Begin typing your search above and press return to search.

హరీశ్ రాజీనామా సవాల్.. బండి స్పందన ఏమిటో?

By:  Tupaki Desk   |   20 Oct 2020 6:00 AM GMT
హరీశ్ రాజీనామా సవాల్.. బండి స్పందన ఏమిటో?
X
కొన్నిసార్లు చెప్పనక్కర్లేదు. అన్ని అర్థమైపోతుంటాయి. తాజాగా దుబ్బాకలో జరుగుతున్న ఉప ఎన్నిక ప్రచారం చూస్తే.. కొత్త విషయాలు అర్థమవుతున్నాయి. ఎప్పుడూ లేని రీతిలో మంత్రి హరీశ్ ఇరిటేట్ కావటమే కాదు.. ఏకంగా మీ మాటలు నిజమని నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా.. అనే వరకు విషయం వెళ్లటం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బీజేపీ ప్రభావమే లేదన్నట్లుగా తేల్చేసే గులాబీ నేతల మాటలకు భిన్నంగా.. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యాల్ని ప్రస్తావిస్తూ.. హరీశ్ లాంటి అగ్ర నాయకుడు రాజీనామా వరకు వెళ్లటం దేనికి నిదర్శనం అన్నది ప్రశ్న.

ఒకరి నోటి నుంచి వచ్చిన మాటలకు ప్రాధాన్యత ఇస్తున్నామంటే.. సదరు వ్యక్తి స్థాయి పెద్దదైనా అయి ఉండాలి. సదరు వ్యక్తి ప్రస్తావించిన అంశాలతో జరిగే నష్టం భారీగా ఉండి ఉండాలి. ఈ లెక్కన చూస్తే.. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా బండి సంజయ్ మాటలు మంత్రి హరీశ్ కు ఇబ్బందికి గురి చేయటమే కాదు.. ఇటీవల కాలంలో దుబ్బాకలో కమలనాథుల కటౌట్ కు విలువ పెరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటివేళలో.. బండి సంజయ్ నోటి నుంచి ఒక మాటలతో ఉన్న టెక్నికల్ అంశాన్నిప్రత్యేకంగా చూపిస్తూ..తీవ్రమైన సవాల్ కు తెర తీశారు మంత్రి హరీశ్.

ఇంతకూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్య ఏమిటి? మంత్రి హరీశ్ అంతలా ఎందుకు రియాక్టు అయ్యారన్నది చూస్తే.. తెలంగాణలో బీడీ కార్మికులకు ఇచ్చే రూ.2వేల పింఛన్ లో రూ.1600 ప్రధాని మోడీ ఇస్తున్నట్లుగా బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని.. బీడీ కార్మికులకు ఇచ్చే పింఛనులో పదహారు పైసలు కూడా మోడీ ఇవ్వట్లేదని హరీశ్ వ్యాఖ్యానించారు. ఒకవేళ.. మోడీ ఇస్తున్నట్లుగా బండి సంజయ్ నిరూపిస్తే.. తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

మంత్రి హరీశ్ లాంటి పెద్ద మనిషి.. మంత్రి పదవి రాజీనామా వరకు వెళ్లారంటే.. ఆయన చెప్పే మాటల్లో పస ఉందన్న విషయాన్ని ఓటర్లకుఅర్థమయ్యేలా చేయటంతో పాటు.. బీజేపీ నోటి నుంచి వచ్చేవి అసత్యాలు అన్న భావన కలుగజేయటం కూడా హరీశ్ వ్యూహంగా చెబుతున్నారు. అందుకే.. చిన్న విషయానికి తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లుగా చెప్పక తప్పదు.