Begin typing your search above and press return to search.

అదే జ‌రిగితే.. మోడీదే బాధ్య‌తః లాన్సెట్‌

By:  Tupaki Desk   |   8 May 2021 11:30 AM GMT
అదే జ‌రిగితే.. మోడీదే బాధ్య‌తః లాన్సెట్‌
X
క‌రోనా వైర‌స్ దేశం భీక‌ర దాడి చేయ‌డానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని ప్ర‌ముఖ లాన్సెట్ జ‌ర్న‌ల్ తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. మెడిక‌ల్ రంగంలో ప్ర‌పంచంలో జ‌రిగే ఆవిష్క‌ర‌ణ‌లు, స‌మ‌స్య‌లు, ప‌రిష్కారాల‌పై స‌మీక్షిస్తుంటుంది లాన్సెట్‌. లేటెస్ట్ ఎడిష‌న్లో ఇండియాలోని క‌రోనా వైర‌స్ పై సుదీర్ఘ‌మైన‌, ప‌దునైన విశ్లేష‌ణ చేసింది.

న‌రేంద్ర‌మోడీ నిర్ల‌క్ష్యం వ‌ల్లనే.. దేశంలో కొవిడ్ దేశ‌వ్యాప్త‌మైంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లువురు నిపుణులు ఈ విష‌య‌మై మాట్లాడారు. సెకండ్ వేవ్ గురించి హెచ్చ‌రించినా కూడా.. కేవ‌లం ఎన్నిక‌లపైనే దృష్టి పెట్టార‌ని విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా.. లాన్సెట్ జ‌ర్న‌ల్ మ‌రింత ఘాటుగా వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం.

క‌రోనా నియంత్ర‌ణ కోసం గ‌తేడాది నియ‌మించిన టాస్క్ ఫోర్స్ తో.. ఈ ఏడాది ఏప్రిల్ వ‌ర‌కు ఒక్క‌సారి కూడా స‌మావేశం ఏర్పాటు చేయ‌లేద‌ని చెప్పింది. సెకండ్ వేవ్‌ భార‌త్ క‌న్నా ముందే కొన్ని దేశాల్లో తీవ్ర ప్ర‌భావం చూపిన‌ప్ప‌టికీ.. ప్ర‌ధాని మోడీ తీవ్ర నిర్ల‌క్ష్యం వ‌హించార‌ని ధ్వ‌జ‌మెత్తిన‌ట్టు తెలుస్తోంది.

ఈ ఏడాది ఆగ‌స్టు నాటికి భార‌త్ లో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 10 ల‌క్ష‌ల‌కు చేరుకుంటాయ‌న్న‌ ఇనిస్టిట్యూట్ ఫ‌ర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవ‌ల్యూయేష‌న్ అంచ‌నాల‌ను ప్ర‌స్తావించిన జ‌ర్న‌ల్‌.. ఆ దారుణం గనక సంభ‌విస్తే.. అందుకు దేశ ప్ర‌ధానిగా మోడీనే బాధ్యుడు అవుతార‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించిన‌ట్టుగా తెలుస్తోంది.

కేవ‌లం ఎన్నిక‌ల కార‌ణంగానే.. భార‌త్ లో క‌రోనా ఈ స్థాయిలో విజృంభించింద‌ని చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది. ప్ర‌ధాని ప‌దుల సంఖ్య‌లో మీటింగుల‌కు హాజ‌రుకావ‌డం వ‌ల్ల‌.. విప‌క్షాలు కూడా అనివార్యంగా ఆయ‌న్ను అనుస‌రించాయ‌ని, దీంతో.. ఐదు రాష్ట్రాల్లో జ‌నం ల‌క్ష‌లాదిగా ఒక చోట గుమిగూడార‌ని విశ్లేషించింద‌ట‌. దీంతో.. వైర‌స్ అత్యంత వేగంగా విస్త‌రించింద‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. దేశం మొత్తం పాకిన మ‌హ‌మ్మారి.. వేలాది మంది ప్రాణాల‌ను బ‌లిగొంటోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం.