Begin typing your search above and press return to search.

పచ్చ లైట్ వెలిగితే జాబ్ ఉన్నట్టు.. లేకపోతే లేనట్టు

By:  Tupaki Desk   |   30 Jan 2023 1:00 PM GMT
పచ్చ లైట్ వెలిగితే జాబ్ ఉన్నట్టు.. లేకపోతే లేనట్టు
X
లక్ష్లల్లో జీతం.. వీలైతే ఫ్లాట్, కారు.. ఇలాంటి అధునాతన సౌకర్యాలు ఐటీ జాబ్స్ చేసేవారికే సొంతం. దీంతో ఈ రంగంలో ఉద్యోగం సంపాదించడానికి కొందరు ప్రత్యేక కోర్సులు చేసేవారు. ఒక్కసారి కంపెనీలోకి ఎంట్రీ ఇస్తే చాలు.. ఆ తరువాత టాలెంట్ ను భట్టి అదే కంపెనీ సీఈవో అయ్యే ఛాన్సెస్. ఇప్పటికే చాలా మంది అలా నిరూపించారు కూడా. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. సాఫ్ట్ వేర్ జాబ్ చేసేవాళ్లు నిత్యం భయంతో వణుకుతున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నిత్యశ్రామికుడిలా మారుతున్నారు. ఎప్పుడు తమ జాబ్ ఊడుతుందోనని టెన్షన్ పడుతున్నారు. కొన్ని కంపెనీలైతే ఉదయం ఉద్యోగం చేసిన వారికి సాయంత్రం వరకు 'నీ జాబ్ ఊడింది'.. అనే మెసేజ్ వచ్చినా ఆశర్యపోనక్కర్లేని పరిస్థితి. మరికొన్ని కంపెనీల్లో ఉదయం ఆఫీసుకు వెళ్లిన వారికి తమ ఐడీ కార్డు పెడితే 'పచ్చ లైట్ వెలిగితే జాబ్ ఉన్నట్టు.. లేకపోతే లేనట్టు' అన్న విధంగా మారింది.

మానవ ప్రపంచంలోకి కరోనా ఎంట్రీతో వ్యవస్థలన్నీ మారిపోయాయి. స్ట్రీట్ వెండర్ నుంచి కంపెనీ సీఈవో వరకు అందరి జీవితాలు మారిపోయాయి. ఒకప్పుడు చేతలు నిండా ఆదాయంతో ఉన్నవారి జేబులు ఖాళీ అయ్యాయి. అయితే ఇదే సమయంలో వైద్యం, ఐటీ రంగంలో కొన్ని కొత్త ప్రాజెక్టులు స్ట్రాట్ అయ్యాయి. అప్పడున్న అవసరాల రీత్యా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఉద్యోగుల అవసరం ఏర్పడింది. దీంతో చాలా కంపెనీలు స్థాయికి మించి సిబ్బందిని నియమించుకుంది. టాలెంట్ తో సంబంధం లేకుండా.. కాస్త అటూ ఇటూ ఉన్నా అవకాశం ఇచ్చింది.

ఇప్పుడు ఆ ప్రాజెక్టుల పూర్తయ్యాయి. కొత్త ప్రాజెక్టులు మళ్లీ రావడం లేదు. ముఖ్యంగా వైద్య రంగంలోనూ అవసరాలు తీరిపోయినందున సిబ్బందికి అనవసరంగా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అందువల్ల సందర్భాన్ని భట్టి ఉద్యోగులను తీసేస్తున్నాయి.

మరోవైపు ప్రపంచంలో ఏర్పడిన ఆర్థిక మాంద్య పరిస్థితులతో నూతన ప్రాజెక్టులు రావడం లేదు. ముఖ్యంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, అమెరికాల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆయా దేశాల్లోనే లక్షల ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఈ దేశాల మీద ఆధారపడిన ఇతర దేశాల కంపెనీలు సైతం తమ ఉద్యోగులను వదులుకుంటున్నాయి. 2022 నవంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగాలు ఊడినట్లు అధ్యయనాల ద్వారా వెల్లడైంది.

ఆ దేశాలపై ఆదారపడ్డ భారత్ కు చెందిన ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఊడడం గమనార్హం. ఇంక్ 42. కామ్ నివేదిక ప్రకారం మనదేశంలో 18 వేల మందిని కంపెనీలు తొలగించాయి. బైజూస్, ఓలా, బ్లింకిట్, ఆన్ అకాడమీ, వేదాంతు, వైట్ హ్యాట్ జూనియర్ సిబ్బందిని తీసేసిన జాబితాలో ఉన్నాయి. ఒక్క బైజూస్ లోనే 2500 మందిని తొలగించడం చూస్తే పరిస్తితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటికే భారత్ లో 50,000 ఉద్యోగాలు పోయాయని తెలుస్తోంది. అయితే ప్రక్రియ అంతటితో ఆగిపోలేదు. కంపెనీలు సందర్భాన్ని భట్టి ఇప్పటికీ సిబ్బందిని తొలగిస్తున్నాయి. బెంగుళూరుకు చెందని ఓ సర్వే కంపెనీ నివేదిక ప్రకారం మరికొద్ది రోజుల్లో పలు కంపెనీల నుంచి లక్ష ఉద్యోగాలు ఊడుతాయని తెలిపింది. కొన్ని కంపెనీల్లో ఉదయం పనిచేసిన వారికి సాయంత్రం ఇంటికి వెళ్లాక 'మీ జాబ్ పోయింది.. మీకు రావాల్సిన సొమ్ము మీ ఖాతాలోజమ అవుతుంది..' అని మెసేజ్ వస్తుంది. మరికొందరికి ఉదయం ఆఫీసుకు ఎంట్రీ కావడానికి ఐటీ కార్డు చూపిస్తే పచ్చ లైట్ వెలిగితే తమ జాబ్ ఉన్నట్లు.. ఎర్ర లైట్ వెలిగితే ఇక ఇంటికి వెళ్లాలి అనే విధంగా తయారైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.