ఇండియా.. ఆసియాలోనే టాప్ ఎకానమీ.. ఎలా సాధ్యం?

Wed Aug 10 2022 17:00:00 GMT+0530 (India Standard Time)

India's economy will occupy 28 percent of Asia's growth and 22 percent of global progress

కరోనా కల్లోలంతో దేశమంతా ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతోంది. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. అమెరికా లాంటి అగ్రదేశం కూడా అతలాకుతలమైంది. ఇక భారతదేశం కూడా జీడీపీ దిగజారిపోయింది. ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థలన్నీ పుంజుకుంటున్నాయి.భారతదేశం కూడా వేగంగా పుంజుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆసియా ఖండంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ఎకానమీగా ఇండియా అవతరించింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గ్రోత్ సగటున ఏడు శాతానికి చేరుతోంది. తద్వారా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థికవ్యవస్థల్లో బలమైన ఎకానమీగా ఇండియా ఎదుగనుందని మోర్గాన్ స్టాన్లీ అనలిస్టులు అంచనావేస్తున్నారు. వచ్చే పదేళ్లలో అత్యుత్తమ పనితీరుకు ఇది సంకేతమని వెల్లడించారు. ఆసియా వృద్ధిలో 28 శాతం ప్రపంచ పురోగతిలో 22 శాతం వాటాను ఇండియా ఎకనామీ ఆక్రమించనున్నట్లు పేర్కొన్నారు.

2030 నాటికి భారత ఫిన్ టెక్ మార్కెట్ ఏకంగా 10 రెట్లు పెరుగనుందని స్టాన్లీ నివేదిక వెల్లడించింది. ఆస్తుల విలువ ఒక ట్రిలియన్ డాలర్లకు చేరనుంది. దీనికి కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు వెన్నెముకగా నిలవనున్నాయి.  డిజిటల్ ఇండియా స్మార్ట్ సిటీ యూపీఐ లావాదేవీలు ప్రముఖ పాత్ర పోషించనున్నాయి.

ప్రస్తుతం భారత దేశంలో 21 ఫిన్ టెక్ యూనికార్న్ లు ఉన్నాయి. అతిపెద్ద ఫిన్ టెక్ యూనికార్న్ ఎకోసిస్టమ్ గా ఇండియా గుర్తింపు పొందింది. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) రంగం కోవిడ్ పూర్వ స్థాయిలకు కోలుకుంటోంది. ఈ సెక్టర్ లో క్రెడిట్ డిమాండ్ 60 శాతం పెరిగింది. ఏడాది కాలంగా మొండి బకాయిలు సంఖ్య నియంత్రణలో ఉంది. దీనికి కేంద్రప్రభుత్వ పథకం ఊతంగా నిలిచింది.

భారత్ రూపాయి ఇటీవల ఊహించనంత క్షీణత ఏర్పడడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో రూపాయి విలువ పడిపోకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పటిష్ట చర్యలు చేపట్టింది. విదేశాల్లో చెల్లింపులు రూపాయల్లో చెల్లింపులు చేసేలా అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా ఎగుమతులు దిగుమతులు వాణిజ్యం కోసం కొత్త ప్రేమ్ వర్క్ ను రూపొందించింది.

కేంద్ర ప్రభుత్వ ఆమోదంలో ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు రూపాయి విలువను కాపాడుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇదే సమయంలో శ్రీలంక దేశంలోనూ భారత రూపాయిని వినియోగించాలని నిర్ణయించారు. దీంతో భారత్ తో పాటు శ్రీలంక దేశానికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోనున్నారు.

ఇలా భారత ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి కేంద్రం ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు ఈ సంక్షోభం నుంచి బయటపడేసేలా ఉన్నాయి.