Begin typing your search above and press return to search.

నా దగ్గర అప్పు తీర్చడానికి ఏం లేదు: అనిల్ అంబానీ ఆవేదన

By:  Tupaki Desk   |   26 Sep 2020 7:30 AM GMT
నా దగ్గర అప్పు తీర్చడానికి ఏం లేదు: అనిల్ అంబానీ ఆవేదన
X
ఒక వైపు భారతదేశంలోనే అత్యంత ధనవంతుడిగానే ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ రోజురోజూకు కోట్లకు పడగలెత్తుతున్నాడు. గంటగంటకు ఆయన సంపాదన పెరుగుతోంది. మరో వైపు ఆయన తమ్ముడు.. వ్యాపారవేత్త అనిల్ అంబానీ మాత్రం అప్పుల్లో కూరుకుపోయి.. వ్యాపారాలు నష్టపోయి జీరోగా మిగిలిపోతున్నాడు.

మూడు చైనా బ్యాంకులకు రుణాలు చెల్లించకపోవడంతో అనిల్ అంబానీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లండన్లోని యుకే కోర్టుకు హాజరయ్యారు. అనిల్ అంబానీ యొక్క మొత్తం అప్పులు 716,917,681 డాలర్లు (రూ .5,281 కోట్లు) మేరకు పేరుకుపోయాయి. యుకే కోర్టుకు హాజరైన అనిల్ అంబానీ మాట్లాడుతూ ప్రస్తుతానికి తన వద్ద అప్పు చెల్లించడానికి ఏమీ లేదని వాపోయాడు.

అనిల్ అంబానీ తన ఆవేదనను ఆ వీడియో కాన్ఫరెన్స్ లో వెళ్లగక్కినట్టు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన ఖర్చులను సైతం నా భార్య భరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టుల్లో చట్టపరమైన ఖర్చుల కోసం 9 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను కూడా విక్రయించానని పేర్కొన్నాడు.

ఇక అనిల్ అంబానీ వద్దనున్న లగ్జరీ కార్ల గురించి కోర్టు అడిగినప్పుడు అనిల్ స్పందించాడు. అవి కేవలం మీడియా ఊహాగానాలు మాత్రమే అని సమాధానం ఇచ్చారు. “నేను ఎప్పుడూ రోల్స్ రాయిస్ కారును ఉపయోగించలేదు. ప్రస్తుతం నా దగ్గర వాడిన కారు ఉంది. అప్పులతో నేను సాధారణ జీవితాన్ని గడుపుతున్నాను ”అనిల్ వాపోయాడు.

ఇక రిలయన్స్ ఇన్నోవెంచర్స్‌లో తన వద్ద ఉన్న 12 మిలియన్ ఈక్విటీ షేర్ల గురించి కూడా యూకే కోర్టు అనిల్ ను అడిగింది. కానీ అనిల్ అంబానీ ఈ వాటాలు పనికిరానివని పేర్కొన్నారు. వీటిపై తన తల్లికి 500 కోట్ల రూపాయలు, తన కుమారుడు అన్మోల్‌కు 310 కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయని అనిల్ కోర్టుకు తెలిపారు.

2012 లో అనిల్ అంబానీ తన రిలయన్స్ టెలికామ్ వ్యాపారం విస్తరణ కోసం మూడు చైనా బ్యాంకుల నుండి 700 మిలియన్ డాలర్ల రుణం తీసుకున్నాడు, దీనికి వ్యక్తిగత హామీ ఇచ్చాడు. ప్రస్తుతం రిలయన్స్ టెలికామ్ కంపెనీ దివాలా తీసింది. దీంతో అప్పులు తీర్చే మార్గం లేదు. ఆ బ్యాంకులు అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయించడంతో అనిల్ అంబానీ విచారణను ఎదుర్కొంటున్నారు. దీనిపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది వేచిచూడాలి.