Begin typing your search above and press return to search.

మారిటోరియాన్ని రెండేళ్లకు పొడిగించుకుంటే పడే భారం ఎంతంటే?

By:  Tupaki Desk   |   28 Sep 2020 3:30 AM GMT
మారిటోరియాన్ని రెండేళ్లకు పొడిగించుకుంటే పడే భారం ఎంతంటే?
X
మహమ్మారి కారణంగా వ్యాపారాలు.. ఉద్యోగాలు తీవ్రమైన ప్రభావానికి లోను కావటం తెలిసిందే. అప్పటివరకూ వస్తున్న ఆదాయాలు ఒక్కసారిగా పోవటంతో కోట్లాది మంది కిందామీదా పడుతున్నారు. పక్కాగా ప్లాన్ చేసుకున్నామని చెప్పే అందరి లెక్కల్ని కరోనా మార్చేసింది. ఊహకు అందని రీతిలో చోటు చేసుకున్న ఈ సంక్షోభాన్ని.. దాని తీవ్రతను అర్థం చేసుకోవటానికి చాలామంది రెండు మూడు నెలలు పట్టింది. దీంతో.. హడావుడిగా నిర్ణయం తీసుకుంటే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గుర్తించిన పలువురు ఇప్పుడు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

అన్నింటికి మించి కరోనా అన్నది రెండు..మూడు నెలల సంక్షోభం ఎంత మాత్రం కాదని.. ఒకట్రెండేళ్లు సాగేదన్న వాస్తవాన్ని ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటున్నారు. మార్చి నుంచి ఆగస్టు వరకు బ్యాంకులకు చెల్లించాల్సిన ఈఎంఐల విషయంలో ఆర్ బీఐ మారిటోరియం విధించటం తెలిసిందే. ఇప్పటికి మారిటోరియం లేనప్పటికి.. ఉన్న అప్పుల్ని రెండేళ్ల వరకు తిరిగి చెల్లించకుండా ఉండేందుకు వీలుగా రెండేళ్ల పాటు మారిటోరియంను పొడిగించేందుకు వీలుగా కొన్ని సంస్థలు కసరత్తులు చేస్తున్నాయి.

ఇందులో భాగంగా రుణాల్ని పునర్ వ్యవస్థీకరించే సౌలభ్యాన్ని బ్యాంకులకు ఆర్ బీఐ కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో ఏ నెలకు ఆ నెల తిరిగి చెల్లించాల్సిన ఈఎంఐను రెండేళ్ల పాటు మారిటోరియంను తీసుకుంటే ఏం జరుగుతుంది. ఎంత భారం పడుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి కొందరు ఆర్థిక నిపుణులు లెక్కలు వేస్తున్నారు. వారి మాటల ప్రకారం చూసినప్పుడు.. రెండేళ్లు ఈఎంఐ చికాకుల్ని తప్పించుకుంటే పడే భారం ఎంతన్నది చూస్తే..

నిబంధనలకు అనుగుణంగా ఈఎంఐల్ని రెండేళ్ల పాటు చెల్లించకుండా వాయిదా వేసుకునేందుకు వీలుగా మారిటోరియం సదుపాయాన్ని స్వీకరిస్తే భారం కాస్త ఎక్కువన్న మాట వినిపిస్తోంది. పునర్ వ్యవస్థీకరణ చేసిన అప్పులతో బ్యాంకు మూల ధన వ్యయం పెరుగుతోంది. అందుకు అధిక వడ్డీని వసూలు చేస్తుంది. ఉదాహరణకు ప్రస్తుతం 8 శాతం వడ్డీ వసూలు చేస్తే.. అది కాస్తా మారిటోరియం తీసుకునే వారికి 8.35 శాతంగా ఉంటుందని చెబుతున్నారు.

ఈ లెక్కల ప్రస్తుతం చెల్లించాల్సిన అసలు రూ.20లక్షలు అనుకుంటే.. రెండేళ్ల తర్వాత ఎలాంటి చెల్లింపులు జరపకుండా ఉండి ఉంటే.. ఆ మొత్తం రూ.23,62,142 అవుతుందని చెబుతున్నారు. అంటే.. 20 లక్షలకు రెండేళ్లకు చెల్లించాల్సిన అసలు మొత్తమే 3,62,142 పెరుగుతుందన్న మాట. ఇక.. కట్టాల్సిన 240 వాయిదాల్ని అలానే ఉంచేస్తే.. చెల్లించే ఈఎంఐ ఎంత పెరుగుతుందన్న దానిపైనా క్లారిటీ వచ్చేసింది. 20లక్షల అప్పు మీద ప్రస్తుతం చెల్లించాల్సిన రూ.16729 ఈఎంఐకి బదులుగా రెండేళ్ల తర్వాత నుంచి చెల్లించే ఒప్పందంలో ఆ ఈఎంఐ కాస్తా రూ.20,276 అవుతుంది.

అంటే.. దగ్గర దగ్గర మూడున్నర వేల భారం అదనంగా పడుతుందన్న మాట. సో.. ఎంతో అవసరమైతే తప్పించి రెండేళ్ల మారిటోరియంకు వెళ్లకుండా ఉండటమే మంచిదన్న మాట పలువురు చెబుతున్నారు. ఆదాయ మార్గాలు పూర్తిగా మూసుకుపోతే.. మాత్రం ఈ భారానికి సిద్ధం కావటమే మంచిదని చెప్పక తప్పదు.