వైసీపీలో ఎమ్మెల్యే సీటు రాకుంటే జనసేన ఇస్తుందట...?

Wed Dec 07 2022 12:17:45 GMT+0530 (India Standard Time)

If you don't get an MLA seat in YSRCP, janasena will give it to you?

వైసీపీలో ఈసారి దాదాపుగా యాభై శాతం మందికి టికెట్లు దక్కడం కష్టమని పెద్ద ఎత్తున తాడేపల్లి పరిసరాలలో ప్రచారం సాగుతోంది. దానికి కారణం వైసీపీ ఎమ్మెల్యేల మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడం చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజల మధ్యన లేకపోవడం ఇక వైసీపీ అదే పనిగా చేస్తున్న సర్వేలలో వారు గెలవరు అని నివేదికలు రావడం ఇవన్నీ చూస్తే కనుక ఈసారి సగానికి సగం మందికి టికెట్ డౌట్ వారు అవుట్ అని అంటున్నారు.ఇక ఈ లెక్నన చూస్తే యాభై శాతం మందికి సీట్లు గల్లంతు అవుతాయని అంటున్నారు. అంటే మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలలో  జగన్ని పక్కన పెడితే ఉన్న 150 మందిలో సగానికి సగం అంటే 75 మందికి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినాయకత్వం టికెట్లు ఇవ్వదన్న మాట. నిజంగా ఇదే నిజమైతే ఇది చాలా పెద్ద నంబర్. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతటి సాహసం ఇప్పటిదాకా చేసి ఎరగదు.

అందులో ఒక ప్రాంతీయ పార్టీ ఇంతమందికి టికెట్లు ఇవ్వను అనే ధైర్యం చేస్తే కనుక అది రాజకీయ చరిత్రలోనే సరికొత్త రికార్డుగా ఉంటుంది అని అంటున్నారు. వారంతా అయిదేళ్ల పాటు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మంచో చెడో ఒక ఇమేజ్ అయితే ఉంటుంది. మరి అవినీతి ఆరోపణలు అని పక్కన పెడితే నిజంగా అదే నిజం అనుకుంటే వారి వద్ద అర్థ బలం సమృద్ధిగా ఉంటుంది. ఇక ఎమ్మెల్యేలుగా సిట్టింగులుగా ఉన్నారు కాబట్టి అంగబలానికి ఢోకా ఉండదు. సో వారిని కనుక పక్కన పెడితే వారు భవిష్యత్తు కోసం ఏమైనా చేయవచ్చు.

పైగా చేర్చుకోవడానికి చాలా పార్టీలు కూడా సిద్ధంగా ఉంటాయి. ప్రజల బుర్రలోకి దూరి ఎవరూ సర్వేలు చేయలేరు. ఆనాటికి ఆ రోజుకు పరిస్థితి అలా ఉంది అని ఒక హింట్ మాత్రమే ఇస్తారు. దాన్ని చూసి చాలా మందికి టికెట్లు ఇవ్వమని అంటే అది వైసీపీ భవిష్యత్తుకు ఎంత మేర మేలు చేస్తుందో తెలియదు కానీ ఎమ్మెల్యేలకు మాత్రం అనేక ఆప్షన్లు ఉన్నాయనే అంటున్నారు. పైగా రాజ మార్గాలే చాలా వారి కోసం ఎదురుచూస్తున్నాయని అంటున్నారు.

ఏపీలో ఇపుడు రెండే పార్టీలు లేవు. మూడవ పార్టీగా బలమైన సామాజికవర్గం అండడండలతో జనసేన రాజకీయ అరంగేట్రం చేసింది. దాంతో ఆ పార్టీ ఇలాంటి ఎమ్మెల్యేలు అందరికీ బెస్ట్ ఆప్షన్ గా ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అన్ని రకాలుగా ప్రిపేర్ గానే ఉన్నారని అంటున్నారు.

