Begin typing your search above and press return to search.

బిల్లుకు మద్దతుగా ఓటేసి మడత పేచీ పెట్టిన సేన

By:  Tupaki Desk   |   10 Dec 2019 11:09 AM GMT
బిల్లుకు మద్దతుగా ఓటేసి మడత పేచీ పెట్టిన సేన
X
తన కత్తికి ఇరువైపులా పదునే అన్నట్లుగా వ్యవహరించే తీరు కొన్ని రాజకీయ పార్టీలు చేస్తుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి తీరు టీఆర్ఎస్ లో కనిపిస్తుంది. ఇక.. మహారాష్ట్రలో శివసేన పార్టీలోనూ ఇలాంటి లక్షణమే కనిపిస్తుంది. నిన్నటికి నిన్న పౌరసత్వ బిల్లుకు అనుకూలంగా ఓటేసి తన మిత్రపక్షమైన కాంగ్రెస్.. ఎన్సీపీలకు షాకిచ్చిన సేన.. తాజాగా కొత్త వాదనను తెర మీదకు తెచ్చి బీజేపీకి ఝులక్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.

బీజేపీ ప్రవేశ పెట్టిన పౌరసత్వ బిల్లుపై విమర్శలు చేస్తూనే.. లోక్ సభలో ఓటింగ్ సమయానికి మాత్రం ఊహించని రీతిలో బీజేపీకి అనుకూలంగా ఓటేయటం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ఉడికిపోతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సైతం సేన తీరును తప్పు పట్టేలా ట్వీట్ చేశారు. పౌరసత్వ బిల్లు రాజ్యాంగంపైన దాడిగా ఆయన అభివర్ణించారు. ఇలాంటి వేళ పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు.

పాక్.. బంగ్లాదేశ్.. అఫ్ఘానిస్థాన్ లలో మతపరమైన దాడులకు గురై భారత్ కు వచ్చే ముస్లిమేతరులను ఆదుకునేందుకు వీలుగా ఈ బిల్లును తయారు చేసినట్లుగా అమిత్ షా చెప్పారు. అయితే.. ఈ బిల్లుపై విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. లోక్ సభలో పాస్ అయిన ఈ బిల్లు రాజ్యసభలోనూ పాస్ కావాల్సి ఉంది. అయితే.. పెద్దల సభలో బీజేపీ బలం బొటాబొటీగా ఉండటం.. ఎవరో ఒకరి సాయం అవసరమైన వేళ.. తాజాగా సేన తీసుకొచ్చిన కొత్త వాదన విపక్షాలకు సైతం అంగీకార యోగ్యంగా ఉండేలా ఉంది.

ఇంతకీ సేన తాజా డిమాండ్ ఏమంటే.. లోక్ సభలో పాస్ అయిన బిల్లుకు రాజ్యసభలో ఆమోదముద్రకు తమ మద్దతు ఇవ్వాలంటే పౌరసత్వం పొందిన వారికి పాతికేళ్ల వరకూ ఓటుహక్కు ఇవ్వకూడదన్న రూల్ పెట్టాలంటూ కొత్త మెలికను తెరపైకి తెచ్చారు. తమ డిమాండ్ మీద స్పష్టత ఇచ్చే వరకూ.. తమకున్న అనుమానాల్ని తీర్చే వరకూ రాజ్యసభలో ఈ బిల్లుకు తమ మద్దతు ఉండని చెప్పింది. మొత్తంగా చూసినప్పుడు సేన తీరు సర్కర్ రోప్ మీద విన్యాసం చేసినట్లుగా ఉందని చెప్పాలి. బీజేపీ మూలసిద్ధాంతానికి దగ్గరగా ఉన్న సేన.. పౌరసత్వ బిల్లుకు ఓకే చెబుతూనే..తన మిత్రపక్షమైన కాంగ్రెస్ కున్న కోపాన్ని తగ్గించేందుకు వీలుగా తాజా ప్రతిపాదనను తెర మీదకు తెచ్చారన్న మాట వినిపిస్తోంది.