Begin typing your search above and press return to search.

పంజాబ్, యూపీ ఎన్నికల పై ఐఎస్ఐ గురి పెట్టిందా ?

By:  Tupaki Desk   |   17 Jan 2022 4:38 AM GMT
పంజాబ్, యూపీ ఎన్నికల పై ఐఎస్ఐ గురి పెట్టిందా ?
X
తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఐఎస్ఐ గురి పెట్టిందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలపైనే తీవ్రవాదులు కన్నేసినట్లు స్పష్టమైన సమాచారం ఉన్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ పై రెండు రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. వీటితో పాటు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో దాడులు జరిగే అవకాశముందని వార్నింగులిచ్చింది. పంజాబ్ సరిహద్దుల ద్వారా దేశంలోకి ఆయుధాలను తీసుకొచ్చేందుకు తీవ్రవాదులు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి.

ఇప్పటివరకు పంజాబ్-పాకిస్తాన్ సరిహద్దుల్లో సుమారు 70 డ్రోన్లను మనసైన్యం గుర్తించింది. వాటిల్లో చాలా వాటిని సైన్యం గాలిలోనే పేల్చేసింది. కొన్నింటిని పట్టుకోగా మరికొన్ని తప్పించుకున్నాయి. ద్రోన్ల ద్వారా పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవాదులు పంజాబ్ లోకి ఆయుధాలను, డ్రగ్స్ ను పంపుతున్నట్లు తేలింది. పంజాబ్ లోని ఖలిస్ధాన్ ప్రేరేపిత తీవ్రవాదులను ఐఎస్ఐ బాగా రెచ్చగొడుతోంది. పంజాబ్ లో ఖలిస్ధాన్ అనుకూల ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తామనే హామీతో ఐఎస్ఐ వెనకనుండి కుట్రలు చేస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.

ఆయుధాలను ఉపయోగించటమే కాకుండా చిన్న చిన్న యూనిట్లను టార్గెట్ గా కాల్పులు, పేలుళ్లు, అల్లరి మూకలతో దాడులు. ఒంటరిగా దొరికిన వారిని చంపేయటం లాంటి ప్లాన్లు వేస్తున్నట్లు నిఘావర్గాలు పసిగట్టాయి. ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రసంస్ధలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, ఇండియన్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు యూపీ, పంజాబ్ లోని టార్గెట్లను కూడా నిర్దేశించినట్లు సమాచారం. పై ఉగ్రవాద సంస్ధలకు లోకల్ గా ఉండే ఖలిస్థాన్ మద్దతుదారులను జతచేయటం ద్వారా అనుకున్నది సాధించాలని ఐఎస్ఐ ప్లాన్ చేస్తోంది.

డ్రోన్లు, రోడ్డుమార్గం ద్వారా ఆయుధాలను, పేలుడు పదార్ధాలను దేశంలోకి చేరవేసేందుకు అంతర్జాతీయ యువ సిక్కు యువ సమాఖ్య, బాబర్ ఖల్సా ఇంటర్నేషనల్ సంస్ధలకు ఐఎస్ఐ అవసరమైన నిధులను, సాంకేతిక పరిజ్ఞాన్ని, సామగ్రిని సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. ఖలిస్థాన్ కమేండో ఫోర్స్ చీఫ్ పరమజీత్ సింగ్, బీకేయూ ఉగ్రవాది వాద్వాసింగ్ బాబర్, ఖలిస్ధాన్ జిందాబాద్ ఫోర్స్ కు చెందిన రంజిత్ సింగ్ నీతా తో ఐఎస్ఐ రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ సమాచారాన్నే నిఘావర్గాలు పంజాబ్, యూపీ ప్రభుత్వాలకు అందించింది. మొత్తం మీద ఐదు రాష్ట్రాల ఎన్నికలు చాలా సున్నితంగా మారిపోతోందనే చెప్పాలి.