పేదరికం నుంచి అభివృద్ధి వైపు భారత్ అడుగులు

Wed Jul 11 2018 15:48:14 GMT+0530 (IST)

అభివృద్ధి చెందుతున్న ఏ దేశానికి అయినా అధిక జనాభా దానివల్ల పెరిగే పేదరికం పెద్ద అడ్డంకే. తక్కువ స్థలం ఎక్కువ జనాభాతో భారతదేశం పలు సమస్యలు ఎదుర్కొంటోంది. టెక్నాలజీ పరంగా యువత పరంగా సమృద్ధిగా ఉన్నా కూడా పేదల జనాభా వారికి వసతుల కల్పన భారం దేశానికి ఒక ఇబ్బందికరమే. అయితే కొన్ని దశాబ్దాలుగా కఠిక పేదరికంలో జీవిస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంటూ వచ్చింది. ఇందుకు జనాభాయే కారణం. అయితే తాజా గణాంకాల ప్రకారం భారత్ స్థానాన్ని నైజీరియా ఆక్రమించుకున్నట్లు ఓ నివేదిక తెలిపింది. కఠిక పేదరికంలో నివసిస్తున్న దేశాల్లో ఇప్పుడు నైజీరియా టాప్ ప్లేస్ లో నిలిచినట్లు బ్రుకింగ్స్ ఇన్ స్టిట్యూషన్ నివేదిక విడుదల చేసింది.ఏ దేశానికైనా మొదటి లక్ష్యం పేదలను ఆ కూపం నుంచి బయటపడేయడం. అయితే దీనివల్ల ప్రభుత్వం ఇతర సమస్యలపై దృష్టిపెట్టడం ఇబ్బంది కరం. నైజీరియాలో ప్రజలు రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువతో జీవిస్తున్నట్లు రిపోర్ట్ వెల్లడించింది. తాజా నివేదికలో నైజీరియాలో 87 మిలియన్ మంది పేదరికంలో ఉండగా ఇండియాలో 70.6 మిలియన్ల మంది పేదరికంలో ఉన్నారు. నైజీరియాలో పెరుగుతూ ఉండగా ఇండియాలో పేదరికం తగ్గుతూ వస్తోంది. భారత్‌లో నిమిషానికి 44 మంది పేదరికం నుంచి బయట పడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగినా చాలు దశాబ్దం లోపు ఇండియా ఎంతో మెరుగయ్యే అవకాశం ఉంటుంది.

పేదరికంలో అగ్రస్థానంలో ఉన్న భారత్... తన స్థానం పాజిటివ్‌గా మెరుగుపరుచుకోవడం నిజంగా శుభపరిణామం అని బ్రుకింగ్ ఇన్ స్టిటిట్యూషన్ కు చెందిన గ్లోబల్ ఎకానమి అండ్ డెవలప్ మెంట్ డైరెక్టర్ హోమీ ఖరాస్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అత్యంత పేదరికంలో జీవిస్తున్న దేశాల్లో మూడోవంతు దేశాలు ఒక్క ఆఫ్రికా ఖండంలోనే ఉన్నట్లు ఆయన చెప్పారు. 1990 నుంచి ఆసియా ఖండాల్లో పేదరికం తగ్గుతూ వస్తోందని వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పడం గమనార్హం. 2021 నాటికి భారత్ లో 3 శాతానికి పడిపోతుందని అంచనా వేస్తున్నారు.