Begin typing your search above and press return to search.

అమెరికాను ఆక్రమించేస్తున్న ఇండియన్స్

By:  Tupaki Desk   |   18 Nov 2019 1:21 PM GMT
అమెరికాను ఆక్రమించేస్తున్న ఇండియన్స్
X
డోనాల్డ్ ట్రంప్ వీసా విధానాలు - అమెరికాలో భద్రతా సమస్యలు వంటి కారణాలేవీ భారతీయులకు అమెరికాపై ఉన్న ఆకర్షణను ఏమాత్రం తగ్గించలేకపోతున్నాయి. ప్రపంచ దేశాల నుంచి అమెరికా వెళ్తున్న వారిలో చైనా తరువాత స్థానంలో భారతీయులే ఉన్నారని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. దీంతో భారతీయులు అమెరికాలో అతిపెద్ద మానవ వనరుగా అవతరిస్తున్నారు. 2018-19లో ఇండియా నుంచి ఏకంగా 2 లక్షల మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లారని సోమవారం విడుదలైన ‘ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్ ఛేంజ్-2019’ నివేదిక వెల్లడించింది. అమెరికాలోని విదేశీ విద్యార్థుల సంఖ్య 2018-19 విద్యా సంవత్సరంలో మునుపెన్నడూ లేనంత అధికంగా ఉందని ఆ నివేదిక వెల్లడించంది.

గత నాలుగేళ్లుగా అమెరికాకు వస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటా పది లక్షలకు తగ్గకుండా ఉంది. 2018లో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇతర దేశాల విద్యార్థులే 44.7 బిలియన్ డాలర్లు అందించారని - అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 5.5 శాతం పెరిగిందని అమెరికా వాణిజ్య విభాగం తెలిపింది.

2018-19లో చైనా నుంచి 3,69,548 మంది విద్యార్థులు అమెరికాకు వెళ్లగా... భారత్ నుంచి 2,02,014 మంది వెళ్లారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన మొత్తం విద్యార్థుల సంఖ్య 10,95,299. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 0.05 శాతం పెరిగింది. మొత్తం అమెరికా ఉన్నత విద్యార్థుల సంఖ్యలో అంతర్జాతీయ విద్యార్థులు 5.5 శాతం మంది ఉన్నారు. ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఈఈఏ) - యుఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ - బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్ విడుదల చేసిన నివేదికలో ఇండియా - చైనా విద్యార్థులు 50 శాతానికి పైగా ఉన్నారని పేర్కొంది.

చైనా - భారత్‌ - దక్షిణ కొరియా - సౌదీ అరేబియా - కెనడా దేశాలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయని నివేదిక తెలిపింది. అమెరికాలో 51.6 శాతం మంది అంతర్జాతీయ విద్యార్థులు 2018-19లో సైన్స్ - ఇంజనీరింగ్ - టెక్నాలజీ - మ్యాథ్స్ రంగాలను అభ్యసించారు. మ్యాథ్స్ - కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌ లలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 9.4 శాతం పెరిగి బిజినెస్ అండ్ మేనేజ్‌ మెంట్‌ ను అధిగమించాయి. 2018-19లో అంతర్జాతీయ విద్యార్థులకు ఇంజనీరింగ్ తొలి ప్రాధాన్యంగా నిలిచింది. వీరి వాటా మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో 21.1 శాతం.