Begin typing your search above and press return to search.

రహస్య కుమార్తె వ్యవహారం ఈ మాజీ ప్రధానిని చిక్కుల్లో పడేస్తుందా?

By:  Tupaki Desk   |   23 Jan 2023 2:32 PM GMT
రహస్య కుమార్తె వ్యవహారం ఈ మాజీ ప్రధానిని చిక్కుల్లో పడేస్తుందా?
X
పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ గురించి తెలియనివారు లేరు. 1992లో ఇమ్రాన్‌ ఖాన్‌ కెప్టెన్సీలోనే పాకిస్తాన్‌ వన్డే వరల్డ్‌ కప్‌ ను గెలుచుకుంది. మంచి ఆల్‌ రౌండర్‌ గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్‌ పలువురు అందాల భామలతో ఎఫైర్లు నడిపాడు. ఆ తర్వాత పాక్‌ రాజకీయాల్లోకి ప్రవేశించి తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ పార్టీని స్థాపించి పాక్‌ ప్రధాని కూడా అయ్యారు.

కాగా ప్రస్తుతం ఇమ్రాన్‌ ఖాన్‌ ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు టైరియన్‌ వైట్‌ అనే ఒక కుమార్తె కూడా ఉందని.. ఆ వివరాలను దాచిపెట్టి ఎన్నికల్లో అఫిడవిట్‌ దాఖలు చేశారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. తనకు కేవలం ఇద్డరు కుమారులు మాత్రమే ఉన్నారని ఇమ్రాన్‌ ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారని ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

తన కుమార్తె టైరియన్‌ వైట్‌ ఉనికిని తెలియనీయకుండా నామినేషన్‌ పత్రాల్లో పేర్కొన్నారని.. అందువల్ల ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు ఇస్లామాబాద్‌ హైకోర్టు అంగీకరించింది. దీంతో ఇమ్రాన్‌ ఖాన్‌ పీకల్లోతు కష్టాల్లో పడ్డారు.

పీటీఐ ప్రకారం.. ఇమ్రాన్‌ ఖాన్‌.. సీతా వైట్‌ అనే ఆమెతో గతంలో ప్రేమాయణం నడిపాడు. అయితే ఆమెను ఇమ్రాన్‌ పెళ్లాడలేదు. సీతా వైట్‌ కు, ఇమ్రాన్‌ ఖాన్‌ కు పుట్టిన కుమార్తే ఈ టైరియన్‌ వైట్‌ అని చెబుతున్నారు.

సీతా వైట్‌ అమెరికాలో 43 ఏళ్ల వయసులో 2004లో మరణించారు. ఆ సందర్భంలో అమెరికా మీడియా సీతా వైట్‌.. ఇమ్రాన్‌ ఖాన్‌ ఒకప్పటి ప్రేయసి అని పేర్కొన్నాయి. సీతా వైట్‌ అమెరికాలో యోగా టీచర్‌ అని తెలిపాయి.

టైరియన్‌ వైట్‌ తన కుమార్తె కాదని చెప్పడానికి ఇమ్రాన్‌ ఖాన్‌ డీఎన్‌ఏ టెస్టు చేయించుకోవడానికి నిరాకరించాడు. దీంతో 1997లో అమెరికాలో కాలిఫోర్నియాలోని ఒక న్యాయస్థానం టైరియన్‌ వైట్‌.. ఇమ్రాన్‌ ఖాన్‌ కుమార్తె అని తీర్పును ప్రకటించిందని ఆయన ప్రత్యర్థులు చెబుతున్నారు.

ప్రస్తుతం టైరియన్‌ వైట్‌ లండన్‌లో నివసిస్తోంది. 2022 జూన్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ మాజీ భార్య జెమీమా ఫాదర్స్‌ డే సందర్భంగా ఆమె ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది.

పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీలోని తొమ్మిది నియోజకవర్గాలకు ఆగస్టు 2022లో జరిగిన ఉపఎన్నికల కోసం ఇమ్రాన్‌ ఖాన్‌ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. అందులో ఆయన తనకు కుమార్తె ఉందనే విషయాన్ని పేర్కొనలేదు. తనకు సులైమాన్‌ (26), ఖాసిమ్‌ (23) అనే ఇద్దరు కుమారులు మాత్రమే ఉన్నారని పేర్కొన్నాడు. వీరిద్దరూ 1995లో ఇమ్రాన్‌ ఖాన్‌ పెళ్లిచేసుకున్న జెమీమా గోల్డ్‌స్మిత్‌ కు జన్మించారు.

ఈ నేపథ్యంలో తనకు కూతురు ఉందనే నిజాలను దాచిపెట్టడం ద్వారా ఇమ్రాన్‌ ఖాన్‌.. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 62 పరంగా నీతి, నిజాయితీ, మంచి స్వభావం గల వ్యక్తిగా వ్యవహరించలేదు’ అని ఆయన ప్రత్యర్థులు ఇస్లామాబాద్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయనను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.

ఈ నేపథ్యంలో కోర్టు దీనిపై జనవరి 27లోగా సమాధానమివ్వాలని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం పాకిస్థాన్‌ రాజకీయాల్లో కాక రేపుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.