా అమెరికాతో ఒప్పందాలు ఉన్నాయి.

ఒక్క వాణిజ్య ఒప్పందం మినహా మిగతా అంశాలపై అమెరికా ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా సీఏఏ విషయం, కశ్మీర్ వ్యవహారం తదితర అంశాలపై ట్రంప్ భారత అంతర్గత అంశమని ప్రకటించారు. ట్రంప్ ప్రకటనను అందరూ స్వాగతించారు. కశ్మీర్ లో 370 అధికరణం రద్దు, కశ్మీర్ విభజనపై రాద్ధాంతం చేసిన పాకిస్తాన్ కు ట్రంప్ ప్రకటన చెంపదెబ్బలాంటిదిగా అభివర్ణించవచ్చు. అయితే కశ్మీర్ విషయంలో వివాదాలు తీవ్రమైతే అమెరికా మధ్యవర్తిగా ఉండడానికి సిద్ధమని ప్రకటించడంతో భారతీయులకు మింగుడు పడలేదు. దీంతో పాటు పలు రక్షణ ఒప్పందాలను చేసుకోవడంతో భారత్ పై ఎప్పుడు కాలు దువ్వేందుకు సిద్ధంగా ఉన్న చైనాకు చెక్ పెట్టినట్లు పరిణామాలు ఉన్నాయి.

భారత్‌తో 25 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉందని ఆందోళన వ్యక్తం చేసిన ట్రంప్ ఈ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని భారత్ కు గుర్తుచేశారు. ఈ క్రమంలోనే తమ ఎగుమతులపై భారత్ భారీగా సుంకాలు విధిస్తోందని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా నుంచి 3 బిలియన్ డాలర్ల విలువైన హెలికాఫ్టర్లు, ఇతర సైనిక పరికరాలను కొనుగోలు చేయడం కోసం భారత్ ఒప్పందం చేసుకుంది. భారత్‌కు అత్యాధునిక అపాచీ, ఎంహెచ్ 60 రోమియో హెలికాప్టర్లను అందజేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం వచ్చే మూడేళ్లలో భారత్‌కు 24 ఎంహెచ్‌-60 రోమియో సీహాక్‌ హెలికాప్టర్లను, 12 ఏహెచ్‌ 64ఈ అపాచీ హెలికాప్లర్లను అమెరికా అందించే అవకాశం ఉంది.

అయితే ఈ ఒప్పందాలతో చైనాకు చెక్‌ పెట్టడం కోసమే భారత్‌తో అమెరికా 3 బిలియన్ డాలర్ల (రూ.21 వేల కోట్లు) విలువైన రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒప్పందంలో భాగంగా చేసుకున్న ఎంహెచ్‌-60 రోమియో సీహాక్‌ హెలికాప్టర్లు అత్యంత కీలకమైనవి. ఇవి శత్రు జలాంతర్గాములను పసిగట్టి దాడులు చేయటానికి ఉపకరిస్తాయి. ఏహెచ్‌ 64ఈ అపాచీ హెలికాప్టర్లను బోయింగ్ సంస్థ భారత్‌లోనే తయారు చేయనుంది. వీటికి అవసరమైన కొన్ని విడిభాగాలను బోయింగ్‌-టాటా అనుబంధ సంస్థ తెలంగాణలోని హైదరాబాద్‌లో తయారు చేయనుంది.