అట్టిపెట్టుకున్నారు సరే.. కొనిపెట్టుకునేదెవరిని? వేలంలో కనిపెట్టాల్సిందెవరిని?

Wed Dec 01 2021 21:00:01 GMT+0530 (IST)

IPL 2022 latest Updates

10 జట్లు.. స్వదేశంలో టోర్నీ.. ప్రేక్షకుల రాక.. జిగేల్ మనేలా ఏర్పాట్లు.. ఎన్నో మార్పులు.. మరెన్నో కూర్పులు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ ఎడిషన్ హంగామా ఇది. ఫ్రాంచైజీలన్నీ తమకు అత్యంత కీలకం అనుకున్న నలుగురు ఆటగాళ్లను అట్టి పెట్టుకుని (రిటైన్) మంగళవారం రాత్రి బీసీసీ ఐకి వివరాలు సమర్పించాయి. అయితే మిగతా జట్టుకోసం కొనుగోళ్ల (వేలం)కు వెళ్లనున్నాయి. దీనిప్రకారం చూస్తే.. ఏ జట్టు ఏం చేయనున్నాయో చూద్దామా?ఐపీఎల్ టైటిల్ ను అత్యధికంగా ఐదు సార్లు గెల్చుకున్న ముంబై ఇండియన్స్ జట్టు తమ కెప్టెన్ రోహిత్ శర్మను  రూ. 16 కోట్లతో రిటైన్ చేసుకుంది. రూ.12 కోట్లతో ఏస్ పేసర్ బుమ్రాను రూ. 8 కోట్లతో హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్‌ను రూ. 6 కోట్లతో ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్‌ను అట్టి పెట్టుకుంది. అయితే స్టార్ ఆటగాళ్లకు పెట్టింది పేరైన ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్లు అన్నదమ్ములు క్రునాల్ హార్దిక్ పాండ్యాలను రిటైన్ చేసుకోలేదు. వికెట్ కీపర్ బ్యాటర్లు డికాక్ ఇషాన్ కిషన్ లనూ తీసుకోలేదు. అంటే.. మిగతా జట్టు నిర్మాణానికి ముంబైకి పెద్ద పనే ఉంది. బౌల్ట్ సహా ఎందరిని వేలంలో కొనుక్కుంటుందో చూడాలి.

పెద్ద జట్టయినా.. ఒక్కసారీ టైటిల్ గెలవని జట్టు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ). విరాట్ కోహ్లి పగ్గాలు వదిలేయడం ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ తో ఆర్సీబీ కొత్త కెప్టెన్ తో పాటు భారీ హిట్టర్ నూ వెదికిపట్టుకోవాలి. అన్నట్టు కోహ్లీని ఆర్‌సీబీ రూ. 15 కోట్లతో రిటైన్ చేసుకుంది. మ్యాక్స్‌వెల్‌ను రూ. 11 కోట్లతో సిరాజ్‌కు రూ.7 కోట్లతో అట్టి పెట్టుకుంది. మరి వార్నర్ ను తీసుకుని కెప్టెన్సీ ఇస్తుందా? ఇంకో ఇండియన్ క్రికెటర్ ను పట్టుకొస్తుందా? చూడాలి.

ఇక పంజాబ్ సూపర్ కింగ్స్ ది మరో గాథ. కెప్టెన్ కేఎల్ రాహుల్ నూ రిటైన్ చేసుకోలేదు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను రూ.12 కోట్లతో అర్షదీప్ సింగ్‌ను 4 కోట్లకు తీసుకుంది. రాహుల్ తమ తో ఒప్పందాన్ని ఉల్లంఘించాడని చెబుతోంది. మరి కెప్టెన్ గా ఎవరిని తీసుకుంటుంది? ఏయే ఆటగాళ్లను కొనుక్కుంటుంది..? వారితోనైనా తమ పంజాబ్ మార్చే భాగ్యం ఉందో లేదో .. కప్ గెలుస్తుందో లేదో?