మా దగ్గర డబ్బు ఉంది జనసేన్ కొత్త పార్టీ. దాంతో రెండూ కలిస్తే మాకు మంచి విజయాలే దక్కుతాయని చాలా మంది కొత్త ఆలోచనలు చస్తునారు అని అంటున్నారు. దాంతోనే జగన్ అదిలింపులూ బెదిరింపులను కూడా చాలా మంది ఖాతరు చేయకుండా ప్లాన్ బీని రెడీ చేసుకునే ఉన్నారని అంటున్నారు. ఇక జనసేనలో చూస్తే పవన్ కళ్యాణ్ వంటి చరిష్మాటిక్ లీడర్ ఉన్నారు. కరడు కట్టిన ఫ్యాన్స్ క్యాడర్ గా ఉన్నారు.

కొత్త పార్టీ కాబట్టి క్యాండిడేట్స్ కూడా లేరు. దాంతో తమకు నచ్చిన చోట తాము ఎంచక్కా పోటీ చేయవచ్చు అని కూడా వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారుట. ఇక జనసేనకు కూడా బలమైన అభ్యర్ధులు కావాలి. పోటీ చేయడానికి వారికి అభ్యర్ధుల కొరత ఉంది. అలాటిది నిన్నటిదాకా ఎమ్మెల్యేగా చేసిన వారు తమ పార్టీలోకి వస్తే పైగా అర్ధ బలం అంగబలంతో వారే ఫీల్డ్ లోకి దిగితే అది తమకు మేలు చేస్తుంది అని ఆ పార్టీ నాయకులు కూడా అనుకుంటున్నారుట.

జనసేన సైతం వైసీపీ వ్యవహార శైలిని గమనిస్తోందిట. ఇంత పెద్ద నంబర్ లో ఎమ్మెల్యేలను వైసీపీ వదిలేసుకుంటే కోరి మరీ జనసేన లాంటి పార్టీకి ప్రాణం పోసినట్లే అని అంటున్నారు. నిజానికి సర్వేలలో నెగ్గుతారు ఓడుతారు అన్నది పక్కన పెడితే సిట్టిగులకు ఎంతో కొంత బలం ఉంటుంది. వారిని పక్కన పెడితే వారు తమ బలంతో బలగంతో వైసీపీ గుమ్మం దాటేస్తే వారి ఓట్లు చీలిపోయి రేపటి ఎన్నికల్లో కొత్త క్యాండిడేట్ కి వైసీపీ టికెట్ ఇచ్చినా  కూడా గెలుపు అవకాశాలు ఎంతమేరకు ఉంటాయి అన్నది కూడా ఆలోచించుకోవాలి అని అంటున్నారు.

ఇలాంటి దుస్సాహసాల వల్ల అసలుకే ఎసరు వస్తుంది అని అంటున్నారు. నిజానికి ఇలాంటివి చేయాలీ అంటే పోటీగా అవతల ఉండే పార్టీలను కూడా లెక్క వేసుకోవాలి అని అంటున్నారు. నిన్నటిదాకా ఏపీలో పొలిటికల్ సీన్ వేరు. వైసీపీ తప్పితే టీడీపీ. ఆ రెండు పార్టీలకు ఆల్ రేడీ నాయకులు ప్రతీ చోటా ఉంటారు కాబట్టి కొత్త వారు చేరితే గొడవలూ గ్రూపులూ ఉంటాయి. అది నష్టం చేకూరుతుంది కాబట్టి వారు కూడా చేర్చుకోవడానికి ఆలోచిస్తారు. అయితే జనసేన ఖాళీగా ఉంది. ఆ విషయం గమనంలోకి తీసుకోకుండా వైసీపీ సర్వేల పేరిట నేల విడిచి సాము చేస్తే మాత్రం ఎంచక్కా ఆ అవకాశాన్ని ఆ పార్టీ ఉపయోగించుకుంటుంది. వైసీపీ బలం సగానికి తగ్గుతుంది. టీడీపీ బలం పూర్తిగా ఉండే ఎన్నికల రాజకీయాలలో  దెబ్బ పడిపోవడం అన్నది వైసీపీకే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.