కరోనా నిర్దారణ పరీక్షకు రూ.400.. కొత్త కిట్ ను తయారు చేసిన మనోడు

Wed Aug 05 2020 13:40:16 GMT+0530 (IST)

IIT Kharagpur developed country first Covid 19 Test Kit

కాస్త గొంతులో నొప్పిగా ఉంది.. కరోనానేనా? కాస్త ఒళ్లు వెచ్చబడింది.. కొంపదీసి కోవిడ్ వచ్చేసిందా? ఇలా.. నిత్యం ఏదో ఒక అనుమానం వెంటాడుతున్న వేళ.. పరీక్షల కోసం తపిస్తున్న వారెందరో. అయితే.. కరోనా నిర్దారణ పరీక్షలతో వచ్చే చిక్కేమిటంటే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరీక్షలతో ఒక్కొక్క దానితో ఒక్కో సమస్య. ఉదాహరణకు ఆర్ టీ-పీసీఆర్. రివర్స్ ట్రాన్స్ క్రిష్షన్ - పాలిమరేజ్ చైన్ రియాక్షన్ విషయానికి వస్తే.. దీన్ని చేయించుకున్న తర్వాత ఫలితం కోసం వెయిట్ చేయాలి. పెద్ద ఎత్తున పరిశోధనా ల్యాబ్ అవసరం. ఖర్చు కూడా ఎక్కువే.అలా అక్కర్లేదు.. ఇరవై నిమిషాల్లో లెక్క తేల్చేసే ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష చేయించుకుందామంటే.. దీని ఫలితం పూర్తిస్థాయిలో నమ్మేది కాదు. ఈ పరీక్షలో నెగిటివ్ వచ్చి.. ఆర్ టీ పీసీఆర్ చేయించుకుంటే పాజిటివ్ వస్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ రెండు పరీక్షలకు అయ్యే ఖర్చు ఎక్కువే. ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షల్ని ప్రైవేటు రంగంలో చేయించుకోవాలంటే అవుతున్న ఖర్చు మోత మోగుతుంది.

ఇలాంటివేళ.. ఈ సమస్యల్ని పరిష్కరించేలా ఐఐటీ ఖరగ్ పూర్ కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ సుమన్ చక్రవర్తి టీం ఒక కిట్ ను తయారు చేసింది. దీని ద్వారా చేసుకునే కరోనా పరీక్షకు కేవలం రూ.400 మాత్రమే ఖర్చు అవుతుందని చెబుతున్నారు. తాము తయారు చేసిన కిట్.. ఆర్ టీ పీసీఆర్ పరీక్షతో సమానంగా ఉంటుందని చెబుతున్నారు. తాము ప్రత్యేకంగా తయారు చేసిన కాగితనపు క్యాట్రిజ్డ్ ను వాడటం వల్ల పరీక్ష ఫలితం సరిగ్గా గంటలో వచ్చేస్తుందని చెబుతున్నారు.

తాము రూపొందించిన కిట్ ను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు పలు ప్రైవేటు కంపెనీల్ని సంప్రదిస్తున్నామని.. త్వరలోనే వాటితో చర్చలు కొలిక్కి వచ్చి.. ఉత్పత్తి ప్రారంభిస్తామని చెబుతున్నారు. ఇలాంటి వాటి విషయంలో మోడీ ప్రభుత్వం మరింత చురుకైన పాత్ర పోషించి.. ప్రభుత్వం తరఫునే ఉత్పత్తిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవచ్చు కదా? అలా జరిగితే.. ప్రభుత్వం ఇప్పటికే కిట్ల కోసం ఖర్చు చాలావరకు తగ్గే వీలుంటుంది కదా? అలా ఎందుకు చేయరు?