జగన్ నిర్ణయంతో వారి గుండెల్లో దడదడ

Tue Jun 25 2019 16:01:50 GMT+0530 (IST)

కృష్ణానది కరకట్ట వద్ద అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక భవనం అక్రమ కట్టడమని రివర్ కన్జర్వెన్సీ అనుమతి కూడా లేని నేపథ్యంలో బుధవారం ఆ భవనాన్ని కూల్చేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించటం తెలిసిందే. దీంతో.. ఈ వ్యవహారం పెద్ద చర్చను తెర తీసింది. ఇప్పటికే.. ఈ భవనంలో ఉన్న విలువైన వస్తువుల్ని బుధవారం ఉదయం నాటికి తొలగించాల్సిందిగా సంబంధిత అధికారుల్ని కోరారు.ఇదిలా ఉంటే.. అక్రమ కట్టడాల్ని కూల్చేస్తామంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు నదీపరివాహన ప్రాంతాల్లో ఉన్న అక్రమ నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. మరి ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఇలాంటి కట్టడాలు అధికంగా ఉన్నాయి. దీంతో.. నిర్మాణాల్నికూల్చివేత సాగితే తమ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

తూర్పుగోదావరి జిల్లా గోదావరి పరీవాహన ప్రాంతాల్లో కరకట్ట లోపల అనేక నిర్మాణాల్ని నిర్మించారు. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారు. వాస్తవానికి..నదికి.. కరకట్టకు మధ్య ఎలాంటి కట్టడాలు నిర్మించకూడదు. చాలా కాలం అధ్యాత్మికం.. టూరిజం పేరుతో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు.
రాజమహేంద్రవరంలో చూస్తే.. ఇస్కాన్ టెంపుల్.. రివర్ బే.. టూరిజం కార్యాలయం.. చాంబర్ భవనం.. అయ్యప్ప గుడి.. కైలాసభూమి.. ఇటీవల నిర్మించిన మరో కొత్త గుడితో పాటు.. సరస్వతీ జ్ఞాన సరస్వతీ దేవాలయం నిర్మాణంలో ఉంది. ఇవి కాకుండా ధవళేశ్వరం సమీపంలోని లంకల్లోనూ ఇదే రీతిలో పక్కా భవనాలు ఉన్నాయి.

ప్రస్తుతం ప్రస్తావించిన భవనాల్లో చాలావరకూ అనుమతులు లేకుండా నిర్మించేశారు. అక్రమ నిర్మాణాలపై రాజీ లేదని. . కూల్చివేయటం మినహా మరో మార్గం లేదంటూ.. మాజీ ముఖ్యమంత్రి వినియోగించిన భవనాన్నే కూల్చేస్తున్న వేళ.. తమ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. చట్టాన్ని పక్కాగా అమలు చేస్తే.. పెద్ద ఎత్తున భవనాల్నికూల్చివేయాల్సి వస్తుందన్న మాట వినిపిస్తోంది. ఒకసారి ప్రక్షాళన జరిగితే.. కొంత నష్టం జరిగినా.. వ్యవస్థలో తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది. అది చాలు తప్పులు జరగకుండా నివారించేందుకు సాయం చేస్తుందని చెప్పక తప్పదు.