Begin typing your search above and press return to search.

ఐకియా..షాకింగ్ విషయం బయటకొచ్చింది

By:  Tupaki Desk   |   8 Oct 2019 9:38 AM GMT
ఐకియా..షాకింగ్ విషయం బయటకొచ్చింది
X
చిన్నషాపుకు వెళితే.. షాపు యజమాని బిల్లు వేసి ఇస్తే.. పనులెన్ని ఉన్నా ఆగి.. లెక్క చూసుకొని బిల్లు సరిగా ఉందనుకున్న తర్వాతే డబ్బులు కట్టటం చేస్తుంటాం. కానీ.. పే..ద్ద సూపర్ మార్కెట్లలో మాత్రం.. చాటంత బిల్లును మొత్తంగా చూసే తీరికా.. ఓపికా లేకుండా అడిగినంత డబ్బులు చెల్లించేటోళ్లు చాలామందే ఉంటారు. ఎందుకిలా అంటే.. అంత పెద్ద బ్రాండ్ మోసం చేస్తుందా? అన్న భరోసా పలువురి నోటి వెంట వినిపిస్తుంటుంది.

మరి.. అలాంటి పెద్ద బ్రాండ్ కు చెందిన ఒక సంస్థ తప్పు చేసిందని.. తనను మోసం చేసిందంటూ ఒక వ్యక్తి ఆరోపించటమే కాదు.. ఆధారాలతో సహా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇదేదో మామూలు సూపర్ మార్కెట్లో.. మరో ప్రముఖ సంస్థ అయితే ఓకే అనుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉండి.. నమ్మకానికి ప్రతిరూపంగా చెప్పే బ్రాండ్ అయిన ఐకియాకు సంబంధించిన విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.

హైదరాబాద్ మహానగరంలోని టోలిచౌకీ ప్రాంతానికి చెందిన అజీజ్ ఖాన్ అనే వ్యక్తి స్థానికంగా సూపర్ మార్కెట్ నిర్వహిస్తుంటాడు. తన సొంతానికి.. షాపులోకి అవసరమైన ఫర్నిచర్ కొనుగోలు కోసం తరచూ ఐకియా స్టోర్ కు వెళ్లటం ఆయనకు అలవాటు. ఇదే క్రమంలో అక్టోబరు 4న తన కుటుంబంతో కలిసి ఐకియాకు వెళ్లి షాపింగ్ చేశాడు.

బిల్లు వేసిన తర్వాత ఎందుకో అనుమానం వచ్చి చూస్తే.. వస్తువుల దగ్గర పెట్టిన డిస్ ప్లే ధరలకు.. బిల్లులో ఉన్న ధరలకు మధ్య తేడా ఉందన్న విషయాన్ని గుర్తించాడు. వెంటనే బిల్లు పట్టుకొని.. తాను చూసిన ర్యాక్ వద్దకు వెళ్లి చూస్తే.. తన అనుమానం నిజమని తేలింది. ఆరు ఉన్న స్కబ్‌ ఎన్‌బాక్స్‌సెట్‌ వైట్‌’ధర రూ.599 ఉండగా బిల్లులో మాత్రం రూ.699గా వేశారు. ఇలా కొన్ని వస్తువుల్లో ధర తేడాను గుర్తించిన అతడు అక్కడి సిబ్బందిని అడిగినట్లు చెబుతున్నారు.

కస్టమర్ కేర్ కు తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెబుతున్నాడు. తనకు జరిగిన మోసం గురించి రాయదుర్గం పోలీసులకు ఫోన్ చెప్పిన అతడు.. తాజాగా స్టేషన్ కు వెళ్లి ఐకియా మీద కంప్లైంట్ ఇచ్చారు. ఐకియా ప్రతినిధులను పిలిపించి విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. ప్రపంచంలో మంచి పేరున్న ఐకియా లాంటి స్టోర్ లో ఇలాంటి తేడా ఎందుకు వచ్చినట్లు? మరి.. దీనికి ఐకియా ఏమని సమాధానం ఇస్తుందో చూడాలి.