Begin typing your search above and press return to search.

ఈ ఇంటి గురించి తెలిస్తే.. మర్చిపోలేరంతే

By:  Tupaki Desk   |   16 July 2020 4:45 AM GMT
ఈ ఇంటి గురించి తెలిస్తే.. మర్చిపోలేరంతే
X
అందరూ కొన్నింటిని అభిమానిస్తుంటారు. అంతకు మించి ప్రేమిస్తుంటారు. ఈ అందరిలో కొందరు మాత్రం ప్రత్యేకం. వారిలా ప్రేమాభిమానాలు ఉండటం చాలా అరుదు. ఇప్పుడు చెప్పబోయే ఉదంతం ఆ కోవకు చెందినదే. కర్ణాటక రాష్ట్రంలోని బెళగావికి చెందిన ఫోటోగ్రాఫర్ రవి కుటుంబం గురించి తెలుసుకోవాల్సిందే. వారికి ఫోటోగ్రఫీ మీద ఉన్న అభిమానాన్ని ఎంత చెప్పినా తక్కువే. తాము ప్రేమించే కెమేరా వీరి జీవితాల్లో ఎంతలా భాగమైందో వీరింటికి వెళితే ఇట్టే అర్థమవుతుంది. ఇక.. వారింట్లోని వారి గురించి తెలుసుకొని.. వారితో మాట్లాడితే.. వారి జీవితాల్లో కెమేరా కున్న ప్రాధాన్యత తెలిసి ఆశ్చర్యపోవాల్సిందే.

బెళగావికి చెందిన ఫోటోగ్రాఫర్ రవికి భార్య కృపా హొంగల్ తో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కెమేరా మీద తమకున్న మక్కువతో ఆ దంపతులు తమ కొత్త ఇంటిని కెమేరా రూపంలో తయారు చేశారు. రూ.71లక్షలు పెట్టి నిర్మించిన ఆ ఇంటికి ‘‘క్లిక్’’ అన్న పేరు పెట్టారు. అంతేనా.. వీరికి ముగ్గురు పిల్లలు. వారి పేర్లు ఏమిటో తెలుసా? ‘కేనాన్.. నికాన్.. ఎస్పన్’’ అంటూ కెమేరా కంపెనీల పేర్లు పెట్టుకోవటం విశేషం.

ఇక.. వీరుండే ఇంటి విషయానికి వస్తే.. ఇంటి ముందు భాగమైన ఎలివేషన్ కు కెమేరా లెన్సు మాదిరి ఏర్పాటు చేస్తే.. కిచెన్ కిటికీకి లెన్సు రూపాన్ని ఇచ్చారు. బెడ్రూమ్ విండోను మెమొరీ కార్డులా.. రెయిలింగ్ ను రీల్ ఆకారంగా.. మరో బెడ్రూంను ఫ్లాష్ ఆకారంలో ఇలా.. ప్రత్యేకంగా ఇంటిని డిజైన్ చేయించారు. ఈ ఇంటిని ఏప్రిల్ 26న ఘనంగా గృహ ప్రవేశం చేయాలనుకున్నారు కానీ లాక్ డౌన్ కారణంగా సింఫుల్ గా పూర్తి చేశారు. ఈ ఇంటివైపు వెళ్లేవారంతా ఆగి.. ఫోటోలు తీసుకొని కానీ వెళ్లని పరిస్థితి. తమ అభిరుచిని అనుగుణంగా కట్టించుకున్న ఈ ఇల్లు ఇప్పుడు వార్తగా మారి.. వారికో కొత్త ఇమేజ్ ను కట్టబెట్టింది.