Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ ఖాన్ సంచలనం.. ఏకంగా 33 స్థానాల్లో పోటీ..!

By:  Tupaki Desk   |   31 Jan 2023 10:29 AM GMT
ఇమ్రాన్ ఖాన్ సంచలనం.. ఏకంగా 33 స్థానాల్లో పోటీ..!
X
పాకిస్తాన్ రాజకీయాలు రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన తెహ్రీక్ ఎ ఇన్సాఫ్(పీటీఐ) అత్యధిక స్థానాలు సాధించిన మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ఆయన ప్రధాని బాధ్యతలు చేపట్టారు. అయితే పాకిస్థాన్లోని అనిశ్చితి కారణంగా ఆయన సైతం తన పదవీకాలం పూర్తి చేయకుండానే తన పదవీకి రాజీనామా చేయాల్సి వచ్చింది.

అనేక నాటకీయ పరిణామాల మధ్య పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవీ నుంచి దిగిపోయే నాటికి ఆ దేశంలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఉగ్రవాదం మరోవైపు కరోనా.. ఆర్థిక మాంద్యం.. నిత్యావసర ధరల పెరుగుదలతో పాకిస్తాన్ ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీలపై కోత విధిస్తుండటం శోచనీయంగా మారుతోంది.

వీటన్నింటికీ ఇమ్రాన్ ఖాన్ తప్పుడు నిర్ణయాలే కారణమని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ మద్దతుదారులు ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నారు. దీంతో అక్కడి రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన హత్యకు కోసం ఓ ఉగ్రవాద సంస్థకు మాజీ అధ్యక్షుడు జర్దారీ భారీగా నిధులు ఇచ్చారని ఆయన ఆరోపించడం సంచలనంగా మారింది.

సింధ్ ప్రభుత్వం నుంచి అక్రమంగా సంపాదించిన సొమ్మను జర్ధారీ తన హత్యకు సుపారీగా ఇచ్చారని ఆరోపించారు. గతంలోనూ ఇదే తరహాలో తన హత్యకు ఆయన కుట్ర పన్నారని.. ఇందులోనూ జర్ధారీ పాత్ర ఉందని మీడియాకు వివరించారు. వజీరాబాద్‌లో తనపై ప్లాన్-బి అమలు చేసి అంతమొందించాలని చూశారని కానీ అదృష్టవశాత్తు గాయాలతో బయట పడ్డానని గుర్తు చేశారు. ఇప్పుడు తన హత్యకు ప్లాన్ సి అమలు చేస్తున్నారని ఆరోపించారు.

తాజాగా ఇమ్రాన్ ఖాన్ మరో సంచలనానికి తెర లేపారు. గత ఏడాది ఏప్రిల్ లో జరిగిన విశ్వాస పరీక్షలో ఇమ్రాన్ ఖాన్ ఓటమి పాలు కావడంతో ఆయన ఆదేశాల మేరకు పీటీఐకి చెందిన 70 మంది సభ్యులు రాజీనామాలు చేశారు. వీటిని స్పీకర్ ఆమోదించగా తొలుత 33 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే ఈ స్థానాల అన్నింటిలో పీటీఐ నుంచి ఇమ్రాన్ ఖాన్ ఒక్కడే బరిలో నిలువనున్నట్లు పీటీఐ ఉపాధ్యక్షుడు షా మహమూద్ ఖురేషీ వెల్లడించారు.

ముందస్తు ఎన్నికల విషయంలో అధికార పార్టీపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ అసెంబ్లీలో ఖాళీ అయిన 33 స్థానాలకు మార్చి 16న ఉప ఎన్నికలు జరగనున్నాయి. మరీ ఈ ఎన్నికల్లో పీటీఐ నుంచి ఇమ్రాన్ ఒక్కడే బరిలో నిలువడం సంచలనంగా మారింది. మరీ ఈ నిర్ణయం ఇమ్రాన్ ఖాన్ కు కలిసి వస్తుందా? లేదంటే బెడిసి కొడుతుందా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.