Begin typing your search above and press return to search.

రెండున్నరేళ్లలో ఉద్యోగ, ఉపాధి కోసం వలస వెళ్లిన భారతీయులు 28 లక్షలు

By:  Tupaki Desk   |   5 Aug 2022 3:30 PM GMT
రెండున్నరేళ్లలో ఉద్యోగ, ఉపాధి కోసం వలస వెళ్లిన భారతీయులు 28 లక్షలు
X

ఎక్కడ ఉపాధి, ఉద్యోగాలుంటే అక్కడికే పయనం.. అభివృద్ధి కోసం కొందరు.. ఉన్నత చదువుల కోసం ఇంకొందరు.. ఉపాధి కోసం మరికొందరు దేశం దాటేస్తున్నారు. మాతృదేశంలో ఉపాధి లేదని.. పరాయి దేశమే ముద్దు అని భారతీయులు విమానం ఎక్కేస్తున్నారు.. అక్కడ సెటిల్ అయిపోయి భారత పౌరసత్వం కంటే విదేశీ పాశ్చాత్య అభివృద్ది చెందిన దేశాలకే ఓటు వేస్తున్నారు. అక్కడి దేశస్థుడిగా ఉండడానికే మొగ్గు చూపుతున్నారు. భారత పౌరసత్వాన్ని గత ఏడాదిలో లక్షల మంది వదులుకున్నారు. అసలు దీనికి కారణాలేంటి? ఎందుకు వదులుకుంటున్నారు? అన్నది చర్చనీయాంశమైంది.

గడిచిన రెండున్నరేళ్లలో ఉద్యోగం, ఉపాధి కోసం 28 లక్షల 51వేల మంది భారతీయులు ఇతరదేశాల బాటపట్టారని కేంద్రం లోక్ సభలో వెల్లడించింది. 2020లో 7.15 లక్షలు, 2021లో 8.33 లక్షలు, 2022లో 13.02 లక్షలమంది ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లినట్లు పేర్కొంది.

ఇక దేశంలో విదేశాలకు వెళ్లిన వారిలో అత్యధికంగా 1.32 లక్షల మంది ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్లారు. ఆ తర్వాత బిహార్ నుంచి 69518మంది, తెలంగాణ నుంచి 13401 మంది వెళ్లినట్లు కేంద్రం పేర్కొంది.

2021లో 1.63 లక్షల మంది భారతీయ పౌరులు తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని, ఇది గత మూడేళ్లలోనే అత్యధికమని కేంద్రప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు తెలిపింది. లోక్‌సభలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించిన డేటా ప్రకారం, దాదాపు సగం మంది భారతీయులు - 78,284 మంది అమెరికా పౌరులుగా మారడానికి ఇష్టపడుతున్నారు.

2021లో 1,63,370 మంది భారతీయులు తమ భారతీయ పాస్‌పోర్ట్‌లను వదులుకున్నారు. 2019 - 2020 సంవత్సరాలలో భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారి సంఖ్య వరుసగా 1,44,017 మరియు 85,256 మంది కావడం గమనార్హం.

హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకోవడానికి గల కారణాలు పాశ్చాత్య దేశాలపై మోజు అని అన్నారు. వారు తమ భారతీయ పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేయడం "వారి వ్యక్తిగతం" అని అన్నారు.

బహుజన్ సమాజ్ పార్టీ సభ్యుడు హాజీ ఫజ్లూర్ రెహ్మాన్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి పార్లమెంట్ లో వివరణ ఇచ్చాడు. ఆయన తెలిపిన డేటా ప్రకారం.. అమెరికా తర్వాత అత్యధికంగా భారతీయులు సెటిల్ అయిన దేశం ఆస్ట్రేలియా (23,533), ఆ తర్వాత కెనడా (21,597), యూకే (14,637), ఇటలీ (5,986), న్యూజిలాండ్ (2,643), సింగపూర్ (2,516)లో భారతీయులు పౌరసత్వం పొందేందుకు ఇష్టపడుతున్నారు.

అమెరికా పౌరసత్వానికి సంబంధించినంత వరకు 2021లో 78,284 మంది భారతీయులు, 2020లో 30,828 మంది, మరియు 2019లో 61,683 మంది భారతీయులు అమెరికా పౌరసత్వాన్ని తీసుకున్నారు. వీరంతా తమ భారతీయ జాతీయతను వదిలిపెట్టి అమెరికాలోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు.

పాకిస్తాన్‌లో ఉన్న మొత్తం 41 మంది భారతీయ పౌరులు కూడా గత సంవత్సరం తమ భారత పౌరసత్వాన్ని వదులుకోవడం విశేషం. 2020లో ఏడుగురు మాత్రమే భారత్ ను వదిలేసి పాకిస్తాన్ లో సెటిల్ అయ్యారు.

గత సంవత్సరం యూఏఈలో మొత్తం 326 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. అల్బేనియా, ఫ్రాన్స్, మాల్టా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, పోర్చుగల్, ఆంటిగ్వా మరియు బార్బుడా, బహ్రెయిన్, బెల్జియం, సైప్రస్, ఐర్లాండ్, గ్రెనడా, జోర్డాన్, మారిషస్ వంటి దేశాలలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. నార్వే, సింగపూర్, స్పెయిన్, శ్రీలంక, వనాటు, ఇతర దేశాలలో కూడా భారతీయులు సెటిల్ అయిపోతున్నారు. భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు.

ఇక భారత్ కంటే విదేశాల్లోనే ఎక్కువ ఉపాధి అవకాశాలుండడం.. భారతీయులకు ప్రాధాన్యత ఇస్తుండడం.. భారీ జీతాలు..విలాసవంతమైన జీవనం ఉండడమే భారతీయులు ఆయా అగ్రదేశాలకు, అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళుతున్నారు.