ఒకే రోజు... జగన్ షర్మిల ఇద్దరి రాజకీయాలను మార్చేసింది...

Tue Nov 29 2022 21:11:56 GMT+0530 (India Standard Time)

In a single day Jagan Sharmila both changed their politics

ఒకే రోజు ఒకే డేట్ ఒకే మంత్ ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెళ్ల జీవితాలను రాజకీయంగా మార్చేసింది. ఇది కాకతాళీయం అయినా ఇపుడు రాజకీయ వర్గాలలో సర్వత్రా చర్చ సాగుతోంది. ఇప్పటికి పన్నెండేళ్ల క్రితం అంటే 2010 నవంబర్ 29న జగన్ కాంగ్రెస్ పార్టీకి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు.ఆనాడు ఆయన కాంగ్రెస్ ని వీడి అతి పెద్ద సాహసం చేసిన రోజుగా 29 ఉంది. జగన్ రాజకీయ జీవితం అక్కడే అనూహ్యమైన మలుపు తిరిగింది. అది జరిగిన తరువాతనే ఆయన కడప ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి భారీ ఆధిక్యతతో ఎంపీ కావడం తన తల్లి విజయమ్మను గెలిపించుకోవడం జరిగాయి.

ఆ తరువాత ఆయన పార్టీ వైసీపీ ఏపీలో ఎంతటి సంచలనం క్రియేట్ చేసిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అలా జగన్ ఈ రోజు సీఎం కుర్చీలో కూర్చున్నారు అంటే 2010 నవంబర్ 29 ఆయన జీవితంలో మేలి మలుపుని తిప్పిందనే చెప్పాలి. మరి జగన్ కి అంతటి రాజకీయ అవకాశం ఇచ్చి జాతకాన్ని మొత్తం మార్చేసిన అదే డేట్ అదే మంత్ ఆయన సోదరి షర్మిల విషయంలోనూ అంతే చేసింది.

ఆమె వైఎస్సార్టీపెని పెట్టి రెండేళ్ళుగా తెలంగాణాలో రాజకీయాలు చేస్తున్నా రాని గుర్తింపు నవంబర్ 29 ఒకే ఒక్క రోజు ఇచ్చింది. ఆమె ప్రగతిభవన్ వైపుగా దూసుకుపోవాలని చేసిన ఒక అతి పెద్ద సాహసం ఆమెని ఈ రోజు తెలంగాణాలోనే కాదు జాతీయ స్థాయిలోనే మీడియా మొత్తం అటెన్షన్ క్రియేట్ అయ్యేలా చేశాయి.

ఒక మహిళ అని చూడకుండా ఆమె ఉన్న కారుని క్రేన్ తో ఎత్తి పడేసిన పోలీసులు వారిని అలా డైరెక్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఈ విషయంలో బదనాం అవుతూంటే షర్మిల పేరు మాత్రం మారుమోగిపోయింది. జాతీయ రాజకీయాల్లో కూడా ఇది చర్చకు డిబేట్లకు కారణం అవుతోంది. రాజకీయాల్లో ఇలా కూడా అరెస్టులు ఉంటాయా అని కూడా దేశం మొత్తం తెలంగాణా వైపు చూసే పరిస్థితి ఏర్పడింది.

క్రేన్ తో కారు ఎపుడు తీసుకెళ్తారు ఒక మహిళ పార్టీ ప్రెసిడెంట్ కూర్చున్న కారుని ఏ మాత్రం పట్టించుకోకుండా లైట్ తీసుకుని ఎత్తి కుదేయడం అంటే ఇది మానవ హక్కుల మీద దాడిగా కూడా కొందరు చర్చను లేవనెత్తుతున్నారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అయితే ఒక మహిళ మీద తెలంగాణా ప్రభుత్వం చేసిన అతి పెద్ద దాడి ఇది అని విమర్శించారు.

ఇలా షర్మిల ఇపుడు టాక్ ఆఫ్ ద నేషన్ అయిపోయారు. ఇక్కడ ఆమె పోరాట పటిమ కూడా చర్చకు వస్తోంది. క్రేన్ లో కారుని లాక్ చేసి తీసుకెళ్తూంటే ఎలాంటి తత్తరపాటుకు గురి కాకుండా ఆమె అలాగే కూర్చోవడం కూడా అందరూ చర్చించుకునేలా చేస్తోంది.

తెలంగాణాలో టీయారెస్ సర్కార్ బలంగా ఉంది. ఆ విషయంలో ఎవరికీ డౌట్లు లేవు. కానీ కొన్ని సంఘటనలు చిన్నగా కనిపించవచ్చు. వాటి ప్రభావం ఆకాశమంత ఉంటుంది. అవి భూ ప్రకంపననలు కూడా సృష్టిస్తాయి. ఆ విధంగా చూసుకుంటే షర్మిల ఇపుడు తెలంగాణాలో కేసీయార్ ఢీ కొట్టే డేర్ లేడీగా కనిపించినా ఆశ్చర్యం లేదు. తన వెనక ఏవరూ పెద్దగా లేకపోయినా ఆమె చేసిన ఈ పోరాటంతోనే అన్ని పార్టీలు నోరు విప్పాల్సి వస్తోంది. మీడియా కూడా ఆమెని ఫోకస్ చేస్తోంది.

అలా టీయారెస్ వర్సెస్ బీజేపీ అన్న వాతావరణాన్ని షర్మిల కాస్తా ఈ రోజున కేసీయార్ వర్సెస్ షర్మిలగా మర్చేశారు. ఆమెలో ఇంతటి ఫైర్ ఉందని తెలంగాణా సమాజం కూడా తొలిసారి చూసింది. మరి ఆమె తన రాజకీయ ధాటిని జోరుని సవ్య దిశలో ఉపయోగిస్తే మాత్రం ఆమెకూ ఎంతో కొంత స్పేస్ ఉండవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా అన్నకు కలసివచ్చిన డేట్ మంత్ చెల్లికీ పొలిటికల్ గా ఫోకస్ ని ఇచ్చాయి. ఆ మీదట జరిగే పరిణామాలు ఎలా ఆమెను ముందుకు తీసుకెళ్తాయో చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.