Begin typing your search above and press return to search.

మోదీది త‌ప్పే!.. మ‌రి రాహుల్ చేసిందేమిటో?

By:  Tupaki Desk   |   15 May 2019 3:20 PM GMT
మోదీది త‌ప్పే!.. మ‌రి రాహుల్ చేసిందేమిటో?
X
ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. రాజ‌కీయంగా వైరి వ‌ర్గాల మ‌ధ్య ఈ త‌రహా సంవాదం పెద్ద‌గా త‌ప్పేమీ కూడా కాద‌నే చెప్పాలి. అయితే ఈ సంవాదం గీత దిటితేనే ఇబ్బంది. ప్ర‌స్తుతం ఈ త‌ర‌హా ఇబ్బందే ఇప్పుడు క‌నిపిస్తోంది. రాఫెల్ వివాదాన్ని ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తున్న రాహుల్‌... ప్ర‌ధానిగా ఉన్న మోదీని దొంగ‌ను చేసేశారు. చౌకీదార్ చోర్ హై... అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్య‌లు ఏ మేర క‌ల‌క‌లం సృష్టించాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అస‌లే ఎన్నిక‌లు... బ‌లంగా ఉన్న అధికార ప‌క్షాన్ని టార్గెట్ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా సాగిన రాహుల్ స‌మ‌యం, సంద‌ర్భం అన్న తేడా లేకుండా ప‌దే ప‌దే మోదీపై చోర్ వ్యాఖ్య‌లు గుప్పించారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై మోదీ చాలా కాలం పాటే స‌హ‌నంగానే కొన‌సాగారు. రాహుల్ పై ఇత‌ర విష‌యాల్లో టార్గెట్ చేస్తూ త‌న‌పై చేసిన చోర్ వ్యాఖ్య‌ల‌ను మాత్రం ఆయ‌న ప‌ట్టించుకోలేద‌నే చెప్పాలి. ఈ వివాదం కోర్టు మెట్లెక్క‌గా... కోర్టుకు సారీ చెప్పిన రాహుల్‌.. ఆ త‌ర్వాత తాను మోదీపై చేసిన చోర్ వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డే ఉన్నాన‌ని, త‌న సారీ కోర్టుకు మాత్ర‌మేన‌ని సంచ‌ల‌నం రేపారు. ఈ క్ర‌మంలో స‌హ‌నం నశించిన మోదీ... రాఫెల్ మాదిరి వివాదంగా దివంగ‌త ప్ర‌ధాని, రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీపై మ‌ర‌కేసిన బోఫోర్స్ వివాదాన్ని ప్ర‌స్తావించారు. రాజీవ్ గాంధీని భ్ర‌ష్టాచారీ నెంబ‌ర్ 1గా అభివ‌ర్ణించిన మోదీ... రాజీవ్ చ‌నిపోయేనాటికి అవినీతి సామ్రాట్టేనంటూ త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు సంధించారు.

ఈ మాట వినంగానే... రాహుల్ నిజంగానే జ్ఞానోద‌యం అయిన‌ట్టుగా గ‌గ్గోలు పెట్టారు. నేను మిమ్మ‌ల్ని మాత్ర‌మే అన్నాను గానీ, మీ ఫ్యామిలీ మెంబ‌ర్ల‌ను ఏమీ అన‌లేదు క‌దా... మ‌రి మీరు న‌న్ను టార్గెట్ చేయ‌డంతో పాటు నా ఫ్యామిలీ మెంబ‌ర్ల‌ను ఎలా టార్టెట్ చేస్తారంటూ ఓ లాజిక్ లాగారు. నిజ‌మే మ‌రి పార్ల‌మెంటులో మోదీని చూపిస్తూ రాహుల్ క‌న్ను గీటినా, త‌న సీట్లో నుంచి లేచి వెళ్లి మ‌రీ మోదీకి హ‌గ్ ఇచ్చినా ఏమ‌నొద్దు గానీ... అదే ప‌ని మోదీ చేస్తే మాత్రం పెద్ద గ‌లాటా చేయాల్సిందే అన్న‌ట్టుగా ఉంది రాహుల్ వ్యవ‌హారం. అయినా రాజీవ్ ఏమైనా గాంధీ ఫ్యామిలీకి మాత్ర‌మే సంబంధించిన వ్య‌క్తి కాదు క‌దా. దేశానికి ప్ర‌ధానిగా వ్య‌వ‌హ‌రించిన నేత క‌దా.

ప్ర‌ధానిగా రాజీవ్ తీసుకున్న నిర్ణ‌యాల్లో మంచి వాటిని మాత్ర‌మే ప్ర‌స్తుతించి... చెడ్డ వాటిని మ‌రిచిపోవాలా? మ‌రి మోదీ ఫ్యామిలీని టార్గెట్ చేయ‌న‌ని రాహుల్ అంటున్నారు క‌దా.. మోదీ ఫ్యామిలీ ఏమైనా రాజకీయాల్లో ఉన్నారా? రాజ‌కీయాల‌కు ఏమాత్రం సంబంధం లేని వారిని రాహుల్ ఎలా టార్గెట్ చేస్తారు? అయినా మోదీ ప్ర‌ధాని అయితే... ఆ కుటుంబంతో మోదీ ఎప్పుడో సంబంధాలు తెంచుకుంటే... ఇప్పుడు రాహుల్ ఆ ఫ్యామిలీని ఎలా లాగుతారు? మ‌రి కామ‌న్ సెన్స్ లేకుండా మాట్లాడ‌ట‌మంటే ఇదేనేమో. త‌న‌ను టార్గెట్ చేస్తే బేర్ మ‌న‌డం, తాను టార్గెట్ చేసిన వాళ్లు మాత్రం సైలెంట్ గా ఉండాల‌ని రాహుల్ భావిస్తే... అది ఎలాంటి లెక్కో కాంగ్రెస్ నేత‌ల‌కు, ప్ర‌త్యేకించి రాహుల్ కే తెలియాలి అన్న వాద‌న వినిపిస్తోంది.