Begin typing your search above and press return to search.

కరోనా విజృంభణ...కోటి 30 లక్షల చేరువలో కేసులు..5.5 లక్షలు దాటిన మరణాలు!

By:  Tupaki Desk   |   10 July 2020 7:00 AM GMT
కరోనా విజృంభణ...కోటి 30 లక్షల చేరువలో కేసులు..5.5 లక్షలు దాటిన మరణాలు!
X
కరోనా వైరస్ ..కరోనా వైరస్ ..కరోనా వైరస్ ..గత కొన్ని నెలలుగా ప్రపంచంలోని ఏ దేశంలో విన్నా కూడా ఇదే పేరు మారుమోగిపోతుంది. ఈ పేరు వింటేనే ఇప్పుడు ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కరోనా దెబ్బకి పక్క వారితో మాట్లాడాలి అన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. అలాగే ఈ కరోనా మనుషుల్లో ఇంకా కొంచెం మిగిలి ఉన్న మానవత్వాన్ని కూడా చంపేస్తుంది. ఎవరైనా ఆపదలో ఉన్నా కూడా కరోనా భయంతో వారికి సహాయం చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు.

ఇదిలా ఉంటే , రోజురోజుకి కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా గురువారం కొత్తగా 2,22,825 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీనితో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,23,78,854కి చేరింది. అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ 5,56,601 మంది మృతి చెందారు. ఇక గత కొన్ని రోజులుగా అమెరికాను వణికిపోయేలా చేస్తున్న కరోనా .. ఉగ్ర‌రూపం దాల్చింది. దేశంలో గురువారం రికార్డు స్థాయిలో 65,551 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో అగ్ర‌రాజ్యంలో ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,219,999కి చేరుకుంది. మొత్తం మృతుల సంఖ్య 1,35,822కి చేరింది. కాగా అమెరికాలో ఇంత భారీ స్థాయిలో కేసులు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టి సారి. ఇక బ్రెజిల్, ఇట‌లీ, ఫ్రాన్స్, లండ‌న్ వంటి ప‌లు దేశాల్లో కూడా క‌రోనా కేసులు విప‌రీతంగా న‌మోద‌వుతున్నాయి.

ఇక భారత్ లో కూడా కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాగే మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా గడచిన 24 గంటల్లో అత్యధికంగా 24,879 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 487 మంది మృతి చెందిన‌ట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. దీంతో మొత్తం క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 7,67,296కి చేరింది. అలాగే ప్ర‌స్తుతం 2,69,789 యాక్టీవ్ కేసులు ఉండ‌గా.. క‌రోనా నుంచి కోలుకుని 4,76,378 మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ఇప్పటివరకు కరోనా భారిన పడి 21,129 మంది మృతి చెందారు.

ఇక తెలంగాణలో గురువారం 1,410 కరోనా కేసులు నమోదు కాగా ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ మొత్తం 331 మంది చనిపోయారు. మొత్తం 30,946 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇంకా 12,423 యాక్టివ్ కేసులున్నాయి. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 23814కి చేరింది. అలాగే ఇప్పటివరకూ కరోనా కారణంగా 277 మంది మృతి చెందారు. ప్ర‌స్తుతం 11383 క‌రోనా యాక్టివ్ కేసులు ఉండగా, వీరిలో 12154 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.