మునిసిపోల్స్ లో.. టీఆర్ఎస్ క్లీన్ స్వీప్!

Mon May 03 2021 21:00:01 GMT+0530 (IST)

In Municipalities TRS Clean Sweep?

తెలంగాణలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం ఐదు మునిసిపాలిటీలకు రెండు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. వాటిలో.. ఖమ్మం వరంగల్ కార్పొరేషన్లు జడ్చర్ల అచ్చంపేట నకిరేకల్ కొత్తూరు సిద్ధిపేట మునిసిపాలిటీలు ఉన్నాయి. వీటన్నింటా గులాబీ పార్టీ విజయ దుందుభి మోగించింది. దీంతో.. టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి.వరంగల్ కార్పొరేషన్లో 66 స్థానాలకు గానూ ఇప్పటి వరకు 49 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ 33 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 10 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో గెలిచింది. అటు ఖమ్మం కార్పొరేషన్లో 60 స్థానాలకు గానూ.. 42 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ కూటమి ఇప్పటికే 33 స్థానాలు గెలుచుకొని విజయఢంకా మోగించింది. కాంగ్రెస్ కూటమికి 6 బీజేపీ కూటమికి ఒక్కసీటు మాత్రమే దక్కాయి.

ఇక ఐదు మునిసిపాలిటీల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. అన్ని చోట్లా ఏకపక్ష విజయం నమోదు చేసింది. సిద్ధిపేటలో 43 స్థానాలకు గానూ 36 చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. జడ్చర్లలో 27 వార్డులకు గానూ 23 స్థానాలో జయభేరి మోగించింది. అచ్చంపేటలో 20 వార్డులకు 13 దక్కించుకుంది. నకిరేకల్ లో 20 వార్డులకు 11 చోట్ల గెలిచింది. కొత్తూరులో 12 వార్డులకు 7 గెలిచింది.

కారు జోరును ప్రతిపక్షాలు ఎక్కడా ఎదుర్కోలేకపోయాయి. నకిరేకల్ లో ఫార్వర్డ్ బ్లాక్ కొత్తూరులో కాంగ్రెస్ కాస్త పోటీ ఇచ్చాయి. ఈ విజయంతో గులాబీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి. ఇప్పటికే నాగార్జున సాగర్ ఎన్నికతో మంచి జోష్ మీదున్న టీఆర్ఎస్ కార్యకర్తలు.. ఇప్పుడు మునిసిపోల్స్ లో క్లీన్ స్వీప్ చేయడంతో సంబరాలు చేసుకుంటున్నారు.