Begin typing your search above and press return to search.

లేటెస్ట్ అప్డేట్ : భారత్‌ లో కరోనా విజృంభణ... కొత్త కేసులు ఎన్నంటే !

By:  Tupaki Desk   |   7 July 2020 7:10 AM GMT
లేటెస్ట్ అప్డేట్ :  భారత్‌ లో కరోనా విజృంభణ... కొత్త కేసులు ఎన్నంటే !
X

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 22,252 మందికి కొత్తగా కరోనా సోకిందని తెలిపింది. అదే సమయంలో 467 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 7,19,665 చేరగా, మృతుల సంఖ్య మొత్తం 20,160కి పెరిగింది. 2,59,557 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,39,948 మంది కోలుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు 8 శాతంగా ఉండగా ఇండియాలో అది 2.8 శాతంగా ఉంది. ప్రపంచంతో పోల్చితే... ఇండియాలో మొత్తం కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఫలితంగా ఇండియా, అమెరికా, బ్రెజిల్ తర్వాత మూడోస్థానంలో ఉంది. ఇండియాలో టెస్టుల సంఖ్య పెంచుతుండటం కూడా ఇందుకు కారణమవుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో మొత్తం కేసుల్లో ఇండియా మూ‌డో స్థానంలో ఉండగా రోజువారీ కేసుల్లో రెండో స్థానంలో ఉంది. అలాగే రోజువారీ మరణాల్లో భారత్ రెండో స్థానంలో ఉండగా మొత్తం మరణాల్లో ఇండియా రోజూలాగే 8వ స్థానంలో ఉంది.

తెలంగాణ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1831 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1419 ఉండటం హైదరాబాద్‌లో కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25733కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 11 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 306కు చేరింది.

ఇకపోతే , ఆంధ్రప్రదేశ్ ‌లోను కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1322 కేసులు వెలుగు చూశాయి. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు 56 మంది ఉండగా, విదేశాల నుంచి వచ్చిన వారు ముగ్గురు ఉన్నారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20019 దాటింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 424 మంది కరోనా నుంచి కోలుకున్నారుమరోవైపు గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఏడుగురు చనిపోయారు. దీంతో ఏపీలో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 239కి చేరింది.

ఇకపోతే ప్రపంచ వ్యాప్తంగా కరోనా భారిన పడిన వారి సంఖ్య 11,744,397 కి చేరింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 540,764 మంది కరోనా కారణంగా మరణించారు.