థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న వేళ.. ఈ విషయం తెలుసుకోవటం మంచిదే

Tue Jul 20 2021 17:00:45 GMT+0530 (IST)

If the third wave is sinking it is good to know this thing

కరోనా పాజిటివ్ అన్న వెంటనే కాళ్ల కింద నేల కదలాడినట్లుగా ఫీల్ కావటం.. నాకూ వచ్చిందా? అన్న బాధతో పాటు.. ఈ గండం నుంచి ఎలా బయటపడాలన్న ఆలోచనలు ముసిరేస్తాయి. కాస్తంత కోలుకున్న తర్వాత.. మెడిసిన్స్ వాడే వేళ.. డాక్టర్లు ఒకలా.. తెలిసిన బంధువులు.. స్నేహితులు మరోలా ఇచ్చే సలహాలు తెచ్చే కన్ప్యూజన్ అంతా ఇంతా కాదు. ఆ మాటకు వస్తే.. కరోనా పాజిటివ్ తర్వాత.. ఏ మందులు వాడలనే దానికి ఒక్కో డాక్టర్ ఇచ్చే మందులు ఒకలా ఉండటం ఈ మధ్యన ఎక్కువైంది.అదే సమయంలో వినిపించే వాదనలు సైతం ఏం చేయాలో తోచనివ్వకుండా చేస్తాయి. కరోనా పాజిటివ్ గా తేలిన వారు మొదట వాడే మందు ఏదైనా ఉందంటే.. అది అజిత్రోమైసిన్. అయితే.. దీని కంటే ప్లాసిబో మంచిదన్న మాట కొందరు చెబుతుంటారు. ఇలాంటి వేళ.. ఏ మందు వాడితే ఏం జరుగుతుందన్న విషయంపై శాస్త్రీయంగా ఒక పరిశోధన నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాల్ని తాజాగా అమెరికన్ మెడికల్ అసోసియేషన్ పత్రిక వెల్లడించింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకునే ఎంతో మంది పాజిటివ్ గా తేలిన వారు అజిత్రోమైసిన్ వాడినప్పటికీ.. దాని కంటే ప్లాసిబో మెరుగైన పనితీరును ప్రదర్శిస్తుందన్న విషయం తాజా అధ్యయనంలో తేలింది.

కాలిఫోర్నియా.. స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయ స్కాలర్స్ చేసిన పరిశోధనలో భాగంగా హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న 263 మంది బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మదింపు చేశారు. వీరిలో 171మందికి 1.2 గ్రాముల అజిత్రో మైసిన్ సింగిల్ డోసు.. 92 మందికి ప్లాసిబో మాత్రలు ఇచ్చారు. పద్నాలుగు రోజుల తర్వాత వీరిలో సగం మందికి నెగిటివ్  రిజల్ట్ వచ్చింది. కరోనా లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే.. అజిత్రోమైసిన్ తీసుకున్న వారిలో ఐదు శాతం మంది 21వ రోజు నాటికి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ప్లాసిబో మాత్రలు వేసుకున్న వారిలో ఒక్కరు సైతం ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం రాలేదని వెల్లడించారు.

ప్లాసిబోతో పోలిస్తే అజిత్రోమైసిన్ సింగ్ డోసు వల్ల బాధితులకు ఎలాంటి ప్రయోజనం లేదని.. ఉపశమనం కూడా ఉండదన్న విషయాన్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో.. రోగి అవసరానికి అనుగుణంగా ఆసుపత్రుల్లో అజిత్రోమైసిన్ ఇవ్వటాన్ని ఈ అధ్యయనం తప్పు పట్టలేదు. కానీ.. హోంఐసోలేషన్ లో ఉన్న వారు అజిత్రోమైసిన్ ను వాడటాన్ని మాత్రం అధ్యయనం సమర్థించటం లేదు.

 ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు కొవిడ్ చికిత్సలో బాగంగా అజిత్రోమైసిన్ వాడొచ్చని చెబుతున్న వేళ.. అందుకు భిన్నంగా వెలువడిన ఈ అధ్యయనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మూడో వేవ్ ముంచుకొస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నవేళ.. ఇలాంటి అధ్యయనాలు అవగాహన పెంచటానికి సాయం చేస్తాయి. నివేదికలో వెలువడిన అంశాల్ని చూస్తే..   అజిత్రో మైసిన్ కంటే ప్లాసిబో చాలా మెరుగైన ఔషధమని తేలటంతోపాటు..  అజిత్రోమైసిన్ వాడే కోవిడ్ బాధితులు.. కొన్ని సందర్భాల్లో ఆసుపత్రులకు వెళ్లే అవసరం ఏర్పడొచ్చన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.