Begin typing your search above and press return to search.

11 ఏళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధి రేటు

By:  Tupaki Desk   |   29 May 2020 4:15 PM GMT
11 ఏళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధి రేటు
X
భారతదేశ ఆర్థిక వ్యవస్థ2019-20 ఆర్థిక సంవత్సరంలో 11 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. జాతీయ గణాంక కార్యాలయం తెలిపిన వివరాల మేరకు గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం జనవరి - మార్చి మధ్య జీడీపీ వృద్ధి రేటు 3.1 శాతం నమోదయింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో చివరి క్వార్టర్‌లో 5.7 శాతం నమోదయింది.

2019-20 పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 4.2 శాతంగా నమోదు కాగా, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 6.1 శాతంగా నమోదయింది. గత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును 5 శాతానికి అంచనా వేయగా పదకొండేళ్ల కనిష్టానికి 4.2 శాతానికి పడిపోయింది.

కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడంతో భారత్ పైన పెను ప్రభావం పడింది. మార్చి చివరి వారం నుండి లాక్ డౌన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా-లాక్‌డౌన్ కారణంగా తయారీ, సేవా రంగాలు స్తంభించాయి. ఇది జీడీపీపై ప్రభావం చూపింది. గత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ క్వార్టర్ వృద్ధి రేటు 4.7 శాతం, సెప్టెంబర్ క్వార్టర్ వృద్ధి రేటు 4.4 శాతం, జూన్ క్వార్టర్ వృద్ధి రేటు 5.2 శాతంగా నమోదయింది. 4.7 శాతంతో డిసెంబర్ క్వార్టర్ వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది.

కరోనా మహమ్మారి ప్రారంభమైన, లాక్ డౌన్ ప్రారంభమైన సమయంలోనే జీడీపీ వృద్ధి రేటు పదకొండేళ్ల కనిష్టానికి పడిపోవడంతో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి వరుసగా రెండు నెలలుగా లాక్ డొన్ కొనసాగుతోంది. జూన్‌లో కొన్ని భారీ సడలింపులతో లాక్ డౌన్ కొనసాగవచ్చునని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 2020-21 తొలి క్వార్టర్‌లో జీడీపీ ఆందోళన కలిగిస్తోంది.