Begin typing your search above and press return to search.

కేంద్రంలో కేసీఆర్ అధికారంలోకి వస్తే ఐటీ దాడులు ఉండవు: మల్లారెడ్డి!

By:  Tupaki Desk   |   28 Nov 2022 11:30 AM GMT
కేంద్రంలో కేసీఆర్ అధికారంలోకి వస్తే ఐటీ దాడులు ఉండవు: మల్లారెడ్డి!
X
తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కేసీఆర్ అధికారంలోకి వస్తే ఐటీ దాడులు ఉండవు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కేసీఆర్ అధికారంలోకి వస్తే ఐటీ దాడులు చేయించమని.. ప్రతీ ఒక్కరూ వాలంటరీగా ట్యాక్స్ లు చెల్లించేలా కొత్త చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. అందరికీ పన్ను మినహాయింపు ఇస్తామని.. ఎవరికి వారు స్వయంగా ముందుకొచ్చి పన్ను కట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసీఆర్ తన వెంట ఉన్నంతవరకూ ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి దాడులకు తాను భయపడనని మల్లారెడ్డి స్పష్టం చేశారు.

ఇక కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ఇన్ కం ట్యాక్స్ రియలైజ్ చేస్తామని.. ఎవరు ఎంతైనా సంపాదించుకోవచ్చని తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని బహిలాంపూర్ లో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై ప్రశంసల జల్లులు కురిపించారు. అంబేద్కర్ తర్వాత పేద ప్రజలకు మంచి చేసిన వ్యక్తి కేసీఆర్ అని ప్రశంసించారు. కేసీఆర్ గొప్ప మహాత్ముడు అంటూ చెప్పుకొచ్చారు.

2024 ఎన్నికల్లో కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని మల్లారెడ్డి జోస్యం చెప్పారు. ఐటీ దాడులు తనకేమీ కొత్త కాదని.. దాడులకు భయపడేది లేదని తెలిపారు. కేసీఆర్ తన వెంటే ఉన్నారని.. ఆయన తన వెంట ఉన్నంతకాలం తనను ఎవరూ ఏమీ చేయలేరన్నారు.

ఇటీవల మల్లారెడ్డి పై రెండు రోజుల పాటు ఐటీ మెరుపు దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో కోట్ల నగదుతోపాటు పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఐటీ దాడులు ఉండవంటూ మల్లారెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించాయి. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్ధేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తాలు వసూలు చేసినట్టు గుర్తించారు.

అదనంగా వసూలు చేసిన మొత్తాలను నగదు రూపంలో తీసుకున్నట్టు ఆధారాలు సేకరించినట్టు ఐటీ వర్గాలు తెలిపాయి. అనధికారికంగా లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాలను స్థిరాస్థి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు మల్లారెడ్డి-నారాయణ ఆస్పత్రి కోసం వెచ్చించినట్టు పేర్కొన్నారు. ఇక ఇప్పటివరకూ చేసిన సోదాల్లో రూ.6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.