సన్ రైజర్స్ హైదరాబాద్ గతేడాది ఎడిషన్ లో కెప్టెన్ వార్నర్ ను అవమానకర రీతిలో బయటకు పంపింది. జట్టులో చోటే ఇవ్వలేదు. రిటైనూ చేసుకోలేదు. విలియమ్సన్ కు సారథ్యం అప్పగించే యోచనలో అతడిని రూ. 14 కోట్లకు అట్టిపెట్టుకుంది. కశ్మీరీ కుర్రాళ్లు అబ్దుల్ సమద్‌ను రూ.4 కోట్లు ఉమ్రాన్ మాలిక్‌ను రూ. 4 కోట్లతో  రిటైన్ చేసుకుంది. ప్రధాన పేసర్ భువనేశ్వర్ సహా బౌలింగ్ దళాన్ని ఎలా మెరుగు పర్చుకుంటుందో మరి? అసలు విషయం ఏమంటే మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ సన్ రైజర్స్ కు షాకివ్వడం. అతడు లఖ్ నవూ జట్టు యాజమాన్యంతో టచ్ లో ఉన్నాడని.. ఇది నిబంధనలకు విరుద్ధమని వాపోతోంది. రషీద్ లేని స్పిన్ రైజర్స్ లోటే.

ధోని కంటే జడేజాకు అధిక ధర

డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజాను రూ.16 కోట్లతో కెప్టెన్ ఎంఎస్ ధోనీని రూ.12 కోట్లతో ఆల్ రౌండర్

మొయిన్ అలీని రూ. 8 కోట్లతో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను రూ.6 కోట్లతో రిటైన్ చేసుకుంది. ధోని కంటే జడేజాకు అధిక ధర చెల్లించడం చూస్తుంటే భవిష్యత్ సీఎస్కే కెప్టెన్ జడేజానే అని తెలిసిపోతుంది. స్టార్ బ్యాటర్లు అంబటి రాయుడు సురేశ్ రైనా బౌలర్లు ఎవరినీ రిటైన్ చేసుకోలేదు. వీరి వ్యూహం.. ధోని ప్రణాళికలు ఎలా ఉన్నాయో?

ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌ను రూ.16 కోట్లతో స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను రూ.9 కోట్లతో యువ ఓపెనర్ పృథ్వీ షాను ఏడున్నర కోట్ల రూపాయలతో రిటైన్ చేసుకుంది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ మిడిలార్డర్ బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్ ను తీసుకోలేదు. వీరిలో అయ్యర్ ను ఇతర జట్లు కొనుక్కుంటాయనే వార్తలు వస్తున్నాయి. మరి దక్షిణాఫ్రికా స్పీడ్ గన్ నార్జ్ ను తీసుకున్న ఢిల్లీ.. అతడికి జోడీ అయిన రబడను వేలంలో కొనుక్కుంటుందా? లేదా? యువ పేసర్ అవేశ్ ఖాన్ ను ఏం చేస్తుంది?

కెప్టెన్ నే తీసుకోని కోల్ కతా

గత సీజన్ లో అనూహ్యంగా ఫైనల్ చేరింది కోల్ కతా. బ్యాట్స్ మన్ గా రాణించకున్నా.. కెప్టెన్ గా ఇయాన్ మోర్గాన్ జట్టును నడిపాడు. అయితే అతడిని కోల్ కతా రిటైన్ చేసుకోలేదు. విండీస్ ఆల్ రౌండర్ అండ్రీ రస్సెల్‌ను రూ.12 కోట్లతో కొత్త సంచలనం వెంకటేశ్ అయ్యర్‌ను రూ. 8 కోట్లతో వరుణ్ చక్రవర్తిని సునీల్ నరైన్‌ను రూ. 6 కోట్లతో కోల్‌కతా రిటైన్ చేసుకుంది. దినేశ్ కార్తీక్ వంటి కీపర్ ను యువ పేసర్లు శివం మావి కమ్లేశ్ నాగర్ కోటి లను ఏం చేస్తుందో చూడాలి?

తొలి సీజన్లో మినహా రాణించని జట్టు రాజస్థాన్ రాయల్స్. గత సీజన్లో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. కెప్టెన్ సంజు శాంసన్ ఏమంత ఆకట్టుకోలేదు. అయినా.. అతడిని రూ.14 కోట్లతో ఇంగ్లండ్ హిట్టర్ జోస్ బట్లర్‌ను రూ.10 కోట్లతో ముంబై యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను రూ.4 కోట్లతో అట్టిపెట్టుకుంది. ఈ జట్టుకు ఇంకా చాలామంది ఆటగాళ్ల అవసరం ఉంది. మరి వేలంలో ఎలా వెళ్తుందో?