Begin typing your search above and press return to search.

రోజురోజుకూ లెక్కలు మారుతున్నాయి.. ప్లేఆఫ్స్​ వెళ్లేదెవరో?

By:  Tupaki Desk   |   31 Oct 2020 12:10 PM GMT
రోజురోజుకూ  లెక్కలు మారుతున్నాయి.. ప్లేఆఫ్స్​ వెళ్లేదెవరో?
X
ఐపీఎల్ 2020 గతంలో ఎప్పుడూ లేనంతగా ఉత్కంఠభరితంగా సాగుతోంది. పాయింట్ల పట్టికలో స్థానాలు వేగంగా మారిపోతున్నాయి. చెన్నై ఇంటికి పోవడం ఖాయం కాగా.. మిగత జట్ల ఆశలన్నీ ఇంకా సజీవంగానే ఉన్నాయి. రోజు రోజుకూ లెక్కలు మారిపోతున్నాయి. ఇప్పటివరకు ఉన్న పాయింట్ల ప్రకారం ఒక్క ముంబై ఇండియన్స్ మాత్రమే ప్లే ఆఫ్స్​కు వేళ్లే చాన్స్​ కొట్టేసింది. మిగతా జట్లని ఇంకా ఊగిసలాడుతూనే ఉన్నాయి. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని ఢిల్లీ కేపిటల్స్, విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈజీగా ప్లేఆఫ్స్‌కు చేరుతాయని అంతా భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. ఇటీవల వరుస ఓటములతో ఈరెండు జట్లు కిందా మిందా పడుతున్నాయి. ప్లే ఆఫ్స్ పోరాడుతూనే ఉన్నాయి. .

ఆర్​సీబీకి ఆ రెండు మ్యాచ్​లే కీలకం

ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చాంపియన్​గా నిలవని బెంగళూరు జట్టు ఈ సారి మెరుగైన ఆటతీరు కనబరుస్తుతోంది. 14 పాయింట్లతో ఉన్న ఆ జట్టు ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించడం ఖాయమని అందరూ భావించారు. అయితే, వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో జట్టు ఇబ్బందుల్లో పడింది. ఆర్​సీబీకి ఇప్పుడు జరిగే రెండు మ్యాచ్​లు కీలకంగా మారాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీతో ఆర్​సీబీ తలపడనున్నది. ఈ రెండు మ్యాచ్​ల్లో ఒక్కటైనా తప్పకుండా గెలవాలి.

ఢిల్లీ కేపిటల్స్
ఆరంభంలో టాప్​లో ఉన్న ఢిల్లీ కేపిటల్స్ తర్వాత పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. తొలి నాలుగు జట్లలో ఉంటుందని ఆశించినా ప్లే ఆఫ్స్ ముంగిట వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం పాలై పీకల మీదికి తెచ్చుకుంది. దీనికి ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. శనివారం ముంబై ఇండియన్స్‌తో తలపడనుండగా, ఆ తర్వాత బెంగళూరుతో ఆడనుంది. ముంబై ఇండియన్స్‌తో ఓడిపోయి, హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బెంగళూరు ఓటమి పాలైతే, ఆ తర్వాత ఢిల్లీ-బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారుతుంది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్

ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్‌ పరిస్థితి కొంత భిన్నం. వరుస పరాజయాలతో అట్టడుగున ఉన్న ఆ జట్టు గేల్ బ్యాట్ పట్టిన తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో విజయం సాధించింది. 12 పాయింట్లతో ఉన్న పంజాబ్ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలోనూ గెలిస్తే ఆ జట్టు నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్..

ఇప్పటి వరకు ప్లేఆఫ్స్ రేసులో నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు గురువారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఓడి పీకల మీదికి తెచ్చుకుంది. ఆ జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉండగా, మిగిలింది ఒకే ఒక్క మ్యాచ్. ఆ మ్యాచ్‌ లో రాజస్థాన్ కనుక గెలిస్తే కోల్‌కతా పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. కోల్‌కతా తన తర్వాతి మ్యాచ్‌ను రాజస్థాన్‌తో ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో మోర్గాన్ సేన గెలిచినా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తారన్న నమ్మకం లేదు. అప్పుడు ఇతర జట్ల జయాపజయాలపై దాని అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ .. ప్లే ఆఫ్​కు వెళ్లడం కష్టమే!

సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి కూడా కోల్‌కతా, రాజస్థాన్ లాంటిదే. ఆ జట్టు భవిష్యత్తు ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్‌కు కలిసొచ్చే అంశం ఏదైనా ఉందంటే దాని నెట్ రన్‌రేట్ ఇతర జట్ల కంటే మెరుగ్గా ఉండడమే. హైదరాబాద్ తన తర్వాతి మ్యాచుల్లో బెంగళూరు, ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఆ రెండు మ్యాచుల్లోనూ విజయం సాధిస్తే రన్‌రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్‌కు చేరుకోవచ్చు.

రాజస్థాన్ రాయల్స్ కు ఇంకా ఛాన్స్

నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్​లో ఘనవిజయం సాధించిన రాజస్థాన్​ రాయల్స్​ ప్లేఆఫ్​ ఆశలను సజీవంగా ఉంచుకున్నది. ఆ తర్వాత కోల్‌కతాతో తలపడనుంది. కోల్​కతాతో కూడా గెలిస్తేనే ప్లే ఆఫ్ కు అవకాశం ఉంటుంది.