కరోనా వ్యాక్సిన్ తయారీలో ప్రభుత్వం నుంచి ఏం కావాలని కేటీఆర్ అడిగితే?

Wed Aug 05 2020 14:20:36 GMT+0530 (IST)

If KTR asks what the government wants in the Develop of corona vaccine?

ప్రపంచం మొత్తానికి ఇప్పుడు కరోనా తప్పించి మరింకేమీ వద్దు. గడిచిన వందేళ్లు.. అంతకుంటే ఎక్కువ వెనక్కి వెళ్లినా.. యావత్ ప్రపంచం ఒకేసారి ఇంతలా ఇబ్బంది పడిన మొదటి సందర్భంగా ఇప్పుడున్న పరిస్థితిని చెబుతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం వ్యాక్సిన్ తయారీ ఒక్కటే. మరి.. అదే అంశంపై పని చేస్తున్న ప్రముఖుల్ని ఒక వేదిక మీదకు తీసుకొచ్చి.. మాకున్న సందేహాలు తీర్చండని ప్రజల తరఫున ప్రభుత్వం అడిగితే.. సర్కారు నుంచి మీకెలాంటి సహకారం కావాలి? ప్రభుత్వ పక్షాన మీకే మేమేం చేయాలని అడిగితే వారేం చెబుతారు? అన్నది ఆసక్తికరం.తాజాగా అలాంటి సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. కరోనాపై వ్యాక్సిన్ తయారు చేస్తున్నసంస్థల కీలక ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ వెబినార్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. వారిని ఉద్దేశించి.. తెలంగాణ ప్రభుత్వం నుంచి మీరేం కోరుకుంటున్నారు? అని ప్రశ్నించగా ఊహించని సమాధానాలు వారి నుంచి రావటం గమనార్హం.

బయలాజికల్ -ఈ ఎండీ మహిమ దాట్ల స్పందిస్తూ.. వ్యాక్సిన్ డెవలప్ మెంట్ ఒక్కటే సరిపోదు..అందరికి అందించటానికి అవసరమైన సదుపాయాలు ఉండాలి. వ్యాక్సిన్ నింపటానికి సీసాలు అవసరం. వాటిని తయారు చేసే పరిశ్రమలు కూడా ఇప్పుడు అవసరమే. వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ నిపుణులైన సిబ్బంది అవసరమవుతారని చెప్పారు. ఇదే ప్రశ్నకు భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా స్పందిస్తూ.. ఈ వ్యాక్సిన్ ను తక్కువ ధరకు అందించాలంటే అందరిని ఏకతాటి మీదకు తీసుకురావాల్సి ఉంటుందంటూ కీలక వ్యాఖ్య చేశారు. అంతేకాదు.. ఇప్పటివరకూ మరెవరూ ప్రస్తావించని రీతిలో.. ‘ఢిల్లీలో ఈ విషయంలో నాయకత్వ కొరత ఉంది’’ అన్న మాటను సంశయంగా ఆయన నోటి నుంచి రావటం గమనార్హం.

వ్యాక్సిన్ ఉత్పత్తి మీద మొత్తం నియంత్రణ కేంద్ర ప్రభుత్వానిదేనని.. ప్రతి చిన్న అనుమతికి ఢిల్లీకి వెళ్లాల్సి వస్తోందని.. అలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర రంగ సంస్థల కార్యాలయాల్ని హైదరాబాద్ లోనే ఏర్పాటు చేయాలని కోరారు. ఎందుకంటే.. వ్యాక్సిన్ ఉత్పత్తి అత్యధిక భాగంగా హైదరాబాద్ నుంచే వచ్చే వీలుందని.. అందుకే హైదరాబాద్ లో కేంద్ర రంగ సంస్థల ఆఫీసులతో పాటు.. ఒక టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఔషధ పరీక్షల కోసం హిమాచల్ ప్రదేశ్ లోని కసౌలిలో ఉన్న సెంట్రల్ డ్రగ్స్ లేబొరేటరీకి వెళ్లాల్సి వస్తోందన్న ప్రాక్టికల్ ప్రాబ్లం ప్రస్తావించారు. మరి.. సమస్యను అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. దాని అమలు విషయంలో ఎలా రియాక్టు అవుతారో చూడాలి.