Begin typing your search above and press return to search.

ఇవాల్టి భూమిపూజకు 28 ఏళ్ల క్రితం ఆ రోజున ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   5 Aug 2020 9:10 AM GMT
ఇవాల్టి భూమిపూజకు 28 ఏళ్ల క్రితం ఆ రోజున ఏం జరిగింది?
X
గతాన్ని మర్చిపోవాలంటారు చాలామంది. గతంలోనే ఉంటే భవిష్యత్తులోకి వెళ్లటం సాధ్యం కాదన్న వాదనను మరికొందరు వినిపిస్తారు. కానీ.. గతమే భవిష్యత్తుకు పునాది అవుతుందన్న వాస్తవాన్ని మర్చిపోకూడదు. ఆ విషయం మిగిలిన విషయాలకు సరిపోతుందో లేదో కానీ.. తాజాగా అయోధ్యలోని రామమందిర నిర్మాణం విషయంలో మాత్రం నూటికి నూరుపాళ్లు నిజమైందని చెప్పాలి.

28 ఏళ్ల క్రితం.. 1992 డిసెంబరు ఆరున ఏం జరిగింది? అన్నది చరిత్రలో నిక్షిప్తమైంది. ఒక ప్రముఖ జర్నలిస్టు ఒకరు.. తాను ప్రత్యక్షంగా ఆరోజున జరిగిన విశేషాల్ని ఒక మీడియా సంస్థలో అక్షర రూపం ఇచ్చారు. తన కళ్లతో తాను చూసిన విషయాన్ని ఆయనేం చెప్పారన్నది చూస్తే.. అయోధ్యలో 1992 డిసెంబర్ 6న ఉదయం 8 గంటల నుంచే బాబ్రీ మసీదు గేట్లకు ముందు స్థలం లో హోమానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆర్‌ఎస్ఎస్ హేమాహేమీలంతా అక్కడే ఉన్నారు. ‘మేము కట్టబోయే మందిరానికి శిలాన్యాస్ (భూమిపూజ) జరుగుతుంది. శిలపై దోసిళ్లతో నీరు పోసేందుకు ఒక్కో ప్రాంతానికి చెందిన కార్యకర్తలను వరుసగా ఆహ్వానిస్తాం’ అని ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖుడు చెప్పారు.

ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఫైజాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ ఆర్‌.ఎస్. శ్రీవాత్సవ వచ్చారు. ఆక్కడే ఉన్న పోలీసు సీనియర్ సూపరింటెండెంట్ డీబీ రాయ్‌తో మాట్లాడి వెళ్లిపోయారు. ఈ శ్రీవాత్సవే తర్వాతి కాలంలో బిజెపి ఎంపి అయ్యారు. మసీదు దరిదాపుల్లో పారా మిలటరీ బలగాలేవీ కనిపించలేదు. ఆ తర్వాత లాల్ కృష్ణ ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, ప్రమోద్ మహాజన్, కేదార్ నాథ్ సహానీ, విజయరాజే సింధియా మొదలైన అగ్రనేతలంతా వరుసగా శిలాన్యాస్ కార్యక్రమానికి వచ్చారు. ఆ తర్వాత వారు కొద్ది దూరంలో నిర్మించిన వేదికపైకి వెళ్లారు.

అప్పటివరకూ ఇదంతా ఒక సాధారణ కార్యక్రమంలా అనిపించింది కాని ఒక చరిత్ర విధ్వంసమై, మరో చరిత్ర నిర్మాణం అయ్యే కార్యక్రమం ప్రారంభమవుతుందని అనిపించలేదు. సరిగ్గా పదిన్నర గంటల సమయంలో అసలు కార్యక్రమం ప్రారంభమైంది. వేలాది కరసేవకులు దూసుకువెళ్లడంతో బాబ్రీ మసీదు గుమ్మటాలు ఒక దాని తర్వాత మరొకటి కూలిపోతున్న దృశ్యాలు కనిపించాయి.

మరో 28 సంవత్సరాల తర్వాత ఇదే ప్రాంతంలో ఒక మందిరాన్ని నిర్మిస్తారనే ఆలోచన అప్పట్లో ఏ మాత్రం కలుగలేదు. ఆ శిథిలాల నుంచి పెద్ద ఎత్తున రేగిన దుమ్ము వినీలాకాశం నిండా దట్టమైనప్పుడు ఆ కట్టడాన్ని కూలద్రోసేందుకు ప్రేరేపించిన శక్తులే తర్వాతి కాలంలో కేంద్రంలో అధికారంలోకి వస్తాయని.. వాటి సారథ్యంలోనే మందిర నిర్మాణం ప్రారంభమవుతుందన్న తలంపు తట్టలేదు. ఒక విధ్వంసం లోంచే నిర్మాణం వస్తుందన్న విషయం అయోధ్య విషయంలో నూటికి నూరు శాతం రుజువైంది.

సదరు పాత్రికేయుడి అనుభవం అలా సాగింది. కాసింత వామపక్ష భావజాలం ఉన్న జర్నలిస్టు కావటంతో ఆయన అక్షరాలు కాస్తంత ఆవేదనతో ఉంటాయి. కాకుంటే.. చరిత్రను తన కళ్లతో తాను చూసినప్పుడు.. ఆయన మాటల్ని.. అనుభవాల్ని చదవటం ఆసక్తికరమే అవుతుంది. అయితే.. ఇక్కడో విషయాన్ని మాత్రం చెప్పగలం. నిజానికి ఆ రోజు జరిగిన విధ్వంసం ఏదీ కూడా కావాలనో.. పక్కాగా ప్లాన్ చేసిందో కాదు. ఈ విషయాన్ని అయోధ్య లో ఆ రోజు పాల్గొన్న పాత్రికేయులు కానీ ఫోటో గ్రాఫర్లు కానీ తమ వ్యక్తిగత సంభాషణల్లో చెప్పటం కనిపిస్తుంది. ఏమైనా.. గతమే భవిష్యత్తుకు మార్గమవుతుందన్నది అయోధ్య విషయంలో అక్షర సత్యమని చెప్పక తప్పదు.